బండి భగీరథ్ కేసు రోజురోజుకూ కొత్త మలుపులు తిరుగుతోంది. ఇప్పటికే అన్నిచర్చనీయాంశంగా మారిన ఈ కేసులో ఇప్పుడు సోషల్ మీడియా పోస్టులు కొత్త వివాదానికి దారితీశాయి. ముందస్తు బెయిల్ విచారణ జరుగుతున్న సమయంలో మహిళా జడ్జిపై సోషల్ మీడియాలో అనుచిత ఆరోపణలు, ప్రచారాలు వెలుగులోకి రావడంతో హైకోర్టు తీవ్రంగా స్పందించింది.ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణ సందర్భంగా కోర్టులోనే ఈ అంశం ప్రస్తావనకు రావడం సంచలనం సృష్టించింది. విచారణ సమయంలో సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాల గురించి జడ్జి మాధవి స్వయంగా ప్రస్తావించారని సమాచారం. కోర్టు ప్రక్రియను ప్రభావితం చేసేలా జరుగుతున్న పోస్టులు న్యాయవ్యవస్థకు పెద్ద సవాల్‌గా మారాయని భావించారు.
సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం అయిన ఒక ఆరోపణ కోర్టును ఆందోళనకు గురిచేసింది.ముందస్తు బెయిల్ కోసం జడ్జి మాధవి భర్తకు బార్ చైర్మన్ పదవి ఇస్తారని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. ఈ ప్రచారం విస్తృతంగా షేర్ అవుతూ వైరల్ కావడం, కోర్టు ప్రతిష్టకు భంగం కలిగించేలా ఉందని భావించారు. ఈ నేపథ్యంలోనే పలు సోషల్ మీడియా పోస్టులను ఆధారాలుగా సేకరించి హైకోర్టు రిజిస్ట్రార్మినార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇలాంటి నిరాధార పోస్టులు ప్రజల్లో న్యాయవ్యవస్థపై అనుమానాలు, అపనమ్మకం కలిగించే ప్రమాదం ఉందని తెలుస్తోంది.
కోర్టు నిర్ణయాలపై ప్రభావం చూపేలా సోషల్ మీడియాలో ప్రచారాలు జరగడం అత్యంత తీవ్రమైన విషయమని హైకోర్టు రిజిస్ట్రార్ ఫిర్యాదులో పేర్కొంది..ఫిర్యాదు అందుకున్న పోలీసులు వెంటనే కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సైబర్ ట్రేసింగ్ ద్వారా పోస్టుల మూలాలను గుర్తించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. సోషల్ మీడియా అకౌంట్లను గుర్తించి పోలీసులు సాక్ష్యాలను సేకరిస్తున్నారు. ఇప్పటికే వివాదస్పదంగా మారిన బండి భగీరథ్ కేసు ఇప్పుడు సోషల్ మీడియా కోణంతో మరింత సీరియస్ దశలోకి వెళ్లింది.కోర్టు విచారణను ప్రభావితం చేసేలా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తే ఎంత తీవ్రమైన పరిణామాలు ఎదురవుతున్నాయో ఈ ఘటన మరోసారి స్పష్టం చేసింది. ఇప్పుడు అందరి దృష్టి పోలీసుల దర్యాప్తుపైనే ఉంది… ఈ పోస్టుల వెనుక ఉన్నవారు ఎవరు? త్వరలో బయటపడే అవకాశం ఉంది.
.webp)