ఎంత దగ్గరికైనా సరే.. ఈ విషయాలు అస్సలు చెప్పకండి..

మనిషి జీవితం సక్సెస్ గా ఉండటానికి, కష్టాలను ఎదుర్కొని ముందుకు సాగడానికి ఆచార్య చాణక్య చెప్పిన విషయాలు ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి. ఆయన చెప్పిన విషయాలు చాణక్య నీతి పేరుతో ఎంతో ప్రసిద్ధ పొందాయి. కాలం ఎంత మారినా చాణక్య నీతిలో చెప్పిన సూత్రాలు నేటి ఆధునిక కాలంలో అందరికీ వర్తించేలా, అందరూ ఆచరించదగినవిగా ఉంటాయి. ఇంకా చెప్పాలంటే.. మనిషి స్వభావాన్ని ఆయన వేల ఏళ్ల కిందటే ఖచ్చితంగా అంచనా వేసి ఈ విషయాలన్నీ చెప్పగలిగారు.
సాధారణంగా మనకు ఏ కష్టం వచ్చినా, ఏ సంతోషం కలిగినా ముందుగా కుటుంబ సభ్యులతో పంచుకోవాలని అనుకుంటాం. రక్తం పంచుకుని పుట్టిన వాళ్ళు లేదా చాలా సన్నిహితులు అయితే కొన్ని విషయాలు ఎవరితోనూ పంచుకోని ఆచార్య చాణక్య హెచ్చరిస్తున్నారు. కొన్ని విషయాలు ఎంత దగ్గరి వ్యక్తులకు కూడా చెప్పకుండా రహస్యంగా ఉంచితేనే జీవితంలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా సంతోషంగా ఉండగలమని ఆయన స్పష్టం చేశారు. ఆ విషయాలు ఏంటో వివరంగా తెలుసుకుంటే..
ఆర్థిక ఇబ్బందులు..
వ్యాపారంలో నష్టం వచ్చిందా లేక ఎవరి వద్దనైనా అప్పులపాలైనా ఆ కుటుంబ సభ్యులకు చెప్పకుండా ఉండటమే మంచిదని చాణక్యుడు అభిప్రాయపడ్డారు. ఈ రకమైన ఆర్థిక సమస్యల గురించి ముందే చెబితే వారు అనవసరంగా ఆందోళన చెందుతారు. దీనివల్ల ఇంటి వాతావరణం కూడా నిరాశానిస్పృహలతో నిండిపోతుంది. ఒకవేళ నిజంగా ఇంట్లో వారి ఆర్థిక సహాయం లేదా సలహా అవసరమైతే తప్ప మిగిలిన సమయాల్లో ఆర్థిక ఎవరికీ చెప్పకుండా సమస్యలు ఉండటమే చాలా మంచిది.
భార్యాభర్తల వ్యక్తిగత గొడవలు..
వైవాహిక జీవితంలో భార్యాభర్తల మధ్య చిన్నపాటి మనస్పర్ధలు లేదా గొడవలు రావడం సర్వసాధారణం. అయితే ఈ వ్యక్తిగత విషయాలను ఎట్టి పరిస్థితుల్లోనూ కుటుంబంలోని ఇతర సభ్యులకూ లేదా బయటి వ్యక్తులకూ చెప్పకూడదు. అందరి ముందు చర్చించడం వల్ల మీపై ఇతరులకు గౌరవం తగ్గిపోతుంది. ఇంకా ఇతరులు మీ సమస్యలను చూసి పైకి సానుభూతి చూపు, వెనుక నుంచి మీ గురించి లకనగా మాట్లాడే అవకాశం ఉంది. కాబట్టి మీ సమస్యలను మీరే ప్రశాంతంగా పరిష్కరించుకోవడం మంచిది.
ఆఫీస్ లో అవమానాలు లేదా ఉద్యోగ సమస్యలు..
వృత్తి జీవితంలో ఎవరికైనా ఎప్పుడైనా అధికారుల నుంచి తిట్లు లేదా సహోద్యోగుల నుంచి అవమానాలు ఎదురుకావచ్చు. ఇలాంటి విషయాలు మీ ఇంట్లో వాళ్లతో పంచుకుంటే వారు అనవసరంగా బాధపడతారు. ఇంట్లో వాళ్ళ దృష్టిలో మీ విలువ క్రమేపీ తగ్గిపోతుంది. మిమ్మల్ని బలహీనుడిగా భావించే అవకాశం ఉంటుంది కాబట్టి వృత్తిపరమైన విషయాలను ఆఫీస్ లోనే వదిలేయడం మంచిది.
మనసులోని బలహీనతలు , భయాలు..
ప్రతి మనిషిలోనూ ఏదో ఒక బలహీనత లేదా భయం ఉంటుంది. అయితే మనకున్న ఆ బలహీనతలను ఎవరికీ, కనీసం కుటుంబ సభ్యులకు కూడా చెప్పకూడదని చాణక్య నీతి చెబుతోంది. ఎందుకంటే భవిష్యత్తులో ఎప్పుడైనా గొడవలు లేదా వాదనలు జరిగితే కొందరు వ్యక్తులు మన బలహీనతనే మనకు వ్యతిరేకంగా వాడుకుని మనల్ని మానసికంగా ఇబ్బంది పెట్టవచ్చు.
చేయబోయే పనులు లేదా లక్ష్యాలు..
ఏదైనా కొత్త వ్యాపారం చేయాలనుకున్నా, పెద్ద లక్ష్యాన్ని సాధించాలనుకున్నా ఆ పని పూర్తి అయ్యే వరకు ఎవరికీ చెప్పకూడదు. పని పూర్తి కాకముందే అందరికీ ఆ విషయం చెబితే ఇతరుల అనవసరమైన సలహాలు, సందేహాలు మీ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తాయి. అందుకే మీ విజయాన్ని ముందుగా సాధించి చూపించిన తర్వాత పదిమందితో పంచుకోవడం ఎప్పుడూ మంచి ఫలితాలను ఇస్తుంది.
*రూపశ్రీ.
