Home Latest News హోర్ముజ్ జలసంధి ఓపెన్.. అయినా తొలగని యుద్ధ భయం | హార్ముజ్ జలసంధి తెరవబడింది | యుద్ధం | భయం | ఇప్పటికీ – Andhra Waves

హోర్ముజ్ జలసంధి ఓపెన్.. అయినా తొలగని యుద్ధ భయం | హార్ముజ్ జలసంధి తెరవబడింది | యుద్ధం | భయం | ఇప్పటికీ – Andhra Waves

by andhra andhrawave
0 comments
news-logo


గడిచిన ఏడు వారాలుగా ప్రపంచాన్ని వణికించిన పర్షియన్ గల్ఫ్ ఉద్రిక్తతలు ఒక కీలక మలుపు తిరిగాయి. అంతర్జాతీయ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హార్ముజ్ జలసంధిని ఇరాన్ ప్రభుత్వం పూర్తిగా పునఃప్రారంభించింది. యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ, ఈ జలసంధి మూసివేతతో ప్రపంచవ్యాప్తంగా చమురు సరఫరా నిలిచిపోతుందన్న ఆందోళనలు వ్యక్తమయ్యాయి. అయితే, ప్రస్తుత కాల్పుల విరమణ నేపథ్యంలో ఈ మార్గం తిరిగి తెరవడంతో గ్లోబల్ ఎకానమీకి భారీ ఊరట లభించినట్లే. ఈ నిర్ణయం వెలువడిన వెంటనే అంతర్జాతీయంగా సానుకూల పరిణామాలు కనిపించాయి. ప్రపంచ వాణిజ్యంలో ఐదో వంతు వాటా కలిగిన ఈ మార్గం గుండా నౌకల రాకపోకలు సాఫీగా సాగడంతో, ముడి చమురు ధరలు 10 శాతం కంటే ఎక్కువగా పడిపోయాయి. అటు అమెరికా స్టాక్ మార్కెట్లు సైతం భారీ లాభాల్లో ముగిశాయి. ఆసియా మరియు యూరోప్ దేశాలకు, ముఖ్యంగా చమురు దిగుమతులపై భారత్, చైనా వంటి దేశాలకు ఇది తక్షణ ఆర్థిక ఊపిరిని అందించింది.

అయితే, హోర్ముజ్ జలసంధి తెరుచుకున్నంత మాత్రాన సమస్య పూర్తిగా సర్దుమణిగిందని భావించలేము. ఇక్కడే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తనదైన శైలిలో ద్వంద్వ వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్ల కోసం జలసంధిని ఓపెన్ చేసినప్పటికీ.. ఇరాన్‌లోని ప్రధాన ఓడరేవులపై అమెరికా నౌకాదళ దిగ్బంధం ఇంకా కొనసాగుతోంది. అంటే.. ప్రపంచానికి చమురు అందుబాటులోకి వచ్చేలా చేస్తూనే.. ఇరాన్ సొంత ఆర్థిక వ్యవస్థను మాత్రం అమెరికా తన అదుపులో ఉంచుకుంది. శాంతి చర్చలలో ఇరాన్‌ను లొంగదీసుకోవడానికి వాషింగ్టన్ దీనిని ఒక బలమైన ‘లీవరేజ్’గా ఉపయోగిస్తోంది. శాంతి చర్చల తదుపరి ఘట్టం ఇప్పుడు పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్‌కు చేరడం విశేషం. ఈ వారాంతంలోనే అమెరికా, ఇరాన్ ప్రతినిధుల మధ్య రెండో రౌండ్ ప్రత్యక్ష చర్చలు ఇక్కడ జరిగే అవకాశం ఉంది. పాకిస్తాన్‌కు అటు అమెరికాతో రక్షణ సంబంధాలు, ఇటు ఇరాన్‌తో సున్నితమైన సరిహద్దు సంబంధాలతో ఇస్లామాబాద్‌ను వేదికగా నిర్ణయించారు.

