తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారికి ఓ భక్తుడు భారీ బంగారు కానుకను సమర్పించారు. చెన్నైకి చెందిన వర్దమాన్ జైన్, ఆయన భార్య రాధికా జైన్ కలిసి ఏకంగా 121 కిలోల బరువైన బంగారు ఆభరణాలను శ్రీవారికి విరాళంగా అందించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో నవంబర్ 26న ఈ ఆభరణాలను టీటీడీ అధికారులకు సమర్పించారు. ఈ భారీ విరాళం తిరుమల చరిత్రలో ఒక ప్రత్యేక ఘట్టంగా నిలిచింది. అయితే ఈ 121 కిలోల బంగారంతో తయారు చేసిన ఆభరణాల్లో ఏమేం ఉన్నాయా? వాటి ప్రత్యేకతలేంటి? ఓసారి చూసేయండి..
1. పాద కవచములు – 2
2. అందెలు – 2
3. పాగడ – 1
4. తులసిపత్ర హారము – 1
5. అష్టోత్తర శత కాసుల మాల – 1
6. చతుర్భుజ లక్ష్మీ హారము – 1
7. పులిగోరు – 1
8. అశ్వత్థ పత్ర హారము – 1
9. సాదా వడ్డాణము – 1
10. గంటల మొలత్రాడు – 1
11. సూర్య కఠారి – 1
12. కౌస్తుభం – 1
13. శ్రీవత్సం – 1
14. మోచేయి – 1
15. కటి హస్తము పై రేకు – 1
16. నాగాభరణ వడ్డాణము – 1
17. గోపు – 1
18. ఐదు పేటల కంఠెలు – 5
19. చంద్రవంకీ కంఠి – 1
20. వైకుంఠ హస్తము – 1
21. కటి హస్తము – 1
22. నాగాభరణ కడియములు – 2
23. నాగాభరణములు – 2
24. భుజకీర్తులు – 2
25. కర్ణ పత్రములు – 2
26. బావులీలు – 2
27. శాలిగ్రామ హారము – 2 (02 భాగాలు )
28. కమలం తరహా శాలిగ్రామ హారములు – 2 (02 భాగాలు )
29. శీమ కమలముల మోపుగల యజ్ఞోపవీతం – 1
30. శంఖము కవచము – 1
31. చక్రము కవచము – 1
32. ముఖపట్టి – 1
33. కిరీటము – 1
టీటీడీ అధికారిక సమాచారం ప్రకారం, మొత్తం 121 కిలోల 24 క్యారెట్ల బంగారంతో 46 ఆభరణాలను తయారు చేశారు. వీటిని 33 రకాల ఆభరణాలుగా రూపొందించారు. ఈ ఆభరణాల మొత్తం విలువ తయారీ ఖర్చులతో కలిపి రూ.207.6 కోట్లుగా టీటీడీ ప్రకటించింది. వీటిలో 106 కిలోల బంగారంతో శ్రీవారి కోసం ఆభరణాలు తయారు చేయగా, మిగిలిన 15 కిలోల బంగారంతో తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారికి బంగారు వస్త్రాన్ని రూపొందించనున్నారు.
ఈ ఆభరణాల తయారీలో బంగారంతో పాటు వజ్రాలు, ఇతర విలువైన రత్నాలను కూడా ఉపయోగించారు. టీటీడీ వెల్లడించిన వివరాల ప్రకారం, మొత్తం ఆభరణాల్లో 238.2 క్యారెట్ల వజ్రాలు, 2,247.7 క్యారెట్ల విలువైన రాళ్లు, 91.6 క్యారెట్ల నీలం రంగు నీలమణులు, 84.2 క్యారెట్ల పసుపు నీలమణులు ఉన్నాయి. అలాగే రూబీలు, పచ్చలు కలిపి 2,916.5 గ్రాముల బరువు రత్నాలను ఉపయోగించారు. శాలగ్రామ శిలలు కూడా ఆభరణాల్లో భాగంగా ఉన్నాయి.
ఈ విరాళంలో మరో ప్రత్యేకత ఏంటంటే.. మొత్తం 121 కిలోల బంగారంలో 15 కిలోలను తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి కోసం వినియోగించనున్నారు. ఆ బంగారంతో అమ్మవారికి ప్రత్యేకంగా బంగారు వస్త్రాన్ని తయారు చేయడానికి టీటీడీ అందించారు. మిగిలిన 106 కిలోల బంగారంతో తయారు చేసిన ఆభరణాలను శ్రీవారి అలంకరణ కోసం ఉపయోగించారు.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
