ఉన్నత చదువులు, కుటుంబ ఆశయాలు, భవిష్యత్తుపై ఎన్నో కలలతో అమెరికాన ఓ తెలుగు యువకుడు.. ముగ్గురు స్నేహితుల ప్రాణాలను కాపాడి తన ప్రాణాలను త్యాగం చేసిన ఘటన హృదయాలను కలచివేస్తోంది. అతను మృతి చెందడంతో స్వగ్రామంలో విషాద ఛాయలు అలుముకుంటున్నాయి. రంగారెడ్డి అబ్దుల్లాపూర్‌మెట్ మండలం కవాడిపల్లి గ్రామానికి చెందిన అనూప్ రెడ్డి కోటిలతో అమెరికాకు వెళ్ళాడు. అనూప్ రెడ్డి అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ నార్త్ టెక్సాస్‌లో కంప్యూటర్ సైన్స్‌లో ఉన్నత విద్య అభ్యసిస్తున్నాడు.
అమెరికాలోని లూసియాలో ఉన్న టోరోడో పార్క్ సమీపంలోని సెబాన్ రివర్‌కు తన ముగ్గురు స్నేహితులతో కలిసి విహారయాత్రకు వెళ్లాడు. వేసవి వేడి నుంచి ఉపశమనం పొందేందుకు నదిలో ఈతకు దిగిన వారు కొంతసేపటికే ప్రమాదంలో చిక్కుకున్నారు. నీటి ప్రవాహం తీవ్రంగా ఉండటంతో ముగ్గురు స్నేహితులు ఆందోళనకు గురయ్యారు. తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ముగ్గురు స్నేహితులను రక్షించడంలో విజయం సాధించాడు. అయితే వారిని కాపాడి తాను ఒడ్డుకు చేరుకునే అవకాశం ఊహించని విషాదం సంభవించింది.
నదిలో ఉన్న ఫిషింగ్ వైరు అనూప్ కాలుకు చుట్టుకోవడంతో అతడు నీటిలో చిక్కుకుపోయాడు. ఎంత ప్రయత్నించినా చివరకు నీటిలోనే మునిగి ప్రాణాలు కోల్పోయాడు. తన స్నేహితుల ప్రాణాలను కాపాడిన హీరోగా నిలిచిన అనూప్, అదే సమయంలో మృత్యువు బారిన పడటం అందరినీ కంటతడి పెట్టిస్తోంది. చదువులో ప్రతిభ కనబరుస్తూ కుటుంబ సభ్యుల ఆశలను నెరవేర్చేందుకు కృషి చేస్తున్న అతని అకాల మరణం తల్లిదండ్రులు, బంధువులు, స్నేహితులను తీవ్ర విషాదంలోకి నెట్టింది.
ఈ విషాద వార్త కవాడిపల్లి గ్రామానికి చేరుకోవడంతో గ్రామమంతా శోకసంద్రంగా మారింది. విదేశాల్లో ఉన్న తమ కొడుకు గొప్ప స్థాయికి చేరుకుంటాడని కలలు కన్న తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. గ్రామస్థులు, బంధువులు అనూప్ ధైర్యసాహసాలను కొనియాడుతూ ఆయనకు నివాళులర్పిస్తున్నారు. ముగ్గురు ప్రాణాలను కాపాడి.. తన ప్రాణాన్ని అర్పించిన అనూప్ రెడ్డి త్యాగం ఎన్నటికీ మరువలేనిదిగా నిలిచిపోయింది. ఆయన మరణం విషాదాన్ని మిగిల్చినా, స్నేహితుల కోసం ప్రాణాలను సైతం లెక్కచేయని ధైర్యవంతుడిగా అందరి హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతాడు.
.webp)