Home Latest News రేవంత్ కీ రోల్ – ముద్ర న్యూస్ – Andhra Waves

రేవంత్ కీ రోల్ – ముద్ర న్యూస్ – Andhra Waves

by andhra andhrawave
0 comments
రేవంత్ కీ రోల్ – ముద్ర న్యూస్


మున్సిపల్ ఫలితాలతో మారిన తీరు
ఏసీసీ దగ్గర ఇమేజ్ పెరిగింది
రాజ్యసభ ఎంపీల ఎంపికలో చక్రం
స్థానిక ఎన్నికల గెలుపుతో ఢిల్లీలో దూకుడు
కేబినెట్ విస్తరణ ఫై మళ్లీ ఆశలు
రేవంత్ లెక్కలకే ఢిల్లీ ఆమోదం..?

ముద్ర, తెలంగాణ బ్యూరో :
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి రేవంత్ రెడ్డి నాయకత్వమే కారణమనే ప్రచారానికి ఇప్పుడు రాష్ట్రంలో ముగిసిన మున్సిపల్ ఎన్నికలు అదే నాయకత్వానికి ఒక యాసిడ్ టెస్ట్‌గా నిలిచాయి. ప్రభుత్వ వ్యతిరేకత పేరుతో జరుగుతున్న ప్రచారాన్ని తిప్పికొట్టి.. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 80 శాతం పైగా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో కాంగ్రెస్ జెండా ఎగరేయడం రేవంత్ రెడ్డి రాజకీయ వ్యూహం చతురతకు నిదర్శనంగా మారింది. ముఖ్యంగా పట్టణ ఓటర్లు కూడా కాంగ్రెస్ వైపు మొగ్గు చూపడం, గతంలో కేవలం గ్రామీణ పార్టీగా ఉన్న ముద్రణను రేవంత్ చెరిపివేయగలిగారు. ఈ విజయంతో ఆయన హైకమాండ్ వద్ద తన పరపతిని అమాంతం పెంచుకున్నారు.

నేనే రాజు.. నేనే మంత్రి
ఢిల్లీ వేదికగా రేవంత్ రెడ్డి చేసిన నేనే రాజు.. నేనే మంత్రి వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీశాయి. అయితే, ఆయన తర్వాత కాలంలో స్పష్టత ఇచ్చారు. తాను ముఖ్యమంత్రిగా ఉండటంతో పాటు, మున్సిపల్ పరిపాలన శాఖను కూడా తానే పర్యవేక్షిస్తున్నందున, ఈ ఎన్నికల గెలుపోటములకు తానే పూర్తి బాధ్యత వహిస్తాననే ఉద్దేశంతో ఆ మాట అన్నట్లు వివరించారు. ఒక సేవకుడిగానే తాను బాధ్యతలు నిర్వర్తిస్తున్నానని చెబుతూనే, భుజానికెత్తుకునే విషయంలో తనకున్న తెగింపును ఈ వ్యాఖ్యల ద్వారా చాటారు.

కాంగ్రెస్‌లో రేవంత్ వ్యతిరేక వర్గం లేదు!
కాంగ్రెస్ పార్టీలో సహజంగా ఉండే గ్రూపు రాజకీయాలు రేవంత్ రెడ్డి విషయంలో ఇప్పుడు మచ్చకైనా కనిపించడం లేదు. పార్టీలో ఆలస్యంగా చేరుకోవడం, సీనియర్లను సమన్వయం చేసుకుంటూనే, తన నిర్ణయాలే ఫైనల్ అనే స్థాయికి ఆయన ఎదిగారు. గతంలో బహిరంగంగా విమర్శలు చేసిన నాయకులు కూడా ఇప్పుడు మౌనం వహించడం. రేవంత్ నాయకత్వాన్ని సమర్థించడం ఆయన సాధించిన అతిపెద్ద రాజకీయ విజయం. హైకమాండ్ పూర్తి మద్దతుతో రాష్ట్ర కాంగ్రెస్‌లో రేవంత్ ఇప్పుడు ఒక్కడే మొనగాడుగా కనిపిస్తున్నారు. రాజగోపాల్ రెడ్డి వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తున్నా ఆయనను ఎవరూ పట్టించుకోవడం లేదు.

