Table of Contents
బంగారం ధరలు సామాన్యులకు అందనంత ఎత్తుకు చేరుతున్న ప్రస్తుత రోజుల్లో, కష్టపడి కూడబెట్టిన డబ్బుతో కొనుగోలు చేసిన ఆభరణాలను ఇంట్లో ఉంచుకోవాలంటేనే ఆందోళన కలుగుతోంది. ఊరెళ్లినా, ఇంట్లో ఉన్నా దొంగల భయం ప్రతిక్షణం వెంటాడుతూనే ఉంటుంది. అయితే మనం కారుకు, ఆరోగ్యానికి బీమా చేయించుకున్నట్లే.. బంగారు నగలకు కూడా ప్రత్యేకంగా ‘గోల్డ్ ఇన్సూరెన్స్’ తీసుకుంటే ఆ దిగులు పూర్తిగా తెరదించవచ్చు. ఇంట్లో చోరీ జరిగినా, అగ్నిప్రమాదం వంటి అనుకోని ఘటనల్లో నగలు దెబ్బతిన్నా ఒక్క రూపాయి నష్టపోకుండా ఈ పాలసీ మీ సంపదకు రక్షణ కవచంగా నిలుస్తుంది.
నగలకు బీమా పొందే రెండు ప్రధాన మార్గాలు
ఇంట్లో బంగారు ఆభరణాలను సురక్షితంగా ఉంచుకోవడానికి ముందు రెండు సులభమైన మార్గాలు ఉన్నాయి:
స్పెషల్ జ్యువెలరీ ఇన్సూరెన్స్: కేవలం బంగారు ఆభరణాల కోసమే ప్రత్యేకంగా రూపొందించిన పాలసీ ఇది. దొంగతనం, దోపిడీ, అగ్నిప్రమాదాల వంటి వాటి నుంచి నగల విలువకు పూర్తి స్థాయిలో రక్షణ కల్పిస్తుంది.
హోమ్ ఇన్సూరెన్స్ యాడ్-ఆన్: మీరు ఇప్పటికే ఇంటికి బీమా పాలసీ తీసుకుని ఉంటే, కొద్దిపాటి అదనపు ప్రీమియం చెల్లించి నగలను కూడా చేర్చుకోవచ్చు. డీఎఫ్‌సీ ఎర్గో , హోమ్ షీల్డ్‌హెచ్ వంటి సంస్థలు ఈ సదుపాయాన్ని అందజేస్తున్నాయి. అయితే ఇంటి బీమా ఉన్నంత మాత్రాన బంగారం దానంతట అదే కవర్ అవ్వదని గుర్తుంచుకోవాలి; ఆభరణాల వివరాలను పాలసీలో ప్రత్యేకంగా నమోదు చేయడం తప్పనిసరి.
పాలసీ తీసుకునే విధానం, అవసరమైన పత్రాలు
బీమా తీసుకునే ముందు మీ వద్ద ఉన్న బంగారం అసలు విలువను అంచనా వేసి, అందుకు తగిన కవరేజీని ఎంచుకోవాలి. పాలసీ జారీ కోసం బీమా సంస్థకు ఈ కింది పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది:
- బంగారం కొనుగోలు చేసిన అసలు రశీదులు (బిల్లులు).
- ఆభరణాల నాణ్యత, విలువను ధ్రువీకరించే వాల్యుయేషన్ సర్టిఫికెట్.
- నగలు స్పష్టంగా కనిపించేలా తీసిన ఫొటోలు.
- పాలసీదారుడి గుర్తింపు కార్డు.
దొంగతనం జరిగితే పరిహారంపొందడం ఎలా
ఒకవేళ దురదృష్టవశాత్తు ఇంట్లో చోరీ జరిగి నగలు అపహరణకు గురైతే, ఏమాత్రం ఆలస్యం చేయకుండా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసి ఎఫ్‌ఐఆర్ (ఎఫ్‌ఐఆర్) నమోదు చేయించుకోవాలి. ఆ వెంటనే బీమా కంపెనీకి సమాచారమిచ్చి ఎఫ్‌ఐఆర్ కాపీ, బంగారం కొనుగోలు బిల్లులు, పాలసీ పత్రాలను అందజేయాలి. అనంతరం ఇన్సూరెన్స్ సంస్థ సర్వేయర్ వచ్చి క్షేత్రస్థాయిలో విచారణ జరిపి, నిబంధనల మేరకు మీకు రావాల్సిన పరిహారాన్ని అందజేస్తారు.
క్లెయిమ్ రిజెక్ట్ కావొద్దంటే..
బీమా పరిహారం పొందే విషయంలో పాలసీదారులు కొన్ని కీలక నిబంధనలను తప్పక గుర్తుంచుకోవాలి. ఇంట్లో చోరీ జరిగినట్లు నిరూపించే బలమైన ఆధారాలు, పోలీస్ ఎఫ్ఐఆర్ ఉంటేనే బీమా కంపెనీ పరిహారం చెల్లిస్తుంది. కేవలం “ఇంట్లో పెట్టిన బంగారం కనిపించడం లేదు” అని చెబితే క్లెయిమ్ వర్తించదు. కాబట్టి ఆభరణం కొన్న వెంటనే బిల్లులను జాగ్రత్తగా భద్రపరుచుకోవడంతో పాటు నగల బరువు, నాణ్యత వివరాలు, స్పష్టమైన ఫొటోలను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంచుకోవాలి. సరైన డాక్యుమెంట్లు ఉంటే క్లెయిమ్ ప్రక్రియ ఎటువంటి ఆటంకాలు లేకుండా పూర్తవుతుంది.
The post బంగారం పోయినా నో టెన్షన్ appeared first on iDreamPost.
