
కోరుట్ల, ముద్ర;
మనిషి జీవితంలో వంశాభివృద్ధి అనేది కేవలం కుటుంబ బాధ్యతను కొనసాగించడం కాదు, పితృఋణం తీర్చుకునే పవిత్రమైనది కూడా. ఈ వంశవృద్ది దైవానుగ్రహంతోనే సాధ్యమవుతుందని, ఆ దైవ కృపను ప్రసాదించే మహిమాన్విత స్థలం గయాక్షేత్రమని శృంగేరి శారదాపీఠ ఆస్థాన పౌరాణికులు బ్రహ్మశ్రీ డాక్టర్ గర్రెపల్లి మహేశ్వరశర్మ హృదయాన్ని తాకేలా వివరించారు.
సనాతన ధర్మ ప్రచార సమితి ఆధ్వర్యంలో జరుగుతున్న అష్టాదశ మహాపురాణ ప్రవచన జ్ఞాన యజ్ఞంలో భాగంగా కోరుట్ల వాసవి కళ్యాణ భవనంలో బుధవారం నిర్వహించిన ‘శ్రీ వరాహ మహాపురాణ సప్తాహం’ మూడవ రోజు కార్యక్రమం ఆధ్యాత్మిక వాతావరణంతో ఎంతో భక్తిశ్రద్ధల మధ్య వైభవంగా జరిగింది. ప్రారంభ సమితి పక్షాన నిర్వాహకులు పిన్నంశెట్టి భానుమూర్తి, భోగ శ్రీధర్ దంపతులు గురువందనం చేసి ఆధ్యాత్మిక శోభను చేకూర్చారు.
ప్రవచనంలో భాగంగా మహేశ్వరశర్మ గయాక్షేత్ర మహిమను వివరిస్తూ, అక్కడ పితృదేవతలకు పిండప్రదానం చేయడం, అన్నదానం నిర్వహించడం వంటి సేవలు చేస్తే పితృదేవతల ఆశీస్సులు లభించి వంశాభివృద్ధి కలుగుతుందని తెలిపారు. ముఖ్యంగా, మనం బతికున్నంత కాలం తల్లిదండ్రుల పట్ల గౌరవం, విధేయత చూపడం ద్వారానే నిజమైన పుణ్యం సిద్ధిస్తుందని భావోద్వేగంగా పేర్కొన్నారు. “నేను, నాది, నా వల్లే” అనే అహంకారం మనిషిని జీవితంలో వెనక్కి నెట్టే ప్రధాన కారణమని, ఈ అహంకారాన్ని జయించినవారే జీవితంలో నిజమైన విజయాలను అందుకుంటారని పురాణాలు చెప్పే గొప్ప సత్యాన్ని మహేశ్వరశర్మ ఎంతో హృదయస్పర్శగా వివరించారు. ఆయన మాటలు అక్కడికి హాజరైన ప్రతి ఒక్కరి మనసును కదిలించాయి.
ఈ కార్యక్రమ సమితి అధ్యక్షులు మంచాల జగన్, ప్రధాన కార్యదర్శి బట్టు హరికృష్ణ, కోశాధికారి రేగుంట రాజారాం, పురాణ కమిటీ చైర్మన్ పట్టణ ఆర్యవైశ్య సంఘ అధ్యక్షులు పడిగెల శ్రీనివాస్, పురాణ కమిటీ కన్వీనర్ ఎలిమీ బుచ్చన్న, శక్కరి వెంకటేశ్వర్లు, చౌడారపు శ్రీనివాస్, శక్కరి వెంకటేష్, ఎనగందుల శ్రీనివాస్ భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు.