ఒకవేళ ఇక్కడ ఒప్పందం ఖరారైతే, స్వయంగా ట్రంప్ పాకిస్థాన్ సందర్శించే అవకాశం ఉందన్న వార్తలు ఆ దేశ దౌత్య ప్రతిష్ఠను పెంచుతున్నాయి. కేవలం పాకిస్తాన్ మాత్రమే కాకుండా, సౌదీ అరేబియా, ఖతర్ మరియు టర్కీ వంటి దేశాలు కూడా ఈ సంక్షోభ నివారణకు మధ్యవర్తులుగా ఉన్నాయి. పాక్ సైన్యాధిపతి జనరల్ ఆసిమ్ మునీర్ ఇప్పటికే తెహ్రాన్‌లో కీలక నేతలతో భేటీ అయ్యారు. గల్ఫ్ ప్రాంతంలో శాశ్వత శాంతి నెలకొల్పడం మరియు భవిష్యత్తు భద్రతా ముసాయిదాను రూపొందించడంలో ఈ ప్రాంతీయ దేశాల పాత్ర కీలకంగా మారింది.ప్రస్తుతం చర్చల బళ్లపై ఉన్న ప్రధాన అంశం ‘డబ్బుకు ప్రతిగా అణు నియంత్రణ’. సుమారు మూడు పేజీల ఫ్రేమ్‌వర్క్ డాక్యుమెంట్‌పై ఇరు దేశాల ప్రతినిధులు కసరత్తు చేస్తున్నారు.

దీని ప్రకారం, అమెరికా ఆంక్షల వల్ల విదేశాల్లో స్తంభించిపోయిన బిలియన్ డాలర్ల నిధులను ఇరాన్ తిరిగి పొందుతుంది. బదులుగా, ఇరాన్ తన వద్ద ఉన్న ఎన్‌రిచ్డ్ యురేనియం నిల్వలను తగ్గించుకోవాలి లేదా వేరే దేశానికి తరలించాలి. ఇరాన్ కూడా తన సార్వభౌమత్వానికి భంగం కలగకుండా, ఆర్థిక ప్రయోజనాలే లక్ష్యంగా చర్చలు జరుపుతోంది. తమ అణు కార్యక్రమం శాంతియుతమైనదని వాదిస్తున్న తెహ్రాన్, గౌరవప్రదమైన రీతిలో ఆకాంక్షల నుంచి విముక్తి కోరుకుంటోంది. గతంలో జరిగిన దాడుల్లో ధ్వంసమైన సైట్ల నుంచి ‘న్యూక్లియర్ డస్ట్’ ఇచ్చేందుకు సిద్ధమనడం ద్వారా, పర్యవేక్షణకు తాము వ్యతిరేకం కాదనే సంకేతాన్ని ఇరాన్ పంపింది. ఒక్క ముక్కలో చెప్పాలంటే.. హోర్ముజ్ జలసంధి పునఃప్రారంభం అనేది శాంతి దిశగా పడిన ఒక ముందడుగు మాత్రమే, అది అంతిమ పరిష్కారం కాదు. ప్రస్తుతం ఇరు పక్షాల మధ్య చర్చల్లో వేగం పెరిగినప్పటికీ, ఆంక్షల తొలగింపు, అణు వెరిఫికేషన్ మెకానిజంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఏదైనా చిన్న పొరపాటు లేదా మూడో పక్షం ప్రమేయం జరిగితే ఈ చర్చలు మళ్లీ మొదటికి వచ్చే ప్రమాదం కూడా పొంచి ఉంది.

ఆ ప్రమాదం ఇప్పటికే ముంచుకుంది కూడా. ట్రంప్ నౌకాదళ దిగ్బంధనం ప్రకటన చేసిన తరువాత ఇరాన్ షార్ప్ రియాక్ట్ అయ్యింది. హర్మూజ్ జలసంధిని మూసేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చినట్లైంది. ఈ పరిస్థితుల్లో ఇస్లామాబాద్‌లో శాంతి చర్చల వ్యవహారం కూడా డోలాయమానంగా మారింది.

– సీతారాం కంఠమనేని

You Might Also Like

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird