Home Latest News అజరామరుడు పల్నాటి పులి డాక్టర్ కోడెల | అమరుడైన పల్నాడు పులి కోడెల | జన్మ వార్షికోత్సవం | ఒక రూపాయి – Andhra Waves

అజరామరుడు పల్నాటి పులి డాక్టర్ కోడెల | అమరుడైన పల్నాడు పులి కోడెల | జన్మ వార్షికోత్సవం | ఒక రూపాయి – Andhra Waves

by andhra andhrawave
0 comments
news-logo


కోడెల శివుడుగా పల్నాడు వాసుల గుండెల్లో శాశ్వతస్థానం

అమరులైనా జనం గుండెల్లో చిరస్థాయిగా జీవించి ఉండిపోతుంటారు కొందరు మహానుభావులు. భౌతికంగా దూరం అయినా వారి కీర్తి మాత్రం ఎప్పటికీ చెక్కుచెదరదు. అలా అజరామరంగా నిలిచిపోయే నేతలు కొందరే ఉంటారు. అలాంటి వారిలో ముందు వరుసలో వినిపించే పేరు డాక్టర్ కోడెల శివప్రసాద్. రూపాయి డాక్టర్‌గా.. కోడెల శివుడిగా, పల్నాటి పులిగా ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసిన ఆ మహానుభావుని జయంతి మే 2.

గుంటూరు జిల్లా, నకరికల్లు మండలం కండ్లగుంట గ్రామంలో 1947 మే 2న కోడెల శివప్రసాదరావు జన్మించారు. తల్లిదండ్రులు సంజీవయ్య, లక్ష్మీనర్సమ్మలది మధ్యతరగతి కుటుంబం. కోడెల పాఠాశాల విద్య స్వగ్రామం కండ్లకుంట, సిరిపురం, నర్సరావుపేటలలో సాగింది. విజయవాడ లయోల కళాశాలలో పీయూసీ చదివారు. చిన్నతనంలోనే తోబుట్టువులు అనారోగ్యంతో చనిపోవడం కోడెలను తీవ్రంగా కలిచివేసింది. ఆ విషాదమే ఆయనలో డాక్టర్ కావాలనే ఆలోచనకు బీజం వేసిందని సన్నిహితులు చెప్తారు. మొదటి సారి మెడికల్ ఎంట్రన్స్‌లో మంచి మార్కులు రాబట్టారు. రెండున్నరేళ్ళ తర్వాత గుంటూరుకు మారి అక్కడే ఎంబీబీఎస్ పూర్తి చేశారు వారణాసిలో ఎం.ఎస్.చేశారు. సత్తెనపల్లి మాజీ ఎమ్మెల్యే, డాక్టర్ రావెల వెంకట్రావు దగ్గర కోడెల సహాయకుడిగా పనిచేశారు. నరసరావుపేటలో సొంత హాస్పిటల్ నెలకొల్పి వైద్యవృత్తి తరువాత జరిగింది. రావెల వెంకట్రావు స్ఫూర్తితో.. పేదల కష్టాలు తెలిసిన వ్యక్తి గ్రామీణులకు తక్కువ ఖర్చుతో మెరుగైన వైద్యసేవలు అందించిన డాక్టర్ కోడెల శివప్రసాదరావు రూపాయి వైద్యుడిగా ఖ్యాతి గండించారు. కోడెల ఎంబీబీఎస్ చదువుతుండగానే వివాహమైంది. భార్య శశికళ గృహిణి. పెద్ద కుమారుడు శివరామకృష్ణ క్యాన్సర్ సర్జన్. కుమార్తె విజయలక్ష్మి గైనకాలజిస్టు. రెండో అబ్బాయి సత్యనారాయణ ఎముకల స్పెషలిస్టు. రెండో అబ్బాయి ప్రమాదవశాత్తూ ఒక రోడ్డు ప్రమాదంలో మరణించాడు.

కోడెలకు రాజకీయాల మీద ఆసక్తి లేకపోయినా.. ఎన్టీఆర్ పిలుపు మేరకు 1983లో తెలుగుదేశం పార్టీలో చేరారు. మొదటిసారి నరసరావుపేట నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించినప్పుడు.. ఒకవైపు ఎమ్మెల్యేగా పనుల ఒత్తిడిలో ఉంటూనే, మరోవైపు ప్రజలకు వైద్యసేవలు అందిస్తూ వైద్యవృత్తికి సార్ధకత చేకూర్చారు. కోడెల 1983 నుంచి 2004 వరకు ఐదుసార్లు నరసరావుపేట నుంచి గెలిచి.. ‘పేట కోడెల కోట’ అనిపించుకున్నారు. దానికి తగ్గట్లే ఆయన నివాసం నరసరావుపేట రాజాగారి తోట ప్రాంతంలో ఉండటం విశేషం.

కోడెల రాజకీయాల్లోకి వచ్చేనాటికి మంచి ప్రాక్టీస్ ఉన్న డాక్టర్ అయినా.. ప్రజలకు మరింత దగ్గరవ్వవచ్చన్న ఆలోచనతో పాలిటిక్స్‌లోకి వచ్చారు. కోడెల రాజకీయ జీవితం నల్లేరుపై నడకేం కాదు. పొలిటికల్ లైఫ్ అంతా ఎత్తుపల్లాలతోనే గడిచింది. కోడెల పేరు ప్రతిష్టలు చూసి ముగ్దుడైన అన్న ఎన్టీఆర్ ఆయనకు 1987లో హోం మంత్రి పదవి కట్టబెట్టారు. కోడెల హోంమంత్రిగా ఉండగానే విజయవాడలో వంగవీటి మోహనరంగా హత్య జరగడం, తర్వాత చెలరేగిన హింసాకాండతో చలించిపోయిన కోడెల.. నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఎన్టీఆర్ వద్దని వారిస్తున్నా రిజైన్ చేసి తన కమిట్‌మెంట్ చాటుకున్నారు.

కోడెలకు మొదటి నుంచి వైద్య వృత్తికే ప్రాధాన్యత ఇచ్చారు. కేబినెట్ మంత్రిగా ఉన్నప్పుడు కూడా నరసరావు పేట వస్తే తీరిక చేసుకుని సొంత హాస్పిటల్ కు వెళ్లి సర్జరీలు చేసేవారని ఆయన గురించి తెలిసిన వారు చెబుతారు. రోగుల సేవ ఇచ్చిన సంతృప్తి ఇంకెక్కడా రాదని ఆయన అంటుండేవారట. ఎన్టీఆర్ భార్య బసవతారకం పేరుతో హైదరాబాద్‌లో కేన్సర్ హాస్పిటల్ ఏర్పాటులో కోడెల కీలక పాత్ర పోషించారు. ఈ హాస్పిటల్ కు తొలి చైర్మన్ ఆయనే.

నరసరావుపేటలో అయిదు సార్లు వరుస విజయాల తర్వాత .. రెండుసార్లు ఓటమిపాలైన కోడెల, 2014లో సత్తెనపల్లి నుంచి గెలుపొంది, నవ్యాంధ్ర తొలి అసెంబ్లీ స్పీకర్‌గా పనిచేసి చరిత్రకెక్కారు. అభివృద్ధి విషయంలో తనదైన మార్క్ చూపించి ప్రజల గుండెల్లో నిలిచిపోయారు. నర్సరావుపేటలో జరుగుతున్న వ్యవస్థ అభివృద్ధి చేసి నీటి సమస్యలను అక్కడి ప్రజలు ఎప్పటికీ గుర్తుంచుకుంటారనడం అతిశయోక్తి కాదు. ఇక కోటప్పకొండను ఎవరూ ఊహించని విధంగా అభివృద్ధి చేసి జిల్లాలోనే ఒక ప్రముఖ ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా మార్చుటలో కీలక పాత్ర వహించారు.

1999లో డాక్టర్ కోడెల శివప్రసాదరావు మంత్రిగా ఉన్న సమయంలో ప్రకృతిని ఆస్వాదిస్తూ ఆలయానికి చేరుకోవడానికి చక్కని ఘాట్ రోడ్డు వేయించారు. ఘాట్ రోడ్డు మొదట్లో విజయ గణపతి, సాయిబాబా ఆలయాలు, రోడ్డు ఇరువైపులా అందమైన పూలతోటలు, దారి మధ్యలో మ్యూజియం ఏర్పాటు చేశారు. పిల్లలకోసం పార్కు, ఒక సరస్సు మధ్య చిన్ని కృష్ణుడు కాళీయమర్దనం చేసే విగ్రహం, దూరంనుంచే ఆకర్షించే బ్రహ్మ, లక్ష్మీనారాయణులు, వినాయకుడు, లక్ష్మి, సరస్వతి, పార్వతి ఒక్కచోట ఉంటే.. పెద్ద విగ్రహాలు వీక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఘాట్ రోడ్డు మార్గమద్యంలో ఉన్న జింకలపార్కు, దారి మొత్తం విద్యుద్దీపాలతో కోటప్పకొండను పెద్ద టూరిస్ట్ స్పాట్‌గా మార్చడంలో కీలక పాత్ర పోషించారు. అందుకే ఆయన కోడెల శివుడుగా పల్నాడు వాసుల గుండెల్లో నిలిచిపోయారు.

ఇక సత్తెనపల్లి ఎమ్మెల్యేగా స్వచ్ఛ సత్తెనపల్లి రూపకల్పనలో కోడెల శివప్రసాద్ తనదైన మార్క్ చూపించారు. ఒక ఉద్యమంలా సత్తెనపల్లి నియోజకవర్గం లో మరుగుదొడ్ల నిర్మాణం, శ్మశానాల అభివృద్ధి, మురికి తొలగింపుపై ప్రత్యేక దృష్టిసారించి నెరవేర్చగలిగారు. మిగిలిన ఆధునిక పనులను కొనసాగిస్తూనే ఇంటింటికీ మరుగుదొడ్డి నిర్మాణం, శ్మశానాలీకరణ, ఊరిని పరిశుభ్రంగా ఉంచుకోవటం అనే మూడింటిని ఉద్యమ స్థాయిలో నిర్వహిస్తున్నారు. కేవలం మూడున్నర నెలల వ్యవధిలో, సత్తెనపల్లి ముప్పాళ్ల, రాజుపాలెం, నకరికల్లు మండలాల్లో సుమారు ఇరవై కోట్ల రూపాయల ఖర్చుతో దాదాపు ఇరవై ఒక్క వేల మరుగుదొడ్లను నిర్మించారు. ఆ నాలుగు మండలాలతో పాటు నరసరావుపేట, రొంపిచర్ల మండలాల్లోనూ 398 శ్మశానాలను చేర్చారు. ఏ మతంవారి శ్మశానాలు వారి విశ్వాసాలకు అనుగుణంగా వాటికి తగిన రీతిలో ఆధునికీకరించారు.

ఇక ఐదంటే ఐదు రోజుల్లో యాభైవేల ఇంకుడు గుంతలు తవ్వించారు. ప్రతి గ్రామంలోనూ ఆర్.ఓ. వీటిని ఏర్పాటు చేసి వసతి కల్పించారు. గ్రామాల్లో చాలాకాలం నిర్లక్ష్యానికి గురైన ఎస్సీ, ఎస్టీ కాలనీల కోసం ఒక్కొక్కరికి ఇరవై లక్షల రూపాయల వంతున కేటాయించారు.
సత్తెనపల్లి మునిసిపాలిటీ రాష్ట్రంలో మోడల్‌ పురపాలక సంఘంగా ఎంపికైందంటే అది కోడెల ఘనతే. ఆయన హయాంలో సత్తెనపల్లి సెగ్మెంట్‌లోని ప్రతి గ్రామం, ప్రతి ఇంటి అభివృద్ధి ఎలా సాధ్యమైందనేది స్టడీ చేయడానికి, యూనిసెఫ్‌, వరల్డ్‌ ట్రేడ్‌ ఆర్గనైజేషన్‌ వంటి అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులను పంపించారు. విదేశీ దౌత్యాధికారులు సైతం సత్తెనపల్లి నియోజకవర్గంపై ఆసక్తి చూపారు. గిన్నిస్‌బుక్ ఆఫ్ రికార్డ్స్ గుర్తించింది. లిమ్కా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ జాతీయ స్థాయిలో ఒక రికార్డుగా నమోదు చేసింది.

డాక్టర్ కోడెల 2017లో తన జన్మదినం సందర్భంగా.. మరణానంతరం అవయవదానం చేసే అంశంపై ప్రజల్లో చైతన్యం పెరిగే విధంగా, నరసరావుపేటలో డాక్టర్ కోడెల శివప్రసాదరావు క్రీడాప్రాంగణంలో పదివేల మందికి పైగా అవయవదాన పత్రాలు సమర్పించే సేవా కార్యక్రమం నిర్వహించారు. భారీ ఎత్తున అవయవదానానికి అంగీకారం తెలిపి గుంటూరు జిల్లా ప్రజానీకం గిన్నీస్‌ రికార్డు సృష్టించారు.

ప్రజా వైద్యునిగా, ప్రజా పతినిధిగా ఘనమైన చరిత్రగల డాక్టర్ కోడెల శివప్రసాదరావు చరమాంకంలో విషాదంగా ముగిసింది. 2019లో జరిగిన శాసన సభ ఎన్నికల్లో కోడెల సత్తెనపల్లిలో పరాజయం పాలయ్యారు. వైసీపీ ప్రభుత్వంలో వరుస అవమానాలను భరించలేకపోయిన ఆ పౌరుషశీలి 2019, సెప్టెంబరు 16న హైదరాబాదులోని తన నివాసంలో ఆత్మహత్యకు పాల్పడి తన అశేష అభిమానులతో పాటు తెలుగుజాతిని శోకసంద్రంలో ముంచేశారు. దుర్మార్గమైన కుట్రలతో లొంగదీయాలనుకున్నవారి ప్రయత్నాలకు బెదరకుండా ఆయన దూరమవ్వడం పార్టీకి, ప్రజలకు పూడ్చలేని లోటుగా మిగిలిపోయింది. జీవితమే పోరాటంగా గడిపిన నాయకుడు. నమ్మిన నాయకుని కోసం నమ్ముకున్న కార్యకర్తలను కాపాడటం కోసం తన మీద హత్యా ప్రయత్నం.. అక్రమ కేసులు పెట్టినా ఎదుర్కొని, పల్నాడులో తెలుగుదేశం కార్యకర్తల గుండె ధైర్యంగా వ్యవహరించి చరిత్రలో నిలిచిపోయారు ఆ దివంగత నేత. చనిపోయిన తర్వాత కొందరిని కీర్తి శేషులుగా పిలుస్తుంటాం. కానీ నిజంగా కీర్తిని వదిలిపోయే వారు కోటికొక్కరే ఉంటారు. ఆ కోవలోకే వస్తారు మన పల్నాటి పులి.. డాక్టర్ కోడెల శివప్రసాదరావు. అందుకే ఆయన అమజరాముడు.. నిత్య చిరంజీవి.

డాక్టర్ కోడెల శివప్రసాద్ జయంత్రి సందర్భంగా..

You Might Also Like

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird