డాక్టర్ రవి… కామ్రేడ్ రవి… కర్రెగుట్టల్లో నేలకొరిగిన మనిషి…
ఈ ఫొటో చూడగానే ఒక్కసారి డాక్టర్ ఎర్నెస్టో గువేరా గుర్తొచ్చాడు. మొన్నటికి మొన్న బార్డర్‌లో ప్రాణాలు కోల్పోయిన మురళీ నాయక్ కూడా కళ్లముందు మెదిలాడు. ఉద్యమంలోకి వాళ్ల పాటలు విని పోయారు, వీళ్ల మాటలు విని ఉద్యమం లోకి పోయారు అని సొల్లు వాగే మనుషులూ గుర్తొచ్చారు.
ఎవడూ ఊరికే ఆయుధాన్ని చేతిలోకి తీసుకోడు. ఎవడూ ప్రాణాలు పోయే రిస్క్ లోకి టైమ్‌పాస్ కోసం దిగడు. ఒక సైనికుడు తన కుటుంబం కోసం, లోపల ఉన్న దేశభక్తితో సైన్యంలో చేరతాడు. మరో మనిషి దేశం మీద ప్రేమతోనే వచ్చే మార్పులో తనకుటుంబం కూడా ఉంటుందన్న కలతో సైనికుడిగా మారతాడు.
ఈ ఇద్దరూ “నేను మరణించాక నన్ను హీరోగా చూస్తారు, నాకు నివాళులు చెప్తారు” అని ఆశించకుండా తమ తమ సొంత జీవితాలకోసమో, ఆశయాలకోసమో ఆ పంథాని ఎంచుకుంటారు.
ఒక డాక్టర్ ఇలా ఎందుకు మరణించాల్సి వచ్చింది? వ్యవస్థలో మార్పు అంటూ ఇంట్లో కూర్చునో, ఏ రోడ్డు మీది ధర్నాలోనో కాసేపు కూర్చుని నామినల్ అరెస్ట్ అయి ఇంటికి రావచ్చుకదా? నాలుగు నినాదాలు ఇచ్చి, కాస్త ఎర్ర కవిత్వం రాసి విప్లవకారుడిగా ఫోజు కొట్టొచ్చు కదా…
కలలు కనలేని వాళ్లు, ప్రజల్ని ఆ కలల్లో ముంచెత్తని వాళ్ళు విప్లవకారులు కాలేరు అనే చారు మజుందార్ మాటలని ఒకసారి గుర్తు చేసుకుంటే. ఈ మరణాలకు వేరు వేరు కారణాలు మనకు కనిపించవచ్చు.
దేశాల రాజకీయ ఆటల్లో, దేశమే తన ప్రజలతో ఆడుకునే మృత్యు క్రీడల్లో బలైపోయిన, అవుతున్న వాళ్లే వీళ్లంతా. పోలీస్, సీఆర్పీఎఫ్, బీఎసెఫ్, మావోఇస్ట్ పేరేదైనా కావచ్చు. యుద్దమంటూ జరుగుతున్నప్పుడు ఇరుపక్కలా మనుషులు మరణిస్తారు.
కానీ ఇప్పుడు దేశం లోపలే జరుగుతున్నది యుద్దం కాదు… ఏకపక్ష దాడి. చర్చల కోసం ప్రతిపాదనలు చేస్తున్నా పట్టించుకోకుండా చంపుతున్నవాళ్లలో మావోయిస్టులు ఎందరు? అమాయక ఆదివాసులు ఎందరు అన్న విషయం బయటికి తెలిసే వీలే లేదు. వందల కొద్దీ ఊళ్లలో కనీస వ్యవసాయ పనులు కూడా చేసుకునే వీలు లేక బిక్కుబిక్కుమంటున్న అడవి బిడ్డల చావు కేకలు వినిపించటం లేదు.
మావోయిస్టుల సాయుధ పోరాటాన్ని వ్యతిరేకించే వాళ్లకైనా అడవిలో ఉన్న ఆదివాసుల రక్షణ విషయం గుర్తు రావటం లేదా? ఆపరేషన్ కగార్ ఆపి చర్చలకు ఆహ్వానిస్తే లొంగిపోయేవాళ్లు వచ్చేస్తారు కదా. ఎన్నో లక్షల మంది గిరిజనులుకూడా అక్కడ ఉన్నారు వాళ్లని కాపాడిన వాళ్లవుతారు కదా అనే మాట గుర్తు రాకపోవటమే విషాదం.
రేపు అక్కడ అడవుల నిర్మూలనా, మైనింగ్ మొదలైతే వాళ్ల గతి ఏమవుతుందన్న చిన్న ఆలోచన కూడా రావటం లేదా వీళ్లకి? ఆ ఖనిజాలని విదేశాలకు అమ్ముకోవటం తప్ప మనదేశానికి పనికి వచ్చే పరిశ్రమలు లేనే లేవు కదా. నా దేశానికి పనికి రాని మైనింగ్ ఎందుకు? అనే దేశ భక్తి కూడా కరవైందా?
రోజురోజుకీ మరణాల సంఖ్య పెరుగుతూనే ఉంది. పేరు తెల్సిన ఒకరిద్దరు వీరుల కోసం సంస్మరణ సభలో, నివాళ్లులో చెబుతున్నాం గానీ అసలు పేరే తెలియకుండా చనిపోతున్నవాళ్లలో నిజమైన తిరుగుబాటుదారులు ఎంతమంది? అసలు తమ మీద మోపబడ్డ కేస్ ఏమిటో కూడా తెలియకుండా ఏళ్లకేళ్లుగా రాజకీయ ఖైదీలుగా జైళ్లలో మగ్గిపోతున్న వందలమంది ఆదివాసుల రోదన ఏమవుతోంది?
ఎవరు ఎవరి మీద చేస్తున్న యుద్దం ఇది? మరణాలు ఊరికే ఉండవు, అభివృద్ది పేరిట జరిగే వినాశనానికి ప్రతి ఫలం చెల్లించకా తప్పదు. ఆనాటికి మీరుందక పోవచ్చు కానీ మీ తరువాతి తరాలు మాత్రం మీ మౌనానికి బలైపోతారని గుర్తుంచుకోండి….
ఇప్పుడు ఆపరేషన్ కగార్ మీద విప్లవ సానుభూతిపరులూ, విప్లవ వ్యతిరేకులూ పాటిస్తున్న మౌనం కచ్చితంగా ఒక యుద్దనేరం… పుట్టిన భూమికి చేస్తున్న ద్రోహమని గుర్తుంచుకోండి….
