పిలిప్పీన్స్ కేంద్రంగా నడుస్తున్న అంతర్జాతీయ ఆన్‌లైన్ క్రికెట్ బెట్టింగ్ ముఠాను అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పోలీసులు బట్టబయలు చేశారు. ఈ ముఠాకు చెందిన 10 మందిని అరెస్ట్ చేశారు, మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. నిందితుల వద్ద నుంచి రూ.19.70 లక్షల నగదు, కారు, నాలుగు బైకులు, ల్యాప్‌టాప్‌లు, మొబైల్ ఫోన్లు, సిమ్ కార్డులు తదితర సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. అలాగే.. 9 బ్యాంకుల్లో ఉన్న రూ.18.20 లక్షల నిధులను ఫ్రీజ్ చేశారు. మొత్తం స్వాధీనం విలువ సుమారు రూ.60 లక్షలు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. కల్యాణదుర్గం పట్టణంలోని సిద్దప్పవంక వీధిలో ఓ ఇంటిలో నిందితులు డ్రీమ్ ప్లే-1 యాప్ ద్వారా క్యాసినో, రోలెంట్, డ్రాగన్, క్రికెట్ బెట్టింగ్ వంటి నిషేధిత గేమ్స్ నిర్వహించగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
పిలిప్పీన్స్ కేంద్రంగా నెట్‌వర్క్
పోలీసుల విచారణలో శివ పిలిప్పీన్స్‌లోని మాకాటి ప్రాంతాన్ని కేంద్రంగా చేసుకుని ఈ కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు తేలింది. దేశంలోని సభ్యులను నియమించి, వారి ద్వారా బ్యాంకు ఖాతాలు, సిమ్ కార్డులు సేకరించి విదేశాలకు పంపుతున్నట్లు పేర్కొన్నారు. ఫోన్‌పే ద్వారా లావాదేవీలు జరిపి అక్రమ ఆదాయం పొందుతున్నట్లు వెల్లడైంది.
మ్యూల్ ఖాతాల వినియోగం
స్థానికంగా తలారి మధు ముఠాను నడిపిస్తూ, ఇతరులను చేర్చుకుని సుమారు 70 మంది పేర్లపై బ్యాంకు ఖాతాలు తెరిపించినట్లు తెలిసింది. పాస్‌బుక్స్ కోసం వారికి రూ.10 వేల చొప్పున చెల్లించినట్లు పోలీసులు తెలిపారు. సేకరించిన సిమ్ కార్డులు, బ్యాంకు వివరాలను కార్గో పార్శిళ్లలో దాచిపెట్టి పిలిప్పీన్స్‌కు పంపినట్లు పోలీసులు గుర్తించారు.
.webp)