తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త అధ్యాయం మొదలైంది. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో దళపతి విజయ్ ఘనని తమిళగ వెట్రి కజగం (టీవీకే) విజయం సాధించి, ఆయన ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించారు. దశాబ్దాలుగా రాజకీయాలను శాసిస్తున్న డీఎంకే, ఏఐఏడీఎంకే వంటి బలమైన ద్రావిడ పార్టీలను కాదని, ఒంటరిగా పోరాడి విజయ్ సీఎం కావడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అయితే ఈ రాజకీయ మార్పుల మధ్య సూపర్ స్టార్ రజినీకాంత్ చుట్టూ కొన్ని వివాదాలు, విమర్శలు ముసురుకున్నాయి.
ఎన్నికల ఫలితాల తర్వాత రజినీకాంత్ డీఎంకే అధినేత, మాజీ ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్‌ను కలవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. విజయ్ సీఎం కాకుండా అడ్డుకోవడానికే రజినీకాంత్ ఈ భేటీ నిర్వహించారంటూ సోషల్ మీడియాలో, రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున పుకార్లు షికారు చేశాయి. దీనికి తోడు విజయ్ విజయంపై రజినీకాంత్ మౌనంగా ఉన్నారంటూ మరికొందరు విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలో తన పోయెస్ గార్డెన్ నివాసంలో రజినీకాంత్ ఆదివారం ఉదయం ప్రెస్ మీట్ పెట్టి ఈ వివాదంపై అత్యంత ఘాటుగా, స్పష్టంగా సమాధానమిచ్చారు.
మీడియాతో మాట్లాడిన తలైవా, తనపై వస్తున్న విమర్శలను తీవ్రంగా ఖండించారు. “నేను ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం, నాపై వస్తున్న అసత్య ప్రచారాలను అలాగే వదిలేస్తే అవే నిజాలని జనాలు నమ్మే ప్రమాదం ఉంది. రజినీ ఎప్పుడూ చౌకబారుగా ఆలోచించే వ్యక్తి కాదు” అని ఆయన స్పష్టం చేశారు. మాజీ సీఎం స్టాలిన్‌తో తనకున్న సంబంధం గురించి చెప్తూ, తమ మధ్య ఉన్నది కేవలం రాజకీయమైన స్నేహమని రజినీకాంత్ పేర్కొన్నారు.
గత 38 నుండి 40 ఏళ్లుగా తామిద్దరం మంచి స్నేహితులమని, ప్రజాస్వామ్యంలో గెలుపోటములు సహజమని అన్నారు. కొలత్తూరు నియోజకవర్గంలో స్టాలిన్ ఓడిపోవడం తనకు వ్యక్తిగతంగా బాధ కలిగించిందని, అందుకే ఒక స్నేహితుడిగా ఆయనను పరామర్శించడానికి మాత్రమే వెళ్లానని. ఈ భేటీని విజయ్‌కు వ్యతిరేకంగా చిత్రీకరించడం ఎంతమాత్రం సమంజసం కాదని రజినీకాంత్ హితవు పలికారు.
ఇక నూతన ముఖ్యమంత్రి విజయ్ గురించి మాట్లాడుతూ, ఆయనపై తనకు ఎలాంటి అసూయ లేదని సూపర్ స్టార్ తేల్చిచెప్పారు. “నేను ఎప్పుడో రాజకీయాల నుంచి తప్పుకున్నాను. నేను రాజకీయాల్లో లేనప్పుడు విజయ్ సీఎం అయితే నాకెందుకు అసూయ ఉంటుంది? ఒకవేళ నా సమకాలీనుడు కమల్ హాసన్ సీఎం అయితే నేను కాస్త అసూయపడేవాడినేమో” అంటూ రజినీకాంత్ నవ్వుతూ చమత్కరించారు.
విజయ్‌కి తనకు మధ్య దాదాపు 25 ఏళ్ల వయోభేదం ఉందని, చిన్నప్పటి నుంచి చూసిన అబ్బాయి ఇంతటి ఉన్నత స్థానానికి ఎదగడం తనకు ఆశ్చర్యంతో కూడిన ఆనందాన్ని ఇచ్చిందని కొనియాడారు. కేవలం 52 ఏళ్ల వయసులోనే ద్విధ్రువ రాజకీయాలను, అధికారంలో ఉన్న బీజేపీని ఒంటరిగా ఎదుర్కొని విజయ్ సాధించిన విజయం సామాన్యమైనది కాదని ప్రశంసించారు. లెజెండరీ నటులు ఎంజీఆర్, ఎన్టీఆర్ సైతం తమ తొలి ఎన్నికల్లో ఇంతటి ఘనవిజయం సాధించలేదని, విజయ్ వారిని మించి సాధించారని రజినీకాంత్ కొనియాడారు.
తాను విజయ్‌ను అభినందించలేదనే వార్తల్లో కూడా నిజం లేదని రజినీకాంత్ స్పష్టం చేశారు. కౌంటింగ్ రోజున ఫలితాలు రాగానే తాను ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా విజయ్‌కు, టీవీకే శ్రేణులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశానని గుర్తుచేశారు. ప్రమాణ స్వీకార మహోత్సవానికి ఎందుకు హాజరుకాలేదన్న ప్రశ్నకు సమాధానమిస్తూ, తనకు గతంలో ఏ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి కూడా వెళ్లే అలవాటు లేదని స్పష్టం చేశారు.
విజయ్‌ని నూతన ప్రభుత్వంపై ప్రజల్లో భారీ అంచనాలు ఉన్నాయని, ఆయన ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటారని ఆశిస్తున్నట్లు తలైవా ప్రకటించారు. విజయ్ సరికొత్త రాజకీయ ప్రస్థానానికి తన సంపూర్ణ మద్దతు, శుభాకాంక్షలు ఎప్పుడూ ఉంటాయని రజినీకాంత్ ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు. ఈ వివరణతో రజినీకాంత్, విజయ్ అభిమానుల మధ్య నెలకొన్న గందరగోళానికి తెరపడినట్లయింది.
.webp)