జాతీయ స్థాయిలో తదుపరి తరం నేతగా రేవంత్
మున్సిపల్ ఎన్నికల ఫలితాల తర్వాత రేవంత్ రెడ్డి కేవలం తెలంగాణకే పరిమితం కాకుండా, జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ నెక్స్ట్ జనరేషన్ లీడర్‌గా గుర్తింపు పొందుతున్నారు. హిందీ, ఇంగ్లీష్ భాషల్లో అనర్గళంగా మాట్లాడుతూ జాతీయ మీడియా దృష్టిని ఆకర్షించడమే కాకుండా, ఇతర రాష్ట్రాల ఎన్నికల్లో పార్టీకి స్టార్ క్యాంపెయినర్‌గా మారుతున్నారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీల నమ్మకాన్ని చూరగొనడంలో ఆయన సఫలీకృతులయ్యారు.

రాష్ట్రంలో తిరుగులేని పట్టు
వరుసగా అసెంబ్లీ, పార్లమెంట్, పంచాయతీ ఎన్నికల్లో వరుస విజయాలు సాధించడంతో తెలంగాణలో రేవంత్ రెడ్డికి ఎదురులేకుండా పోయింది. అటు విపక్ష బీఆర్ఎస్ బలహీనపడటం, ఇటు బీజేపీ పట్టణ ప్రాంతాలను ఆశించిన స్థాయిలో పుంజుకోకపోవడం రేవంత్‌కు కలిసొచ్చింది. తన సంక్షేమ పథకాలు, దూకుడుగా ఉండే రాజకీయ శైలితో రేవంత్ రెడ్డి తెలంగాణ రాజకీయ యవనికపై ఒక బలమైన ముద్ర వేశారు. ఇది రేవంత్ నాయకత్వ పరంగా పుంజుకోవడానికి కలసి వచ్చింది.

కేబినెట్ విస్తరణ..
మరొవైపు రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఎన్నికల్లో పార్టీ ఏకపక్షంగా విజయం సాధించడంతో అధినాయకత్వం ఇక కొత్త నిర్ణయాలతో సిద్దం అవుతోంది. అందులో భాగంగా ప్రభుత్వం పార్టీలో రేవంత్ కోరుకున్న విధంగా పదవుల ఖరారు.. మార్పుల దిశగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు. ప్రస్తుతం కేబినెట్‌లో ఉన్న ఖాళీల భర్తీతో పాటుగా రెండు మూడు మార్పులు ఖాయంగా మారాయి. పార్టీ.. ప్రభుత్వంలో కీలక పదవుల భర్తీకి తుది కసరత్తు జరుగుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ పార్టీ నేతలతో కలిసి ఢిల్లీలో మకం వేసారు. ఇక.. రాజకీయంగా మరింత బలోపేతం కావాలని రేవంత్ గురించి. అందుకు హైకమాండ్ సైతం ఫ్రీ హ్యాండ్ ఇచ్చేలా నిర్ణయాలు తీసుకుంటోంది. అందులో భాగంగా కేబినెట్ విస్తరణ.. నామినేటెడ్ పదవుల్లో రేవంత్ లిస్టుకు ఆమోదం తెలిపేందుకు స్పష్టమైన సంకేతాలు ఇచ్చింది. అయితే.. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వేళ అజారుద్దీన్ కు మంత్రి పదవి ఇచ్చిన సమయంలో సీనియర్లకు నామినేటెడ్ పదవులు అప్పగించారు. ఇక.. త్వరలో జెడ్పీ ఎన్నికలతో పాటుగా గ్రేటర్ కు ఎన్నికలు జరగాల్సి ఉంది. దీంతో.. ఆ ఎన్నికలు పూర్తయ్యాక మంత్రివర్గ విస్తరణ చేపట్టాలనేది రేవంత్ ఆలోచనగా మారింది. అయితే, కొందరు ఆశావాహులు ఢిల్లీలో తమవంతు లాబీయింగ్ చేస్తున్నారు. రేవంత్ మాత్రం ఎన్నికల్లో మంత్రుల పని తీరు ఆధారంగానే ప్రక్షాళన ఉంటుందని సంకేతాలు ఇస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో.. పార్టీ హైకమాండ్ స్థానిక పరిస్థితులకు అనుగుణంగా తీసుకునేలా రేవంత్ కు ఫ్రీ హ్యాండ్ ఇచ్చినట్లు సమాచారం.

