హైదరాబాద్ అత్తాపూర్‌లో ప్రసిద్ధి చెందిన హల్దీరాం స్వీట్ హౌస్‌లో కల్తీ, ఫంగస్ పట్టిన స్వీట్లు విక్రయించిన ఘటన తీవ్ర కలకలం రేపింది. పాడైపోయిన స్వీట్లను కస్టమర్లకు అమ్మ ఆగ్రహం చెందిన బాధితులు పోలీసులు ఆశ్రయించారు. దీంతో అత్తాపూర్ బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు హల్దీ రామ్ స్వీట్ హౌస్ పై కేసు నమోదు చేశారు. ఇటీవల స్వీట్ హౌస్‌లో కొనుగోలు చేసిన స్వీట్లలో ఫంగస్ కనిపించడంతో బాధితులు షాపు నిర్వాహకులను ప్రశ్నించగా సరైన సమాధానం ఇవ్వకుండా నిర్లక్ష్యంగా వ్యవహ రించారు.
కొన్ని స్వీట్లు పూర్తిగా పాడై పోయినా వాటిని విక్రయించేందుకు ప్రయత్నించినట్లు ఆరోపణలు వచ్చాయి. ఆరోగ్యాన్ని ప్రమాదంలో పడేస్తున్నారని భావించిన కస్టమర్లు అందరూ పోలీసులను ఆశ్రయించారు. ఫిర్యాదు స్వీకరించిన అత్తాపూర్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించి అల్దీరాం స్వీట్ హౌస్‌పై బీఎన్ఎస్ చట్టంలోని సెక్షన్లు 79, 274, 275, 115(2), 131, 352 కింద కేసు నమోదు చేశారు. దుకాణంలో ఉన్న అనుమానాస్పద స్వీట్ల నమూనాలను స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ (ఎఫ్ఎస్ఎల్)కు పంపించారు.
పరీక్షల నివేదిక వచ్చిన తరువాత తదుపరి చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. ఈ ఘటన స్థానికంగా ఆందోళ నకు దారితీసింది. నగరంలో మంచి పేరున్న స్వీట్ హౌస్‌లోనే ఇలాంటి ఘటన వెలుగులోకి రావడంతో వినియోగదారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆహార పదార్థాలపై సంబంధిత శాఖలు కఠినంగా తనిఖీలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడితే అట్టి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.
ఆహార పదార్థాల విక్రయంలో నాణ్యత ప్రమాణాలు పాటించాల్సిన బాధ్యత వ్యాపారులపై ఉందని, నిర్లక్ష్యం ప్రాణాంతక పరిణామాలకు దారితీస్తుందని సూచిస్తుంది. ఇదిలా ఉండగా, ఫోరెన్సిక్ నివేదిక వెలువడిన తర్వాత ఈ కేసులో మరిన్ని సెక్షన్లు చేర్చే అవకాశం ఉన్నట్లు సమాచారం…. ఈ ఘటన వెలుగులోకి వచ్చిన వెంటనే ఫుడ్ సేఫ్టీ అధికారులు స్పందించి నగరంలో ఉన్న అన్ని స్వీట్ షాప్‌లపై కొరడా ఝళిపించారు.
