ఉత్సాహంగా ఓటేసిన పుర ప్రజలు
పలు చోట్ల ఉద్రిక్తతలు
ప్రధాన పార్టీల మధ్య వాగ్వాదాలు, ఘర్ణాలు
కరీంనగర్ లో పోలీసుల లాఠీచార్జి, బీజేపీ ఆందోళన
కరీంనగర్ దొంగ ఓటు వేసేందుకు విఫలయత్నం
ఆదిలాబాద్ పట్టణంలోని రాంనగర్ పోలింగ్ బూత్ కు కత్తితో వచ్చిన మహిళా
నిజామాబాద్‌లో వైసీపీ, కానిస్టేబుల్ కు ఎంపీ ధర్మపురి క్లాస్
సంగారెడ్డి పట్టణం 34వ వార్డులో సీఐపై విరుచుకుపడ్డ జగ్గారెడ్డి
బోధన్ పట్టణంలో ఎంఐఎం, బీఆర్ఎస్ శ్రేణుల బాహాబాహీ
భూపాలపల్లిలో రోడ్డుపైనే నోట్ల కట్టలు విసిరిన వ్యక్తి అరెస్ట్
నర్సంపేట మున్సిపాలిటీలో డబ్బులు పంచుతూ పట్టుబడ్డ వ్యక్తి
జనగామ మున్సిపాలిటీలో ఓటు కోసం డబ్బులివ్వలేదంటూ మహిళల ఆందోళన
కరీంనగర్ లో ఎన్నికల సిబ్బందిపై పిచ్చి కుక్కల దాడి
కొడంగల్‌లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఓటేసిన సీఎం
కరీంనగర్ లో ఓటు హక్కు వినియోగించుకున్న కేంద్రమంత్రి బండి
సీఎం ఢిల్లీ టూర్ పై సర్వత్రా ఆసక్తి
ముద్ర, తెలంగాణ బ్యూరో :
చెదురు ముదురు సంఘటనలు మినహా… తెలంగాణలో మున్సిపల్ పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. రాష్ట్రంలో 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు సంబంధించి బుధవారం ఉదయం 7 గంటలకు మొదలైన పోలింగ్ ప్రక్రియ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతుంది. 5 గంటలలోపు పోలింగ్ కేంద్రాలకు చేరుకున్న ఓటర్లకు అధికారులు ఓటు వేసే అవకాశం కల్పించారు. ఓటర్లు ఉత్సాహంగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ సరణి ప్రారంభంలో ప్రశాంతంగా ప్రారంభమైనప్పటికీ పోలింగ్ ముగిసే సమయానికి రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. ప్రధాన పార్టీల మధ్య వాగ్వాదాలు, ఘర్ణాలు జరిగాయి. పలు చోట్ల రాజకీయ పార్టీ నేతలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎక్కడైనా అదుపుతప్పే పరిస్థితులు ఉంటే వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో పోలింగ్ ప్రక్రియ అంతా సజావుగా జరిగింది. ఈ ఎన్నికలకు సంబంధించిన ఓట్లు ఈ నెల 13న లెక్కించనున్నారు.
బ్యాలెట్ బాక్సుల్లో అభ్యర్థుల భవిష్యత్తు
మున్సిపాలిటీలు, సాగన్ మున్సిపల్ కార్పొరేషన్లలో తమ జెండా ఎగరేసేందుకు ప్రధాన పార్టీలు నువ్వా నేనా అన్నట్లు ప్రచార పర్వాన్ని చేపట్టారు. ప్రత్యర్థులపై మాటల తూటాలు వదులుతూ రాజకీయాన్ని రక్తికట్టించాయి. వాదనలు, సవాళ్లతో మొదలైన ప్రచార విలువలకు తిలోదకాలు దిద్దుతూ తిట్లపురాణాల వరకు చేరుకుంది. పార్టీల వ్యూహాలు, హామీలు, ప్రచార సరళిని అంతా గమనించిన ఓటర్లు పార్టీల భవిష్యత్ ను, అభ్యర్థుల అదృష్టాన్ని ఓటు రూపంలో బ్యాలెట్ బాక్కుల్లో నిక్షిప్తం చేశారు. ఓటర్లు ఎవరికి పట్టం కట్టారో రేపు తేలుతుంది. మొత్తం 116 మున్సిపాలిటీలలోని 2582 వార్డులకు 12 వార్డులు ఏకగ్రీవం కాగా మక్తల్ మున్సిపాలిటీ పరిధిలోని ఆరో వార్డులో ఒక చోట వాయిదా పడింది. ఏడు మున్సిపల్ కార్పొరేషన్లకు సంబంధించిన 414 డివిజన్లలో . రెండు ఏకగ్రీవం కాగా మిగిలిన 412 చోట్ల పోలింగ్ జరిగింది.
కరీంనగర్ లో పోలీసుల లాఠీచార్జి:
కరీంనగర్‌లోని 58వ డివిజన్ వద్ద గుమిగూడిన బీజేపీ కార్యకర్తలపై పోలీసులు లాఠీచార్జి చేశారు. ఈ ఘటనలో బీజేపీ కార్యకర్తలకు గాయాలు కాగా, ఆరుగురు కార్యకర్తల చేతులు విరిగినట్లు సమాచారం. ఈ ఘటనలో కేంద్ర మంత్రి బండి సంజయ్ వ్యక్తిగత ఫోటోగ్రాఫర్‌కు సైతం గాయాలైనట్లు తెలిసింది. బీఆర్ఎస్ నేతలు దొంగ ఓట్లు వేయిస్తున్నారని తాము చెబుతున్న తమపైనే పోలీసులు విచక్షణరహితంగా దాడిచేశారని బీజేపీ నేతలు మండిపడుతున్నారు. 58వ డివిజన్లో దొంగ ఓట్లు వేయిస్తున్నారని చెబుతుంటే.. పోలీసులు తమపై లాఠీ ఛార్జి చేయడమేంటని. పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ బీజేపీ శ్రేణులు జిల్లా పరిషత్ ముందు రోడ్డుపై బైఠాయించి నిరసనకు దిగారు అక్కడ ఉద్రిక్త వాతావరణం. ఘటన స్థలానికి అదనపు పోలీసు బలగాలు చేరుకున్నాయి. మరోవైపు కరీంనగర్ లోని 34వ డివిజన్లో దొంగ ఓట్లు వేస్తున్న వారిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. హుస్సేనీపుర ప్రాంతంలోని సూఫా కాన్వెంట్ స్కూల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఒక ఇండిపెండెంట్ అభ్యర్థికి సంబంధించిన యువకులు దొంగ ఓట్లు వేస్తూ పట్టుబడ్డారు. వారి వద్ద నుంచి ఆధార్ కార్డులను స్వాధీనం చేసుకున్న పోలీసులు, వారిని స్టేషన్‌కు తీసుకున్నారు. ఈ ఘటనపై ఎంఐఎం పార్టీ అభ్యర్థి మహమ్మద్ ఖాజా మజారుద్దీన్ తీవ్రంగా స్పందించారు. తనను ఓడించాలనే కుట్రతో ఇండిపెండెంట్ అభ్యర్థి సమీనా పర్వీన్ ప్రస్తుతం దొంగ ఓట్లు వేయించారని. ఈ బూత్‌లో జరిగిన అక్రమాల నేపథ్యంలో రీపోలింగ్ నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు. పట్టుబడ్డ యువకుల పేర్లు ఎండి మొహీబుద్దీన్, ఎండి నజీబుద్దిన్గా పోలీసులు పేర్కొన్నారు. వీరిలో ఒకరు ఖాన్‌పురా, మరొకరు సలఫీ నగర్‌కు చెందినవారిగా పేర్కొన్నారు.
ఆదిలాబాద్ పట్టణంలోని రాంనగర్‌లోని పోలింగ్ కేంద్రానికి ఓటు వేయడానికి వచ్చిన ఓ మహిళ తన వెంట కత్తిని తీసుకురావడం కలకలం రేపింది. ఆమెను తోటి ఓటర్లు, అక్కడ చూసిన సిబ్బంది షాక్‌కు గురయ్యారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు సదరు మహిళను, ఆమె భర్తను అదుపులోకి తీసుకున్నారు. ఆమె కత్తిని ఎందుకు ప్రదర్శించింది అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు.