రేవంత్ లెక్కలకే ఢిల్లీ ఆమోదం
రానున్న పరిషత్ ఎన్నికలు, ఇతర రాజకీయ పరిస్థితుల సమయంలో మంత్రివర్గంలో మార్పులు చేర్పులు చేస్తే, పదవులు దక్కని వారి నుంచి అసమ్మతి వ్యక్తమై ఎన్నికలపై ప్రభావం చూపుతుందా అనే కోణంలోనూ హైకమాండ్ ఆరా తీసినట్లు సమాచారం. కేబినెట్‌లో ఇద్దరు ముగ్గురు మంత్రులకు ఉద్వాసన తప్పదనే ప్రచారం సాగుతోంది. రంగారెడ్డి జిల్లా నుంచి మల్ రెడ్డి రంగారెడ్డి, తాండూరు ఎమ్మెల్యే రాంమోహన్ రెడ్డి నల్గొండ జిల్లా నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రధానంగా మంత్రి పదవుల రేసులో ఉన్నారు. అయితే, రాజగోపాల్ రెడ్డికి పదవి దాదాపు లేదనేది స్పష్టం అవుతోంది. కాగా, ప్రస్తుతం ఉన్న వారిలో ఎవరిని తప్పిస్తారనే లెక్కలకు అనుగుణంగా కొత్త వారికి ఛాన్స్ దక్కనుంది. టీపీసీసీ చీఫ్ గా ప్రస్తుత కేబినెట్ మంత్రికి అవకాశం కల్పించి.. మహేష్ గౌడ్ ను తన మంత్రివర్గంలోకి తీసుకోవాలనేది రేవంత్ ఆలోచనగా చెబుతున్నారు. ఢిల్లీ పర్యటన తరువాత రేవంత్ తీసుకునే నిర్ణయాల పైన ఆసక్తి ఉంది.

