విజయవాడ టెర్రర్ లింక్స్ కేసులో దర్యాప్తు కీలక దశకు చేరుకుంది. ఈ కేసులో అరెస్టై రిమాండ్‌లో ఉన్న మరో ఆరుగురు నిందితులను విచారణ నిమిత్తం పోలీసులు కస్టడీకి అప్పగిస్తూ విజయవాడ కోర్టు ఉత్తర్వు జారీ చేసింది. గురువారం (ఏప్రిల్ 9) నుంచి ఐదు రోజుల పాటు వీరిని పోలీసుల విచారణకు అనుమతిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. నిందితులపై సామాజిక మాధ్యమాల వేదికగా యువతను ఆకర్షించడం, నిషేధిత ఉగ్రవాద సంస్థల భావజాలానికి అనుగుణంగా వారిని ప్రభావితం చేయడం వంటి తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి.
తాజాగా కస్టడీకి తీసుకున్న నిందితులను రహస్య ప్రాంతంలో విచారించి మరిన్ని కీలక విషయాలను రాబట్టాలని పోలీసులు ఆదేశించారు. ఈ కేసులో నిందితులు పాకిస్థాన్‌కు చెందిన హ్యాండ్లతో టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్ వంటి యాప్‌ల ద్వారా నిరంతరం సంబంధాలు కొనసాగుతున్నట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. వీరంతా ఒక రహస్య నెట్‌వర్క్‌గా ఏర్పడి, దేశంలో అశాంతిని సృష్టించేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది.
గత నెలలో విజయవాడలో ముగ్గురు యువకులను అరెస్టు చేయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి రాగా, ఆ తర్వాత హైదరాబాద్, బళ్లారి దేశంలోని వివిధ ప్రాంతాల్లో దాడులు నిర్వహించి పోలీసులు మరికొంతమందిని అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసు తీవ్రత దృష్ట్యా జాతీయ దర్యాప్తు సంస్థ కూడా రంగంలోకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం కస్టడీలోకి తీసుకున్న నిందితుల నుంచి వారి ఆర్థిక వనరులు, వారికి విదేశీ శక్తుల వివరాలను సేకరించడంపై పోలీసులు దృష్టి పెట్టారు. ఈ విచారణ ముగిసిన తర్వాత మరిన్ని కీలక అరెస్టులు జరిగే అవకాశం ఉందని పోలీసులు చెబుతున్నారు.
