పాపం.. చిన్నారికి పెద్ద కష్టం వచ్చింది. ఆరేళ్ల వయసులో 60 ఏళ్ల బామ్మలా మారారు. అరుదైన జన్యుపరమైన వ్యాధి కారణంగా ఆ చిన్నారి ఎన్నో ఇబ్బందులు పడుతోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. కేరళలోని వయనాడ్‌కు చెందిన ఆరేళ్ల చిన్నారి ఐసా క్యూటిస్ లాక్సా అనే అరుదైన వ్యాధితో బాధపడుతోంది. ఐసాకు ఆరు నెలల వయసు ఉన్నప్పుడే ఆమె శరీరంపై ముడతలు రావటం తల్లిదండ్రులు గమనించారు.వైద్య పరీక్షలు చేయించుకున్నప్పుడు ‘క్యూటిస్ లాక్సా’ అనే అరుదైన జన్యుపరమైన వ్యాధి ఉన్నట్లు నిర్ధారణ అయింది.
ఈ వ్యాధి వల్ల చర్మం బిగుతును కోల్పోయి వదులుగా మారడంతో, ఆమె 80 ఏళ్ల వృద్ధురాలిగా మారింది. దీనికి పూర్తిస్థాయి చికిత్స లేకపోగా, భవిష్యత్తులో గుండె, ఊపిరితిత్తులు, కండరాలపై కూడా ప్రభావం పడే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రతి 20 లక్షల మందిలో ఒకరికి మాత్రమే వచ్చే ఈ వ్యాధి కేసులు భారత్‌లో కేవలం ఏడు మాత్రమే ఉన్నాయి. స్కూల్‌కు వెళ్లడం మొదలుపెట్టిన కొత్తలో ఐసాను తోటి పిల్లలు ‘అమ్మమ్మ’ అంటూ ఎగతాళి చేసేవారు. తల్లిదండ్రులు ప్రిన్సిపాల్‌కు విషయం వివరించారు.
ఆయన విద్యార్థులకు ఐసా ఆరోగ్యంపై అవగాహన కల్పించడంతో పిల్లల ప్రవర్తనలో మార్పు వచ్చింది. సెక్యూరిటీ గార్డుగా పనిచేసే ఐసా తండ్రికి నెలకు 12,500 రూపాయల ఆదాయం మాత్రమే వస్తుంది, కుటుంబ పోషణతో పాటు ఆమె వైద్య ఖర్చులు భరించడం భారంగా మారింది. ఎన్ని కష్టాలున్నా ఐసా ఎంతో చురుగ్గా ఉంటూ డాన్స్ నేర్చుకుంటుంది. పెద్ద డాక్టర్ అయి తనలాంటి పిల్లలకు వైద్యం చేయించడం కలలు కంటోంది. 2024లో పొరుగున ఉండే అర్జున్ ఆమె పేరుతో ఇన్‌స్టాగ్రామ్‌ను ప్రారంభించింది, ప్రస్తుతం 40 వేల మందికి పైగా ఫాలో అవుతూ చిన్నారికి మద్దతుగా నిలుస్తున్నారు.