నిజామాబాద్‌లో పోలింగ్ సరళిని పరిశీలించేందుకు వచ్చిన స్ధానిక బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ ఓ కానిస్టేబుల్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓటర్లను ప్రభావితం చేస్తున్నారన్న ఆరోపణలతో ఏసీపీతోనూ ఆయన వాగ్వివాదానికి దిగారు. నిజామాబాద్ పరిధిలోని బూత్ నంబర్ 7లో శంకర్ అనే కానిస్టేబుల్, ఒక మున్సిపల్ ఉద్యోగి కలిసి ఓటర్లు కాంగ్రెస్‌కు ఓటు వేయాలంటూ ప్రభావం చూపారు. అందుకే ఇక్కడికి వచ్చానన్నారు. ఈ మేరకు అక్కడే ఉన్న వైసీపీతో ఎంపీ మాట్లాడారు. ‘మీ కానిస్టేబుల్ తప్పు చేస్తే, మీరు చేసినట్టే’ అని ఎంపీ అరవింద్ వైసీపీని ఉద్దేశించి. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను ఆయన తన ‘ఎక్స్’ ఖాతాలో పోస్ట్ చేశారు. ‘మాకు నేర్పించినట్లు కాదు.. మీరే నేర్చుకోండి ముందు’ అంటూ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అంతకు ముందు…. వినాయక్ నగర్ డివిజన్లో ఎంపీ.. కార్యకర్తలతో మాట్లాడారు. ఓ డివిజన్లో ప్రత్యర్థులు కుల ప్రస్తావన తెస్తున్నారని కార్యకర్తలు ఆయన దృష్టికి తీసుకెళ్లారు.. అరవింద్ ఘాటుగా స్పందించారు.’క్యాస్ట్ ఫీలింగ్ తెస్తే, ఒక్కటే అడగండి.. గతంలో కాశ్మీర్లో, ఇప్పుడు బంగ్లాదేశ్‌లో హిందువులను చంపేటప్పుడు కులం చూసి చంపారా? లేక హిందువులని చంపారా? అని నిలదీయండి’ అని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.
సంగారెడ్డి మున్సిపాలిటీలో పోలీసులకు, జగ్గారెడ్డి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. 34వ వార్డులో సీఐ ఆ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి అడ్డుకుని కాలర్ పట్టుకున్నారు. దీంతో కాంగ్రెస్ శ్రేణులు సీఐ తీరుపై మండిపడ్డారు. విషయం తెలుసుకున్న జగ్గారెడ్డి పోలింగ్ సెంటర్ వద్దకు చేరుకుని పోలింగ్ ఆపేస్తానంటూ బూత్ లోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ ఘర్షణ వాతావరణం ఏర్పడింది. పోలీసులతో జగ్గారెడ్డి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. పోలీసులు జగ్గారెడ్డికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా జగ్గారెడ్డి పోలీసులపై ఘాటు వ్యాఖ్యలతో రెచ్చిపోయారు. రిగ్గింగ్ పేర్కొన్న తమ అభ్యర్థిపై సీఐ శివకుమార్ గల్లా పట్టాడని. ఆ సీఐ మొగోడు అయితే ఇక్కడికి రావాలని ఉంది. సంగారెడ్డిలో లా అండ్ ఆర్డర్ సమస్య వస్తే దానికి సీఐ, హోంగార్డే కారణం అన్న జగ్గారెడ్డి… మొగోణ్ణి నేనో పోలీసులలో ఈరోజు తేలిపోవాలంటూ రెచ్చిపోయారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణం 21వ వార్డు పరిధిలోని అరీసా సాగర్ నగర్ లో ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. ఒకే చోట బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీల కార్యకర్తలు గుమిగూడి పరస్పర నినాదాలు చేశారు. దాంతో ఆ ప్రాంతమంతా టెన్షన్ వాతావరణం. రెండు పార్టీ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. రంగంలోకి దిగిన పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టారు. రాకసిపేట గోశాలలో బూత్ నెంబర్ 24, 78 మంది ఇతరుల పేరుతో ఓటు వేసేందుకు ఇద్దరు యువకులు వచ్చారు. తప్పుడు గుర్తింపు పత్రాలతో పోలింగ్‌కు రావడంతో అధికారులు గుర్తించి పోలీసులకు అప్పగించారు.
