కేంద్ర బడ్జెట్ అనగానే… రాష్ట్రాలన్నీ మాకేంటి? అని చూస్తారు. ఈ సారి కేంద్ర బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు మేలు చేసే పలు నిర్ణయాలు ఉన్నాయి. బడ్జెట్ ప్రసంగంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారా, మూడుసార్లు ఆంధ్రప్రదేశ్ పేరు ప్రస్తావించడం విశేషం. కేంద్ర బడ్జెట్ 2026–27లో ప్రకటించిన పథకాలు, విధానాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక అభివృద్ధికి కొత్త దారులు తెరుస్తున్నాయంటున్నారు విశ్లేషకులు. కేంద్ర బడ్జెట్లో రాజధాని అమరావతికి ప్రాధాన్యత ఇచ్చారు. ఏపీ రాజధాని అమరావతి అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం 2026 -27బడ్జెట్‌లో సుమారు రూ.1,128.91 కోట్లు ప్రాథమికంగా కేటాయించింది. తర్వాత ముఖ్యంగా పరిశ్రమలు, మౌలిక సదుపాయాలు, వ్యవసాయం, తీర ప్రాంత ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చే అంశాలు ఇందులో ప్రధానంగా కనిపిస్తున్నాయి. తీర రాష్ట్రాలకు ప్రాధాన్యత ఇచ్చిన ఏపీకి పెట్టుబడుల ఆకర్షణ పెరుగుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
రాష్ట్రంలో మైనింగ్, ఉత్పత్తి, పరిశోధన, క్రమబద్ధీకరణను ప్రోత్సహించేందుకు రేర్ ఎర్త్ మినరల్స్ కారిడార్‌ను నెలకొల్పుతామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటన. పూర్వోదయ పథకం కింద ఆంధ్రప్రదేశ్ సహా ఐదు పూర్వోదయ రాష్ట్రాల్లో సమగ్ర ఈస్ట్ కోస్ట్ పారిశ్రామిక కారిడార్‌ను అభివృద్ధి చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. విశాఖ-చెన్నై పారిశ్రామిక కారిడార్‌లో భాగంగా ఈ కారిడార్ కోల్‌కతా నుంచి కన్యాకుమారి వరకు 2,500 మేర విస్తరించింది. దేశంలో ప్రపంచ స్థాయి ట్రెక్కింగ్, హైకింగ్ సౌకర్యాలను హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్, జమ్మూ కశ్మీర్, పశ్చిమ ఘాట్‌లతో పాటు తూర్పు ఘాట్‌లలో కీలకమైన అరకు లోయలో కల్పించనున్నారు. ఏపీ, తమిళనాడులో పులికాట్ సరస్సులో పక్షుల విహారాన్ని సందర్శించేందుకు ఏర్పాట్లు చేయనున్నారు.
సిటీ ఆర్థిక మండలిలో భాగంగా ఐదేళ్లపాటు రూ.5 వేలకోట్లు కేటాయిస్తున్నట్లు బడ్జెట్‌లో ప్రకటించడంతో అమరావతికి మరిన్న నిధులు లభించే అవకాశాలు ఉన్నాయి. కేంద్రం ప్రకటించిన ఏడు హైస్పీడ్ కారిడార్లలో హైదరాబాద్-బెంగళూరు, హైదరాబాద్-చెన్నై, చెన్నై-బెంగళూరు కారిడార్ల వల్ల ఆంధ్రప్రదేశ్‌కు కీలక ప్రయోజనాలు సమకూరనున్నాయి. విజయవాడ, అమరావతికి అనుసంధానం చేసే హైదరాబాద్-చెన్నై హైస్పీడ్ రైల్ కారిడార్ రాష్ట్రానికి ఇతోధికంగా ప్రయోజనం కలిపిస్తుంది. కృష్ణా–గోదావరి బేసిన్ ప్రాంతం నుంచి విశాఖ–కాకినాడ పోర్ట్ లింకేజెస్ వరకు ఇన్‌ల్యాండ్ వాటర్ ట్రాన్స్‌పోర్ట్ విస్తరణకు బడ్జెట్‌లో స్పష్టమైన దిశలో ఉంది. దీని వల్ల మత్స్య పరిశ్రమ, ఖనిజ రవాణా, వ్యవసాయ ఎగుమతుల రంగాల్లో రవాణా ఖర్చులు తగ్గే అవకాశం ఉంది.
ఇక ఫిషరీస్, కోస్టల్ ఎకానమీ అభివృద్ధిపై కూడా కేంద్రం ప్రత్యేకంగా దృష్టి సారించింది. 500 రిజర్వాయర్లు, అమృత్ సరోవర్ల అభివృద్ధి ద్వారా తీరప్రాంత మత్స్యకారులకు మౌలిక సదుపాయాలు మెరుగుపడుతున్నాయి. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, నెల్లూరు జిల్లాలకు ఈ పథకాల వల్ల ప్రత్యక్ష ప్రయోజనాలు అందే పరిస్థితి నెలకొంది. తీర ప్రాంత పరిశ్రమలకు బలం చేకూర్చే మరో అంశంగా షిప్ రిపేర్, సీప్లెన్ పథకాలు నిలుస్తున్నాయి. విశాఖపట్నం, కాకినాడ ప్రాంతాల్లో షిప్ రిపేర్ ఎకోసిస్టమ్ అభివృద్ధి చేయనున్నారు. సీప్లెన్ వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ స్కీమ్ అమలుతో పర్యాటక రంగం విస్తరించే అవకాశం ఉంది. దీని ద్వారా స్థానిక యువతకు కొత్త ఉపాధి మార్గాలు అందుబాటులోకి రానున్నాయి. వ్యవసాయ రంగంలో హై–వాల్యూ అగ్రికల్చర్, హార్టికల్చర్ పథకాలు రైతులకు ఊతమివ్వనున్నాయి. కొబ్బరి, జీడిపప్పు, కోకో వంటి పంటల అభివృద్ధికి కేంద్రం ప్రోత్సాహం అందిస్తోంది. ఉభయ గోదావరి జిల్లాలు, కోస్తా బెల్ట్‌లో ఈ కార్యక్రమాలు రైతుల ఆదాయం పెరిగేలా ఉన్నాయి.
డేటా సెంటర్లలో కీలకాలు, మౌలిక సదుపాయాలను కల్పించేందుకు వీలుగా ఏ విదేశీ కంపెనీ అయినా భారత్ నుంచి డేటా సెంటర్ ద్వారా క్లౌడ్ సేవలను అందిస్తే.. 2047 వరకూ టాక్స్ హాలిడే ప్రకటన. విశాఖలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుకు ఇప్పటికే ఒప్పందం జరిగింది. పెద్ద నగరపాలక సంస్థలకు వెయ్యి కోట్ల మేర బాండ్ల ద్వారా నిధులు సమీకరించేందుకు అవకాశం కల్పించారు. వందకోట్ల మేరకు కేంద్రమే ప్రోత్సాహకం కల్పించనుంది. దీంతో ఏపీలోని విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, తిరుపతి తదితర నగరపాలక సంస్థలకు నిధులు అందుబాటులో ఉన్నాయి. అమృత్ 2.0 ద్వారా వచ్చే నిధులతో ఏపీలోని నగరాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ఊతం లభించే అవకాశాలు ఉన్నాయి. మెడికల్ టూరిజం, రీజినల్ హబ్‌లను పీపీపీ పద్ధతిలో ఏర్పాటు చేసిన పారిశ్రామిక కారిడార్లలో 5 యూనివర్సిటీ టౌన్‌షిప్‌లను ఏర్పాటు చేయడం, నైపుణ్య శిక్షణకు అవకాశం కల్పించడం, ప్రతి జిల్లాకు ఒక మహిళా హాస్టల్ ఏర్పాటు వంటి అనేక నిర్ణయాల ద్వారా ఏపీకి ప్రయోజనం చేకూరనుంది. వీబీ జీ రామ్ జీ పథకం కింద గ్రామీణ ఉపాధికి గతంలో కంటే మరో రూ.10 వేలకోట్లు కేటాయించడం ఏపీకి ప్లస్. అలాగే పోలవరం ప్రాజెక్టుకు కూడా బడ్జెట్‌లో రూ.3320.39 కోట్ల నిధుల కేటాయింపు జరిగింది. అయితే ఈ ప్రాజెక్టు పూర్తయ్యేందుకు సవరించిన అంచనాల వ్యయం రూ.30,436.95 కోట్లు కాగా, కేంద్రం చెల్లించవలసిన మొత్తం రూ.12,157.53 కోట్లు మాత్రమే బడ్జెట్ అని పత్రాల్లో పేర్కొన్నారు.
తూర్పు తీరం వెంబడి ఉన్న ఐదు ‘పూర్వోదయ’ రాష్ట్రాల్లో ఏపీ ఒకటి. ‘పూర్వోదయ’ రాష్ట్రాలకు తాజా బడ్జెట్‌లో అనేక వరాలు. ఐదు రాష్ట్రాలకు 4 వేల ఈ-బస్సులు ఇస్తామన్నారు. అందులో ఏపీకి ఎన్ని అన్నది తేలాల్సి ఉంది. కొబ్బరి, జీడిపప్పు, కొకో పంటలను సాగు చేసే రైతుల ఆదాయాన్ని పెంచడంపై కేంద్రం దృష్టి సారించింది. ఇది రాష్ట్రంలోని రైతులకు మేలు చేయనుంది. ఏపీ సహా పలు రాష్ట్రాల్లో ‘అరుదైన ఖనిజాల’ వెలికితీతకు చర్యలు తీసుకోనున్నారు. ప్రత్యేక ఆర్థిక మండళ్ల అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయింపు వల్ల నెల్లూరులోని శ్రీసిటీ సెజ్‌కు మరిన్ని పరిశ్రమలు వచ్చే వీలుంది.
