తమిళ చిత్ర పరిశ్రమలో వరుస విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. కొద్దిరోజుల క్రితం ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ దేవా కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆ విషాదం నుంచి కుటుంబం తేరుకోకముందే మరో విషాదం చోటు చేసుకుంది. దేవా మేనల్లుడు, ప్రముఖ నటుడు కార్తీక్ సబేష్ చనిపోయారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న కార్తీక్.. చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
అయితే, సోమవారం రాత్రి 11:15 గంటల ప్రాంతంలో ఆయన పరిస్థితి విషమించింది. డాక్టర్లు ఆయనను కాపాడడానికి తీవ్రంగా శ్రమించారు. అయినా కార్తీక్ ప్రాణాలు నిలబడలేదు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. కార్తీక్కు భార్య రమ్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మూడు రోజుల వ్యవధిలోనే ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు వ్యక్తులు మరణించడంతో కోలీవుడ్ తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది.
కార్తీక్ అంత్యక్రియలు మంగళవారం సాయంత్రం 4:30 గంటలకు చెన్నైలోని వలసవాక్కం స్మశానవాటికలో జరిగాయి. కార్తీక్ తమిళంలో ‘దమ్’, ‘వల్లవన్’, ‘పట్టతు యానై’, ‘కులిర్ 100’ వంటి పలు చిత్రాలలో సహాయ నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. వల్లవన్, ఎన్హెచ్4 సినిమాలు తెలుగులో డబ్ అయ్యాయి.
దిగ్గజ సంగీత దర్శకుడు దేవా.. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళాల్లో 400 కంటే ఎక్కువ చిత్రాలకు అద్భుతమైన సంగీత భాష అందించారు. రజనీకాంత్ సూపర్ హిట్ చిత్రాలైన బాషా, అన్నామలై, అరుణాచలం సినిమాలకు ఆయనే సంగీత దర్శకుడు. దేవా మరణానికి సూపర్ స్టార్ రజనీకాంత్, కమల్ హాసన్, తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ సహా పలువురు ప్రముఖులు నివాళులర్పించారు.