భూపాలపల్లి మున్సిపాలిటీలో నోట్ల కట్టలు కలకలం రేపాయి. 22వ వార్డు పోలింగ్ కేంద్రం సమీపంలో ఓ వ్యక్తి ఓటర్లకు డబ్బులు పంచుతున్నాడు. గమనించిన పోలీసులు అతడ్ని పట్టుకునేందుకు ప్రయత్నించారు. దీంతో సదరు వ్యక్తి రోడ్డుపైనే నోట్ల కట్టలు విసిరేసి అక్కడ నుంచి పరుగు తీశాడు. రూ.లక్ష నగదును స్వాధీనం చేసుకున్న పోలీసులు.. పారిపోయిన వ్యక్తిని పట్టుకొని స్టేషన్‌కు స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన పార్టీ తరపున డబ్బులు పంచుతున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. వరంగల్ జిల్లా నర్సంపేట మున్సిపాలిటీలోని 24వ వార్డులో ఓ ప్రధాన పార్టీ అభ్యర్థి తరపున డబ్బులు పంచుతుండగా పట్టుకున్న పోలీసులు రూ.11,600 నగదును సీజ్ చేశారు.
జనగామ మున్సిపాలిటీలోని 23వ వార్డు పరిధికి చెందిన కొందరు ఓటర్లు.. ఆందోళనకు దిగారు. ఆ వార్డులోని సరస్వతి స్కూల్ పోలింగ్ స్టేషన్ వద్దకు చేరుకున్న కొందరు మహిళా ఓటర్లు.. తమ వార్డులో కొందరికి మాత్రమే ఓటు వేయమని డబ్బులు ఇచ్చారని.. తమకు మాత్రం ఇవ్వలేదని వారు ఆందోళనకు దిగారు. గత పదేళ్లుగా ప్రధాన పార్టీ అభ్యర్థికి ఓటు వేసి గెలిపించుకున్నామని చెప్పారు. అయినా ఈ ఎన్నికల్లో తమకు డబ్బులు ఇవ్వకుండా కొందరికే పంపిణీ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.
కరీంనగర్ జిల్లాలో షాకింగ్ ఘటన. ఎన్నికల సిబ్బంది పై పిచ్చి కుక్కలు దాడి చేశాయి. ఎన్నికల పోలింగ్ కేంద్రం ప్రాంగణంలో ఎన్నికల సిబ్బందిపై దాడి చేసిన రెండు పిచ్చి కుక్కలు అటాక్ చేశాయి. ఈ దాడిలో ముగ్గురు అధికారులు గాయపడ్డారు. గాయపడినవారికి అక్కడే ఉన్న వైద్య శిబిరంలో ప్రాథమిక చికిత్స చేసి.. వ్యాక్సిన్ ఇప్పించి ఇంటికి పంపించారు.
ఓటేసిన ప్రముఖులు

సీఎం రేవంత్‌రెడ్డి కొడంగల్‌లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఓటు వేశారు. ఈ ప్రజలందరూ కాంగ్రెస్ వైపే మొగ్గు చూపారని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజాతీర్పుతో మెజారిటీ స్ధానాలు కైవసం చేసుకుంటామని చెప్పారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కరీంనగర్ మున్సిపల్ కార్పోరేషన్‌లోని జ్యోతినగర్ పాఠశాలలో ఏర్పాటు చేసిన 361వ పోలింగ్ బూత్‌లో ఆయన తన కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి ఓటు వేశారు. అనంతరం ఓటు వేసిన బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు. ప్రజాస్వామ్యంలో ఓటు అత్యంత శక్తివంతమైన ఆయుధం అని పేర్కొన్నారు. పట్టణాల అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని ప్రతి ఒక్కరూ, ముఖ్యంగా యువత బాధ్యతగా ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన భావిస్తున్నారు. రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 33వ డివిజన్లో ఉన్ననల్లగొండ పబ్లిక్ స్కూల్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు వజ్రాయుధం లాంటిదనీ ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవాలని నిర్ణయించుకుంటారు. రాష్ట్రంలోని మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపాలిటీ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలుస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ లో అన్ని డివిజన్లలో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుని నల్గొండ మున్సిపాలిటీని మోడల్ సిటీగా అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మధిర మున్సిపాలిటీ పరిధిలోని 9వ వార్డు పోలింగ్ పోలింగ్ ఓటు హక్కును వినియోగించుకున్నారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ నిజామాబాద్‌లోని 47వ డివిజన్లో సన్ ఫ్లవర్ హైస్కూల్ పోలింగ్‌కు ఓటు వేశారు. మంత్రి వివేక్ వెంకటస్వామి మంచిర్యాల జిల్లా హైటెక్ సిటీలోని 227వ బూత్‌లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి కోదాడ పురపాలక సంఘం పరిధిలోని 14వ వార్డు 34వ బూత్‌లో ఓటు హక్కును వినియోగించుకున్నారు. మంత్రి వాకిటి శ్రీహరి మక్తల్ పట్టణంలోని 7వ వార్డులో ఓటు వేశారు. మంత్రి దామోదర రాజనర్సింహ జోగిపేటలోని 9వ వార్డులో ఓటు వేశారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పురపాలిక 11వ వార్డులో ఓటు వేసిన మంత్రి పొన్నం ప్రభాకర్ దంపతులు.. అక్కడ సెల్ఫీ తీసుకుంటున్నారు. సీపీఎం నేత తమ్మినేని వీరభద్రం తెల్దారుపల్లి పోలింగ్ కేంద్రం 16లో ఓటు హక్కు వినియోగించుకున్నారు.
నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ వినాయక్ నగర్లో ఓటు వేశారు.

ఢిల్లీలో సీఎం రేవంత్…
కొడంగల్ లో తన ఓటు హక్కు వినియోగించుకున్న సీఎం రేవంత్ రెడ్డి అక్కడ్నుంచి నేరుగా ఢిల్లీకి పయనమయ్యారు. బుధవారం సాయంత్రం అక్కడ బిజీ గడిపారు. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేతో భేటీ అయిన ఆయన నేడు రైల్వే, మందులు-రసాయననాలు, జలవనరుల శాఖ మంత్రులను కలిసే అవకాశం కనిపిస్తోంది. కాగా ఢిల్లీ పర్యటలో భాగంగా రేవంత్ రెడ్డి ఏఐసీసీ పెద్దలతో భేటీ కావడం ఆసక్తి రేపుతోంది. ఈ సందర్భంగా ప్రభుత్వం, పార్టీ తాజా పరిణామాలను సీఎం అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లినట్లు ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా పార్టీ నిర్మాణంతో పాటు మంత్రివర్గ విస్తరణపై చర్చించే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తోంది. రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటై రెండేళ్లు పూర్తి కావడంతో పాటు కేబినెట్లో మరో బెర్త్ ఖాళీగా ఉంది. మున్సిపల్ ఎన్నికల్లో సరైన రీతిలో పని చేయని మంత్రులపై చర్యలు తప్పవని సీఎం సీరియస్ వార్నింగ్ ఇచ్చారనే టాక్ ఇటీవల పొలిటికల్ సర్కిల్స్ లో వినిపించింది. ఈ నేపథ్యంలో మంత్రి విస్తరణ మరోసారి ఉండబోతోందా? ప్రస్తుత మంత్రుల పనితీరు ఆధారంగా కేబినెట్లో మార్పులు చేర్పులు ఉండబోతున్నాయా అనేది ఉత్కంఠగా మారింది.

