
ముద్ర, నల్గొండ :
నల్లగొండ పట్టణంలోని చారిత్రాత్మక పానగల్ పచ్చల సోమేశ్వరాలయం, ఛాయా సోమేశ్వరాలయాలకు యునెస్కో గుర్తింపు వచ్చేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టేందుకు రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి ఆయా ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి పట్టు వస్త్రాలు సమర్పించారు. వందల ఏళ్ల చరిత్రను సాక్షిగా నిలబెట్టుకున్న ఈ ప్రాచీన దేవాలయాలు తెలంగాణ సంస్కృతి, శిల్పకళ వైభవానికి ప్రతీకలు అని కొనియాడారు. 11–12వ శతాబ్దాలకు చెందిన ఈ ఆలయాల్లో అద్భుతమైన శిల్ప సంపద ఉట్టిపడుతుందని చెప్పారు. ముఖ్యంగా ఛాయా సోమేశ్వరాలయం గర్భగుడిలో ఎల్లప్పుడూ ఒకే విధంగా కనిపించే నీడ విశేష ఆకర్షణ అని గుర్తుచేశారు. ఈ ఆలయాలను పర్యాటకంగా మరింత అభివృద్ధి చేయడానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.