Table of Contents
సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్‌లో తిరుగులేని రికార్డులు ఎన్నో ఉన్నాయి. అయితే ఆయన సినిమా ప్రయాణాన్ని ఒకసారి స్పష్టంగా గమనిస్తే ఒక విచిత్రమైన సెంటిమెంట్ స్పష్టంగా కనిపిస్తుంది. మొదటి ప్రయత్నంలో బ్లాక్‌బస్టర్ ఇచ్చిన దర్శకుడిని నమ్మి రెండోసారి అవకాశం ఇస్తే.. అందులో ఎక్కువ శాతం సినిమాలు బాక్సాఫీస్ వద్ద నిరాశపరచడమే. ప్రస్తుతం ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో గ్లోబల్ రేంజ్‌లో ‘వారణాసి’ సిద్ధమవుతున్న నేపథ్యంలో.. ఈ భారీ ప్రాజెక్ట్ మహేష్ నెక్ట్స్ అడుగు ఎటు? ఎవరికి అవకాశం ఇస్తారు? ఆ పాత ‘సెకండ్ ఛాన్స్ సెంటిమెంట్’ ప్రభావం మళ్లీ ఉంటుందా అనే అంశంపై సినీ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది.
ఒక్కడు, దూకుడు, సీతమ్మ వాకిట్లో.. రెండోసారి సీన్ రివర్స్!
మహేష్ బాబును మాస్ ఐకాన్‌గా నిలబెట్టి ఇండస్ట్రీ హిట్ అందించిన దర్శకుడు గుణశేఖర్. ‘ఒక్కడు’ లాంటి భారీ విజయం తర్వాత వచ్చిన ‘అర్జున్’ ఆశించిన స్థాయిలో ఆడక యావరేజ్‌కే పరిమితమైంది. వీరిద్దరి కలయికలో వచ్చిన మూడో చిత్రం ‘సైనికుడు’ డిజాస్టర్‌గా నిలిచింది. కెరీర్ దశలో ఉన్న టైంలో ‘దూకుడు’తో సరికొత్త రికార్డులు సృష్టించిన శ్రీను వైట్లకు వెంటనే రెండోసారి ఛాన్స్ ఇస్తే.. ‘ఆగడు’ రూపంలో మహేష్ కెరీర్‌లోనే పెద్ద పరాజయం ఎదురైంది. అటు ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’తో క్లాసిక్ ఫ్యామిలీ హిట్ ఇచ్చిన శ్రీకాంత్ అడ్డాలకు రెండోసారి ఛాన్స్ ఇస్తే.. ‘బ్రహ్మోత్సవం’ రూపంలో కెరీర్‌లోనే కోలుకోలేని డిజాస్టర్ పలకరించింది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ విషయంలోనూ ఇదే జరిగింది. వీరి కాంబినేషన్‌లో వచ్చిన ఫస్ట్ సినిమా ‘అతడు’ టీవీల్లో, ప్రేక్షకుల్లో కల్ట్ క్లాసిక్‌గా నిలిచినా.. రెండో చిత్రంగా వచ్చిన ‘ఖలేజా’ థియేటర్లలో తీవ్ర నిరాశ మిగిల్చింది (తర్వాత కల్ట్ స్టేటస్ తెచ్చుకున్నప్పటికీ కమర్షియల్‌గా సక్సెస్ కాలేదు). వీరి కాంబినేషన్‌లో వచ్చిన మూడో సినిమా ‘గుంటూరు కారం’ కూడా మిక్సిడ్ టాక్‌తోనే సరిపెట్టుకుంది.
సెంటిమెంట్‌ను బ్రేక్ చేసిన పూరి, కొరటాల
మహేష్ రెండో విజయం ఇచ్చిన బాక్సాఫీస్ వద్ద మలచుకున్న దర్శకులు ఇద్దరే కనిపిస్తున్నారు. ‘పోకిరి’తో సరికొత్త చరిత్ర సృష్టించిన పూరి జగన్నాథ్.. ఆ తర్వాత ‘బిజినెస్‌మెన్’తో సాలిడ్ హిట్ కొట్టారు. అలాగే ‘శ్రీమంతుడు’తో భారీ హిట్ కొట్టిన కొరటాల శివ.. ‘భరత్ అనే నేను’తో పొలిటికల్ జానర్‌లో మరోసారి బ్లాక్‌బస్టర్ అందించారు. ‘మహర్షి’తో నేషనల్ అవార్డు సాధించిన వంశీ పైడిపల్లికి రెండో ప్రాజెక్ట్ ఖరారైనట్లే కనిపించినా, స్క్రిప్ట్ డిమాండ్ల కారణంగా మహేష్ ఆ ప్రాజెక్ట్‌ను పక్కన పెట్టారని టాక్.
‘వారణాసి’ తర్వాత మహేష్ క్రేజ్‌ను తట్టుకునేదెవరు?
‘వారణాసి’ చిత్రంతో మహేష్ బాబు ఇమేజ్ స్థాయికి వెళ్లడం ఖాయంగా మారింది. గ్లోబల్ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు వచ్చిన తర్వాత మహేష్ మార్కెట్, కథల ఎంపిక పూర్తిగా మారిపోతుందని చెబుతున్నారు. ఆ స్థాయి క్రేజ్, భారీ అంచనాలను తట్టుకునేలా ప్రాజెక్ట్‌ను హ్యాండిల్ చేయడం సాధారణ విషయం కాదని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. ‘వారణాసి’ తర్వాత గతంలో హిట్లు ఇచ్చిన దర్శకులకే మహేష్ మళ్లీ ఛాన్స్ ఇస్తారా? లేక ప్రశాంత్ నీల్, సందీప్ రెడ్డి వంగా లాంటి పాన్-ఇండియా మేకర్స్‌తో ముందుకు వెళ్తారా? ఒకవేళ టాలీవుడ్ దర్శకులకే అవకాశం ఇస్తే.. ఆ పాత ‘సెకండ్ మూవీ సెంటిమెంట్’ను దాటి మహేష్ విజయం సాధించగలరా అన్నది ప్రస్తుతం ఇండస్ట్రీలో ఆసక్తికరంగా మారింది.

