హైదరాబాద్ నగరంలో ఉదయం నుంచి ఓ అవినీతి తిమింగలం ఇంట్లో నిరోధక శాఖ (ఏసీబీ) సోదాలు కొనసాగుతున్నందున స్థానికంగా తీవ్ర కలకలం రేగింది. హైదరాబాద్ జలమండలి జనరల్ మేనేజర్ అనంత లక్ష్మి కుమార్ నివాసంలో ఈరోజు ఉదయం నుంచి ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టారు. దాదాపు 10 గంటల పాటు ఈ సోదాలు కొనసాగుతున్నాయి. ఏసీబీ అధికారులు ఈరోజు తెల్లవారుజాము నుండి హైదరాబాదు నగరంలో ఏకకాలంలో మొత్తం ఎనిమిది చోట్ల విస్తృతంగా సోదాలు నిర్వహించారు.
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో మల్లాపూర్‌లోని జలమం డలి జనరల్ మేనేజర్ అనంత లక్ష్మి కుమార్ నివాసంలో సోదాలు జరిగాయి. ఇంట్లో ఎక్కడపడితే అక్కడ కుప్పలు కుప్పలుగా ఉన్న డబ్బులు అన్నీ చూసి ఒక్కసారిగా అవాక్కయ్యారు.. ఇంట్లో రూ.1 కోటి కంటే ఎక్కువ నగదు, సుమారు కిలో బంగారం, బ్యాంక్ లాకర్ నుంచి అదనంగా రెండు కిలోల బంగారం, కిలోల కొద్దీ బంగారు ఆభరణాలు, రెండు కార్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
దర్యాప్తు కొనసాగుతున్న కొద్దీ భారీ స్థాయిలో ఆస్తులు వెలుగులోకి వస్తున్నాయి. అధికారుల దర్యాప్తులో హైదరాబాద్‌లో గేటెడ్ కమ్యూనిటీల్లో మూడు ఫ్లాట్లు, ఆరు ఓపెన్ ప్లాట్‌లు, కమర్షియల్ కాంప్లెక్స్, విల్లాలు, అదనంగా నిజామాబాద్‌లో మూడు ఎకరాల భూమి, 39 ఎకరాల వ్యవసాయ భూమిని అధికారులు గుర్తించారు. పలు బ్యాంక్ అకౌంట్లు, లాకర్లు కూడా వెల్లడయ్యాయి.సోదాల్లో భాగంగానే ఏసీబీ అధికారులు జీఎం కుమార్ భార్యను వెంట తీసుకుని బ్యాంకులకు వెళ్లి లాకర్లు తెరిపించారు. లాకర్లలో ఉన్న పత్రాలు, ఆస్తుల వివరాలను పరిశీలించిన అధికారులు మరిన్ని ఆస్తులకు సంబంధించిన కీలక డాక్యుమెంట్లు లభించినట్లు పేర్కొన్నారు.
లాకర్ల పరిశీలన పూర్తయ్యాక వాటిని తిరిగి నివాసానికి తీసుకువెళ్లి పరిశీలన కొనసాగించిన సమాచారం… ఇప్పటివరకు స్వాధీనం చేసుకున్న పత్రాలు, వివరాల ఆధారంగా మార్కెట్ విలువ ప్రకారం మొత్తం ఆస్తుల విలువ రూ.200 కోట్లకు పైగా ఉన్నట్లు ఏసీబీ అధికారులు అంచనా వేస్తున్నారు. మల్లాపూర్‌లోని కుమార్ ఇంట్లో ఏసీబీ డీఎస్పీ మజీద్ అలీ ఖాన్ ఆధ్వర్యంలో తనిఖీలు జరిగాయి…సోదాలు రాత్రి వరకు కొనసాగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈ వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
.webp)