హైదరాబాద్ అత్తాపూర్ ప్రాంతంలో మంగళవారం (మే 19) అర్ధరాత్రి కిడ్నాప్ ఘటన తీవ్ర కలకలం రేపింది. గుర్తు తెలియని దుండగులు కారులో యువతిని బలవంతంగా ఎక్కించుకుని వెళ్లిపోయిన సంఘటన స్థానికంగా భయాందోళనలకు గురిచేసింది. అర్ధరాత్రి సమయంలో అత్తాపూర్‌లోని జాయ్ ఆసుపత్రి వైపు ఒక యువతి పరుగులు తీసింది.. నన్ను కిడ్నాప్ చేస్తున్నారు రక్షించండి అంటూ ఆసుపత్రి రిసెప్షన్ వద్ద సహాయం కోరింది.
వెంటనే ఆమె ఆసుపత్రి లోపలికి వెళ్లి బాత్రూంలో దాక్కుంది. అయితే కొద్ది నిమిషాల్లోనే గుర్తు తెలియని దుండగులు ఆమెను వెంబడిస్తూ ఆసుపత్రికి చేరుకున్నారు. వారిని రిసెప్షనిస్ట్ మరియు అక్కడ ఉన్న పేషెంట్ల బంధువులు అడ్డుకోవడానికి ప్రయత్నించారు.అడ్డుకున్న వారిని బెదిరిస్తూ దుండగులు బలవంతంగా లోపలికి ప్రవేశించారు. అందరూ బాత్రూంలో దాక్కున్న యువతిని బయటకు లాగి, బలవంతంగా ఆసుపత్రి నుంచి తీసుకెళ్లి బయట నిలిపిన కారులో ఎక్కి పారిపోయారు. ఈ ఘటనను గమనించిన స్థానికులు వెంటనే 100కి కాల్ చేసి పోలీసులకు సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. అత్తాపూర్ నుంచి అరంఘర్ చౌరస్తా వరకు థార్ కారును చేజ్ చేసినప్పటికీ, దుండగులు పోలీసుల కళ్లు కప్పి పారిపోయారు. ప్లేట్ లేని కారు అయిన వారి నెంబర్ వివరాలు సేకరించడం పోలీసులకు కష్టంగా మారింది. సమాచారం అందుకున్న వెంటనే రాజేంద్రనగర్ డీసీపీ శ్రీనివాస్ తన బృందంతో ఘటనాస్థలానికి చేరుకున్నారు. పీవీఎన్ఆర్ ఎక్స్‌ప్రెస్ వే 143వ పిల్లర్ వద్ద ఉన్న సీసీటీవీ ఫుటేజ్‌ను పోలీసులు పరిశీలించారు.
మూడు గంటల పాటు సాగిన దర్యాప్తులో అనేక సీసీటీవీ కెమెరాల ఫుటేజ్‌ను పోలీసులు పరిశీలించారు.బుధవారం (మే20) ఉదయం అత్తాపూర్ జాయ్ ఆసుపత్రి వద్ద టాస్క్ ఫోర్స్ చేరుకుని మళ్లీ సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించారు. యువతి, కిడ్నాపర్స్ గుర్తింపు కోసం ప్రత్యేక బృందాలు పనిచేస్తున్నాయి.అసలు యువతి ఎవరు? అర్ధరాత్రి ఆసుపత్రికి ఎందుకు వచ్చింది? ఆమెను ఎక్కడి నుంచి వెంబడించారు? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అత్తాపూర్ నుంచి అరంఘర్ వరకు ఉన్న సీసీటీవీ కెమెరాలను పోలీసులు విచారిస్తున్నారు.
.webp)