దేశంలోనే సంక్షేమ పథకాలను అమలు చేయడంలో ఏపీ అగ్రస్థానంలో నిలిచిందని సీఎం చంద్రబాబు అన్నారు. పల్నాడు జిల్లా వినుకొండలో శనివారం జరిగిన ‘స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర’ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొని మాట్లాడారు. తాము ఎన్నికల్లో ప్రకటించిన సూపర్ పధకాలను సూపర్ హిట్ చేసి చూపించామని, ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటామని చంద్రబాబు అన్నారు. ఈ సందర్భంగా స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఘన వ్యర్థాల సేకరణ కోసం ఏర్పాటు చేసిన ‘స్వచ్ఛ రథాన్ని’, ఈ-ఆటోలను జెండా ఊపి ముఖ్యమంత్రి.
ఏ రాష్ట్రం కూడా ఆంధ్రప్రదేశ్‌కి దరిదాపుల్లో లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. మొదటి తారీఖునే ఎన్టీఆర్ భరోసా కింద పేదలకు పెన్షన్ పంపిణీ చేస్తున్నామని సీఎం చెప్పారు.. తల్లికి వందనం’ ద్వారా ఇంట్లో ఎంతమంది పిల్లలున్నా ఏటా రూ. 15,000 ఆర్థిక సహాయాన్ని నేరుగా వారి ఖాతాలోకి జమ చేస్తున్నామని సీఎం తెలిపారు. ‘అన్నదాత సుఖీభవ’ కింద రైతులకు మూడు విడతల్లో రూ.20 వేల ఆర్థిక సాయం అందించాం” అని చంద్రబాబు స్పష్టం చేశారు.
గత పాలనలో 108 లక్షల మెట్రిక్ టన్నుల చెత్త పేరుకుపోవడంతో ప్రజలు రోగాల బారిన పడ్డారని సీఎం అన్నారు. ప్రభుత్వం అధికారంలోకి రాగానే చెత్తను కూటమి తొలగిస్తున్నామన్నారు. మున్సిపాలిటీల్లో 97% చెత్త సేకరిస్తున్నామని గ్రామాల్లో మార్చికల్లా 100% డోర్ టూ కలెక్ట్ చేస్తామన్నారు. ఘన వ్యర్ధాలను ప్రాసెస్ చేసి చెత్త నుంచి సంపద సృష్టిస్తున్నారని తెలిపారు
టెక్నాలజీతో సుపరిపాలన
పౌర సేవల్లో టెక్నాలజీ వినియోగానికి పెద్దపీట వేస్తున్నామని చంద్రబాబు చెప్పారు. “దేశంలో ఏ రాష్ట్రం కూడా వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా సేవలు అందించడం లేదు. త్వరలో విద్యార్థులకు ఏఐలో శిక్షణ ఇచ్చేందుకు ఏఐ ట్యూటర్‌ను తీసుకువస్తున్నాం. ఇటీవల బిల్ గేట్స్ కూడా రాష్ట్రానికి వచ్చి రైతులు టెక్నాలజీని వినియోగిస్తున్న తీరును చూసి ఆనందం వ్యక్తం చేశారు” అని గుర్తు చేశారు. విశాఖలో గూగుల్ డేటా సెంటర్, అమరావతిలో క్వాంటం కంప్యూటర్ ఏర్పాటు కానున్నాయని చంద్రబాబు చెప్పారు
ఆరోగ్యానికి భరోసా, వ్యవసాయానికి చేయూత
ప్రజల ఆరోగ్యం కోసం యూనివర్సల్ హెల్త్ పాలసీ తీసుకువస్తున్నామని, పేద కుటుంబాలకు ఎన్టీఆర్ వైద్యసేవ ట్రస్టు ద్వారా రూ.25 లక్షల వరకు చికిత్స ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందని హామీ ఇచ్చారు. వ్యవసాయంలోనూ టెక్నాలజీని ప్రవేశపెట్టి సాగును సులభతరం చేస్తామన్నారు. రైతులు పండించే పంటలకు మార్కెట్ ధర అందేలా, సాగునీరు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. వినుకొండను హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దే ఆలోచన ఉందని చంద్రబాబు తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రులు నారాయణ, గొట్టిపాటి రవికుమార్, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభిరామ్, కలెక్టర్ కృతికా శుక్లా నిర్వహించారు.
.webp)