డిసెంబర్ 17, 2025 2:48PMన పోస్ట్ చేయబడింది

జిల్లాల కలెక్టర్లు ప్రభుత్వానికి అంబాసిడర్లుగా పనిచేయాలని, ప్రభుత్వంపై సానుకూలత రావాలంటే అధికారులదే కీలకపాత్రగా సీఎం చంద్రబాబు అన్నారు. దేశంలోని అన్ని రాష్ట్రాలు ఏపీ గురించి చర్చించుకునేలా… ప్రభుత్వంపై ప్రజలకు విశ్వసనీయత కొనసాగేలా చూడాలని అధికారులకు మార్గదర్శనం చేశారు. పొలిటికల్ గవర్నెన్సు అనేది… కలెక్టర్లు తమ ప్రతిభ ద్వారా కూటమి ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చేలా చూడాలని ముఖ్యమంత్రి చెప్పారు. ప్రతీ నిమిషం తాను మరింత ఉన్నతంగా తీర్చిద్దుకుంటున్నాని అధికారులకు ముఖ్యమంత్రి వివరించారు.
ఆంధ్రప్రదేశ్ లో ఇక నుంచి స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్స్ ఉండాలని ముఖ్యమంత్రి జిల్లా కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ తరహా విధానాన్నే పరిపాలనలోనూ తెస్తున్నట్టు సీఎం ప్రకటించారు. రాష్ట్ర సచివాలయంలో రెండు రోజుల పాటు జరుగుతున్న 5వ జిల్లాల కలెక్టర్ల సమావేశంలో వివిధ సీఎం కలెక్టర్లకు బుధవారం సూచనలు జారీ చేశారు. జిల్లా కలెక్టర్లు, అధికారుల పనితీరును స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్సే కొలమానంగా తీసుకుంటామని స్పష్టం చేశారు.
కొన్ని జిల్లాలు అనుసరించే బెస్ట్ ప్రాక్టీస్ మిగిలిన జిల్లాల్లోనూ అమలు చేయాల్సిన అవసరం ఉంది. కొన్ని అంశాల్లో ప్రజాప్రతినిధుల సేవలను కూడా వినియోగించుకోవాలని సూచించారు. అధికారులు, ప్రజాప్రతినిధులు ఎవరైనా విద్యార్ధిగానే ఉండాలని, నిరంతరం వివిధ అంశాలను తెలుసుకుంటూ అభివృద్ధిలో భాగస్వామి కావాలని చెప్పారు. కలెక్టర్ల సదస్సులో చర్చలు మొక్కుబడిగా సాగకుండా… అర్థవంతమైన సమీక్షలు, చర్చలు జరపాలన్నారు. ప్రజల్లో సంతృప్తిని పెంచేలా పౌరసేవలను అందించాలని కలెక్టర్లను నిర్ణయించారు.
ఫిర్యాదులన్నింటికీ పరిష్కారం చూపాలి
ముఖ్యమంత్రి మాట్లాడుతూ… ‘ప్రజా పాలనలో మెరుగైన ఫలితాలు సాధించేందుకు వీలుగా ఫీడ్ బ్యాక్ తీసుకుంటున్నాం. ప్రజల నుంచి వచ్చిన గ్రీవెన్సులను కూడా వేగంగా పరిష్కరించి పారదర్శకంగా ఆన్‌లైన్‌లో ఉంచండి. లిటిగేషన్లపై ప్రజల్లో చైతన్యం పెంచి వాటిని పరిష్కరించుకునేలా అవగాహన పెంచుతామని ముఖ్యమంత్రి చెప్పారు.
పరిపాలనలో పవన్, లోకేష్ భేష్
ఇళ్లు లేని పేదలు, రైతులు, మహిళలు, చిన్నారులు, యువత ఇలా అన్ని వర్గాలకు మంచి చేయడం ద్వారా ప్రజల్లో సానుకూలత వస్తుందని ముఖ్యమంత్రి సూచించారు. జీఎస్డీపీ, కేపీఐ, సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను సాధించేలా చర్చించాలన్నారు. నిర్దేశించిన లక్ష్యాల ఫలితాలు ఎలా వస్తున్నాయన్నదే ముఖ్యమని, మనం చక్కగా ప్రజలకు సేవలందిస్తున్నాం… కానీ మరింత సమర్థవంతంగా పని చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. లోటుపాట్లను సవరించుకుంటేనే ప్రజల్లో సంతృప్తి వస్తుంది.
5,757 మందికి కానిస్టేబుళ్లుగా నియామక పత్రాలు ఇవ్వడం చాలా సంతోషమనిపించిందని సీఎం అన్నారు. నియామకపత్రం తీసుకున్న ఓ కానిస్టేబుల్ తన ఊరికి రోడ్డు లేదని ఉప ముఖ్యమంత్రికి సమాచారం అందిస్తే… అదే వేదిక నుంచి ఆ రోడ్డుకు రూ. 3.90 కోట్లు ఇచ్చామన్నారు. ఉప ముఖ్యమంత్రి వేరే రంగం నుంచి వచ్చినా… పరిపాలనలో చక్కటి పనితీరు కనబరుస్తున్నారని, మంత్రి లోకేష్ గూగుల్ డేటా సెంటర్ విశాఖకు తీసుకొచ్చారని ప్రశంసించారు. గత పాలకుల నిర్వాకం వల్ల నిర్వీర్యం అయిపోయిన కేంద్ర ప్రాయోజిత పథకాలన్నీ పునరుద్ధరించామని చెప్పారు.
సూపర్ సిక్స్… సూపర్ సక్సెస్
‘సూపర్ సిక్స్‌ను సూపర్ సక్సెస్ చేశాం. పేదలకు ఆర్థికంగా అండగా ఉండేందుకే సూపర్ సిక్స్ పథకాలను తీసుకొచ్చాం. సామాజిక భద్రత పెన్షన్లను మొదటి తేదీనే అందజేస్తాం. తల్లికి వందనం ద్వారా ఎంతమంది పిల్లలు ఉంటే అందరికీ ఇస్తున్నాం. అన్నదాత సుఖీభవ ద్వారా రైతులకు రెండు విడతల్లో ఒక్కో రైతుకు రూ.14 వేలు ఇచ్చాం. దీపం-2.0, స్త్రీశక్తి, మెగా డీఎస్సీ, కానిస్టేబుల్ ఉద్యోగాలు కూడా భర్తీ చేశాం. డ్వాక్రా, మెప్మాను ఇంటిగ్రేట్ చేస్తున్నాం. పెద్దఎత్తున గృహ నిర్మాణాలు చేస్తున్నాం… అందరికీ ఇళ్లు అందేలా చేస్తున్నాం. పీ4 ద్వారా పేదలకు చేయూత అందించడమే లక్ష్యం. ప్రివెంటివ్, క్యురేటివ్, కాస్ట్ ఎఫెక్టివ్ మేనేజ్‌మెంట్ ద్వారా వైద్యారోగ్యాన్ని ప్రజలకు అందించాలి.’ అని ముఖ్యమంత్రి అన్నారు.
పీపీపీలో నిర్మిస్తే ప్రైవేట్ పరం కాదు
జిల్లాల కలెక్టర్ల సమావేశంలో పీపీపీ పద్దతిలో మెడికల్ కాలేజీల నిర్మాణంపై సీఎం స్పష్టత ఇచ్చారు. పీపీపీ ద్వారా వైద్య సేవలు మరింత మెరగవాలన్నారు. వైద్య కళాశాలలు ప్రైవేటు పరం చేసేశారని కొందరు మాట్లాడుతున్నారు… అయితే పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీల నిర్మాణం చేపడుతున్నా… అవి ప్రభుత్వ కళాశాలల పేరుతోనే నడుస్తుందని చెప్పారు. మెడికల్ కాలేజీల నిబంధనలు కూడా రాష్ట్ర ప్రభుత్వమే నిర్దేశించిందని స్పష్టం చేశారు.
70 శాతం మందికి ఎన్టీఆర్ వైద్య సేవలు ఆయా కళాశాలల్లోనే అందుతున్నాయని, సీట్లు కూడా పెరిగినట్లు వివరించారు. రూ.500 కోట్లతో రుషికొండ ప్యాలెస్ నిర్మించి డబ్బులు వృధా చేశారు, అవే డబ్బులతో రెండు మెడికల్ కాలేజీల నిర్మాణం పూర్తయి ఉంటుందని చెప్పారు. రుషికొండ ప్యాలెస్ నిర్వహణ ఇప్పుడు ప్రభుత్వానికి భారంగా మారింది.
కేంద్ర ప్రభుత్వం కూడా పీపీ కింద ప్రాజెక్టులు చేపడుతోందని అన్నారు. రోడ్లను పీపీపీ ద్వారానే నిర్మించారని… అలాగని అది ప్రైవేటు వ్యక్తులది అయిపోతుందా అని సీఎం ప్రశ్నించారు. విమర్శలు చేస్తే భయపడేది లేదని, వాస్తవాలన్నీ ప్రజలకు తెలియాలన్నారు. గత ప్రభుత్వంలో చేసిన తప్పులు చాలా ఉన్నాయని, జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఉండేవారని సీఎం అన్నారు.
