ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన ఒక తెలుగు యువకుడు చదువుకుని, ఉద్యోగం దొరక్క.. కుటుంబానికి భారమయ్యానన్న వేదనతో అక్కడే ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కర్నూలు జిల్లాకు చెందిన 26 ఏళ్ల ఇరగనబోయిన చందు మరణం బంధుగణంలో తీరని విషాదాన్ని నింపింది. చందు చికాగోలోని డిపాల్ యూనివర్సిటీ నుంచి ఇటీవల మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశాడు. తన తమ్ముడికి ఆదర్శంగా ఉండాలని, సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్న తన తండ్రి కష్టాలను తీర్చాలని ఎన్నో కలలతో అమెరికా గడ్డపై అడుగు పెట్టాడు. అయితే చదువు తర్వాత గత కొన్ని వారాలుగా అతను ఉద్యోగం కోసం విఫలయత్నాలు చేశారు.
అక్కడ జీవించడానికి ఆర్థికంగా కుటుంబంపై ఆధార పడాల్సి రావడంతో చందు తీవ్ర మానసిక ఒత్తిడికి లోనయ్యాడు. తండ్రి శ్రమ, కుటుంబంపై ఉన్న అప్పుల భారం అతన్ని మరింత కుంగదీసి, తన గదిలోనే ఆత్మహత్య చేసుకుని తనువు చాలించాడు. ఈ విషాద వార్త సామాజిక మాధ్యమాల ద్వారా ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ దృష్టికి వెళ్లింది. ఆయన వెంటనే స్పందించూ.. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడికి విజ్ఞప్తి చేశారు. సానుకూలంగా స్పందించిన రామ్మోహన్ నాయుడు.. మృతదేహాన్ని భారత్‌కు వేగంగా చేర్చేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకుంటూ.. ఆ కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
