అమెరికా, ఇరాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలకు ముగింపు పలికే లక్ష్యంతో పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో కీలకమైన శాంతి చర్చలు ప్రారంభమయ్యాయి. అయితే, ఈ చర్చల సందర్భంగా చోటుచేసుకున్న ఒక ఉద్విగ్న పరిణామం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. యుద్ధం సృష్టించిన మానవ విషాదాన్ని ప్రపంచానికి చాటిచెప్పేలా ఇరాన్ ప్రతినిధి బృందం యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన చిన్నారులకు రక్త బ్యాసిక్తమైన స్కూల్ పాఠశాలలు, బూట్లు, వారి ఛాయాచిత్రాలను తమ వెంట తీసుకొచ్చారు. ఇరాన్ ప్రతినిథి బృందానికి ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మహమ్మద్ బఘేర్ ఘలీబాఫ్ నేతృత్వం వహించారు. ఆయన తన బృందంతో కలిసి ఇస్లామాబాద్‌కు బయలుదేరిన విమానంలో అత్యంత విషాదకరమైన దృశ్యాలు కనిపించాయి. విమానంలోని ముందు వరుస సీట్లలో ఈ వస్తువులను ఉంచి, యుద్ధం కారణంగా బలియైన పసిప్రాణాలకు నివాళి అర్పించారు.
గత ఫిబ్రవరి 28న దక్షిణ ఇరాన్‌లోని మినాబ్ పట్టణంలో జరిగిన దాడుల్లో సుమారు 168 మంది పాఠశాల విద్యార్థులు మరణించారు. ఈ దాడులకు అమెరికా, ఇజ్రాయెల్ కూటమే కారణమని ఇరాన్ అంటోంది. ఆ మరణించిన చిన్నారుల జ్ఞాపకార్థం తమ ప్రతినిధి బృందానికి మినాబ్ 168 అని పేరు పెట్టిన ఘలీబాఫ్, ఈ ప్రయాణంలో నా సహచరులు వీరే అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటో అందరినీ కలిచివేస్తోంది. నెటిజనులు కళ్లు చెమర్చాయి అంటూ చెబుతున్నారు.
ఈ చర్చల్లో అమెరికా బృందానికి ఆ దేశ ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ నేతృత్వం వహిస్తున్నారు. 2011 తర్వాత ఒక అమెరికా ఉపాధ్యక్షుడు పాకిస్తాన్ గడ్డపై అడుగుపెట్టడం ఇదే మొదటిసారి. ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలతో పాటు, టెహ్రాన్ ప్రతిపాదించిన 10 సూత్రాల కాల్పుల విరమణ ఒప్పందంపై కూడా ఈ భేటీలో ప్రధానంగా చర్చించనున్నారు. యుద్ధ క్షేత్రంలో ప్రాణాలు కోల్పోయిన చిన్నారుల వస్తువులను చర్చల వేదిక వరకు తీసుకురావడం, యుద్ధం వల్ల కలిగే నష్టాన్ని అమెరికాకు సూటిగా చెప్పాలన్నది తమ ఉద్దేశమని ఇరాన్ గుర్తు చేసింది.
అదాలా ఉంటే.. ఈ భేటీలో కుదిరే ఒప్పందాలు మధ్యప్రాచ్యంలో శాంతి స్థాపనకు ఏ మేరకు దోహదపడతాయన్నదానిపై ప్రపంచ దేశాలన్నీ ఆసక్తిగా ఉన్నాయి. ఇరు దేశాల మధ్య నెలకొన్న వైరాన్ని పక్కన పెట్టి, కాల్పుల విరమణ దిశగా అడుగులు పడాలని అంతర్జాతీయ సమాజం ఆశిస్తోంది. ముఖ్యంగా ఇరాన్ ప్రదర్శించిన ఈ భావోద్వేగ నిరసన, చర్చల దిశను ఎలా మారుస్తుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