పెద్దల సభకు ఆయనదే నిర్ణయం
తెలంగాణలో ఎన్నికలు జరగనున్న రెండు రాజ్యసభ స్థానాల కోసం ఇరవై మంది కాంగ్రెస్ నేతలు పోటీ పడుతున్నారు. హైకమాండ్ నుంచి ఓ నేత దిగుమతి అయ్యే అవకాశాలు ఉన్నాయి. రెండు రాజ్యసభ స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేయడంతో రాష్ట్ర రాజకీయాల్లో ఒక్కసారిగా వేడి పెరిగింది. ప్రస్తుత సభ్యులు అభిషేక్ మను సింఘ్వీ , కె.ఆర్. సురేష్ రెడ్డి ల పదవీకాలం ఏప్రిల్ 9తో ముగియనుంది. వీరిలో సింఘ్వీ కాంగ్రెస్ నుంచి.. సురేష్ రెడ్డి బీఆర్ఎస్ నుంచి ఎంపికయ్యారు. మార్చి 16న జరగనున్న ఈ ఎన్నికల్లో శాసనసభలో ఉన్న బలాబలాల ప్రకారం ఈ రెండు స్థానాలను అధికార కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవడం ఖాయంగా మారింది. పార్టీల బలాబలాల విశ్లేషణను పరిశీలిస్తే, 119 స్థానాలున్న తెలంగాణ అసెంబ్లీలో ఒక రాజ్యసభ సీటు గెలవడానికి సుమారు 40 మొదటి ప్రాధాన్యత ఓట్లు అవసరం. కాంగ్రెస్ పార్టీకి సొంతంగా 65 మంది ఎమ్మెల్యేలు ఉండటమే కాకుండా, ఇతర పార్టీల నుంచి చేరిన ఎమ్మెల్యేల మద్దతుతో రెండు స్థానాలను సులువుగా గెలుచుకునే అవకాశం ఉంది. మరోవైపు, ప్రధాన ప్రతిపక్షమైన బిఆర్ఎస్ తన వద్ద ఉన్న సంఖ్యాబలం సరిపోలేదు ఈసారి తన రూపాన్ని కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. బీజేపీ, మజ్లిస్ ఎవరికీ మద్దతుగా ఓట్లేసే అవకాశం లేదు. మజ్లిస్ ఒక వేళ ఓటింగ్‌లో పాల్గొంటే కాంగ్రెస్‌కు సహకరిస్తుంది. అందుకే రెండు సీట్లు కాంగ్రెస్ ఖాతాలోకి వెళ్తాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అందుకే కాంగ్రెస్‌లో అభ్యర్ధులు ఎక్కువగా పోటీ పడుతున్నారు. సీనియర్ సుప్రీంకోర్టు న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీకి రెన్యువల్ దాదాపు ఖాయమని సూచిస్తుంది. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ గళాన్ని వినిపించడంలో, పార్టీకి సంబంధించిన న్యాయపరమైన అంశాలను డీల్ చేయడంలో ఆయన కీలకంగా వ్యవహరించారు. గతంలో ఉప ఎన్నిక ద్వారా ఆయన తెలంగాణ నుంచి ఎంపికయ్యారు, ఇప్పుడు పూర్తి కాలానికి గాను ఆయనను హైకమాండ్ మళ్ళీ బరిలోకి దించే అవకాశం ఉందని పార్టీ వర్గాల సమాచారం.

ఆశల్లో..
ఇక రెండో స్థానం కోసం తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేతల మధ్య తీవ్ర పోటీ. ప్రధానంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సన్నిహితుడైన వేం నరేందర్ రెడ్డి పేరు బలంగా వినిపిస్తోంది. అలాగే మాజీ మంత్రి, సీనియర్ నేత టి. జీవన్ రెడ్డి, మాజీ ఎంపీ మధుయాష్కి గౌడ్, మాజీ వీసీ సుదర్శన్ రెడ్డి, పార్టీలో సీనియర్ అయిన వి. హనుమంతరావు, ఇటీవల బిఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన కె. కేశవరావు వంటి హేమాహేమీలు ఈ రేసులో ఉన్నారు. సామాజిక సమీకరణలు, పార్టీకి చేసిన సేవలను తీసుకుని అధిష్టానం ఎవరిని వరిస్తుందో చూడాలి. సింఘ్వీ అభ్యర్థిత్వం దాదాపు ఖరారు కావడంతో, మిగిలిన ఒక్క సీటు కోసం పైరవీ ఢిల్లీ స్థాయికి చేరుకున్నాయి. పార్టీ విధేయులకే ప్రాధాన్యత ఉంటుందని అధిష్టానం సంకేతాలు ఇస్తున్న సమయంలో, ఈ రెండో బెర్త్ ఎవరికి దక్కుతుందనేది ఇప్పుడు ఉత్కంఠగా మారింది.

సీఎం కీలకం
ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయమే.. రాజ్యసభ అభ్యర్థి ఎంపిక విషయంలో కీలకంగా మారుతుందని. వేం నరేందర్ రెడ్డి కోసం సీఎం ప్రయత్నాలు చేస్తారనే టాక్ ఉంది. మధుయాష్కీ, సుదర్శన్ రెడ్డికి సీఎం తరపున మద్దతు ఉంటుందని బహిరంగంగానే చెబుతున్నారు.

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird