Home ఆరోగ్యం నేడే ఓటర్ డే – Mudra News – Andhra Waves

నేడే ఓటర్ డే – Mudra News – Andhra Waves

by
0 comments
నేడే ఓటర్ డే – Mudra News


పోలింగ్ వివరాలు
కార్పొరేషన్లు : 07 (కరీంనగర్, రామగుండం, నిజామాబాద్, మహబూబ్‌నగర్, మంచిర్యాల, కొత్తగూడెం, నల్గొండ)
విభాగాలు : 414
మున్సిపాలిటీలు : 116
వార్డుల సంఖ్య : 2,582
పోటీలో ఉన్న అభ్యర్ధులు : 12,930
ఓటు హక్కు వినియోగించుకోనున్న ఓటర్లు : 52,43,023 మంది
పురుష ఓటర్లు : 25,62,639
మహిళా ఓటర్లు : 26,80,014
రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్ కేంద్రాల ఏర్పాటు : 8,203
బ్యాలెట్ బాక్స్‌ల ఏర్పాటు : 16,031
రిటర్నింగ్ ఆఫీసర్లు : 1,379 మంది
అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్లు : 1,547 మంది
ప్రిసైడింగ్ అధికారులు : 9,560 మంది
ఎన్నికల విధులు నిర్వర్తించనున్న ఇతర సిబ్బంది : 31,428 మంది
బ్యాలెట్ బాక్స్‌లను భద్రపరచడానికి స్ట్రాంగ్ రూమ్‌లు : 137
ఓట్ల లెక్కింపు కోసం కౌంటింగ్ కేంద్రాల ఏర్పాటు : 136

నేడే ఓటర్ డే
అన్ని పార్టీలకూ అగ్ని పరీక్ష
అందరి దష్టి నగరాలు, పట్టణాలపైనే
అన్ని చోట్ల ఉత్కంఠ పోరు
కార్మికులు, ఉద్యోగులందరికీ పేయిడ్ హాలిడే
నారాయణపేట జిల్లా మక్తల్‌లో 6వ వార్డు అభ్యర్థి ఆత్మహత్య
ఆ వార్డుకు ఎన్నిక రద్దు చేసిన ఎన్నికల సంఘం

ముద్ర, తెలంగాణ బ్యూరో :

రాష్ట్రంలో ‘పుర’ సమరానికి వేళయింది. ఇంకొన్ని గంటల్లో ఏడు కార్పొరేషన్లు… 116 మున్సిపాలిటీల్లో ఎన్నికల పోలింగ్ మొదలుకానుంది. ప్రధాన పార్టీలు, స్వతంత్ర అభ్యర్ధులకు ముచ్చెమటలు పట్టిస్తున్న ఈ ఎన్నికల్లో ఓటర్లు ఎవరికి మొగ్గు చూపుతారు.? రాష్ట్ర రాజకీయాలను శాసించే ఈ ఎన్నికల్లో పట్టణ, నగర ప్రజలు ఏ పార్టీ, అభ్యర్ధిని ఆదరిస్తారనేది సర్వత్రా ఉత్కంఠ రేకెత్తిస్తోంది. అసెంబ్లీ, లోక్ సభ, ఎమ్మెల్సీ, సర్పంచ్ ఎన్నికల్లో కారు స్పీడుకు కళ్లెం వేసి.. రాష్ట్రంలో ఎదురులేని శక్తిగా అవతరించిన అధికార కాంగ్రెస్ పార్టీ ఎన్ని నగరాలు, పట్టణాల్లో విజయం సాధిస్తుందో..? రాష్ట్రంలో కాంగ్రెస్ కు తామే ప్రత్యామ్నాయం అంటూ విస్తృత ప్రచారం నిర్వహించిన బీజేపీ ఈ ఎన్నికల్లో ఎన్ని ‘పుర’ పీఠాలపై కాషాయ జెండా ఎగురవేస్తుంది..? వరుస అసెంబ్లీ ఎన్నికల్లో చతికిలపడ్డ ప్రధాన ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ కనీసం ఈ ఎన్నికల్లోనైనా తన పట్టు నిలుపుకుని ఉనికిని కాపాడుకుంటుందా..? హైదరాబాద్, లోక్ సభ ఎన్నికల్లో హైదరాబాద్ మినహా ఎక్కడా పోటీ చేయని ఎంఐఎం.. ఈసారి అసెంబ్లీ, మున్సిపాలిటీల్లో పోటీ చేయడం ఏ పార్టీకి కలిసొచ్చే అంశంగా మారుతుంది..? ఈ ఎన్నికల్లో మజ్లీస్… ఎక్కడెక్కడ ఎన్నెన్ని స్థానాల్లో గెలుపుబావుటా ఎగురవేస్తుంది..? అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో అధికార పార్టీతో జతకట్టి.. ఈసారి సీపీఐ ఓటు బ్యాంకు ఏ పార్టీ అభ్యర్ధుల ఖాతాలో జమా అవుతాయి..? పలు కారణాలతో బీఆర్ఎస్, పార్టీకి రాజీనామా చేసి.. ఈ ఎన్నికల్లో పార్టీకి ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్ధులకు మద్దతుగా ప్రచారం నిర్వహించిన జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితను ఓటర్లు ఏ మేరకు విశ్వసిస్తారా..? అని రాష్ట్రవ్యాప్తంగా అన్ని నగరాలు, మున్సిపాలిటీల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. రాష్ట్రంలో మొత్తం పార్టీలు, పట్టణాల్లో ప్రధానమైన కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ లతో పాటు ఎంఐఎం సైతం ఈ ఎన్నికల్లో అత్యధిక సీట్లు కైవసం చేసుకునేలా సర్వశక్తులొడ్డాయి. ఒకరికి మించి మరొకరు ఎత్తులకు పైఎత్తులు వేసుకుంటూ రాష్ట రాజకీయాలనూ ఆకర్శించాయి. కాంగ్రెస్ అభ్యర్ధుల గెలుపు కోసం సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు బహిరంగ సభల్లో ప్రసంగించారు. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు ర్యాలీలలో పాల్గొని బీఆర్‌ఎస్‌ను గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. బీజేపీ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు, ఎంపీలు ఎన్నికల ర్యాలీల్లో పాల్గొన్నారు. మరోవైపు జనసేన అభ్యర్థులు ప్రచారం చేశారు. వారి కొందరు సినిమా నటులు ప్రచారంలో ఉన్నారు. ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ప్రచారం పాల్గొంటారనుకున్నా.. తర్వాత రద్దు అయింది. దీంతో ప్రధాన పార్టీల విమర్శలు, ప్రతివిమర్శలతో ఓటర్లు ఎవరిని విశ్వసించారనే ఉత్కంఠ నెలకొంది. దీనికి తోడు అన్ని పార్టీలతో పాటు స్వతంత్ర అభ్యర్ధులూ ఓటర్లను ఆకర్షించేలా సొంతంగా తమ మేనిఫెస్టోలు సిద్ధం చేసి ప్రచారం చేశారు. వీటికి తోడు ప్రచారంలో భాగంగా తెలంగాణలో సుడిగాలి పర్యటన చేయడం, సభలు, సమావేశాలు, రోడ్ షోలు నిర్వహించడం ప్రాధాన్యత సంతరించుకుంది. మరోవైపు.. ఎన్నికల్లో ఏ పార్టీ తనను లక్ష్యంగా పెట్టుకున్న సీట్లు గెలచుకోవాలంటే రాష్ట్రంలో ఓటింగ్ శాతం పెరిగే అవకాశం ఉంది. మొత్తానికి ఉత్కంఠ రేపిన ఈ ప్రచార పోరులో ఓటింగ్ శాతం ఏ మేరకు పెరుగుతుంది..? ఓటర్లు ఏ పార్టీకి జైకొడతారో వేచి చూడాలి.

నేడు రాష్ట్రంలోని ఏడు నగరపాలికలు, 116 పురపాలికలు కలిపి మొత్తం 123 మున్సిపల్, కార్పొరేషన్ల పరిధిలో 2,996 వార్డులు, డివిజన్లకు పోలింగ్ జరగనుంది. ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. ఈ నెల 13న ఉదయం 8 గంటల నుండి ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ఈ ఎన్నికల్లో మొత్తం 52,43,023 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకునేందుకు సిద్ధం అయ్యారు. వీరిలో 25,62,639 మంది పురుష ఓటర్లు కాగా.. మహిళా ఓటర్లు 26,80,014 మంది ఉన్నారు. సాధారణంగా ఏ ఎన్నికల్లో మహిళల కంటే పురుషుల ఓటర్ల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. కానీ ఈ ఎన్నికల్లో మాత్రం పురుషుల కంటే మహిళలే ఎక్కువగా ఉన్నారు. మరోవైపు.. ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 8,195 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. బ్యాలెట్ పద్ధతిలో జరిగే ఈ మున్సిపల్ ఎన్నికల కోసం ఏకంగా 16,031 బ్యాలెట్ బాక్స్‌లను రెడీ చేశారు. మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ పర్యవేక్షణకు 1,379 మంది రిటర్నింగ్ అధికారులను నియమించారు. వీరితోపాటు 1,547 మంది అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్లను ఏర్పాటు చేశారు. 9,560 మంది ప్రిసైడింగ్ ఆఫీసర్లు.. 31,428 మంది ఇతర క్షేత్రస్థాయి మున్సిపల్ ఎన్నికల విధుల్లో పాల్గొంటారు. పోలింగ్ పూర్తి అయిన తర్వాత.. బ్యాలెట్ బాక్స్‌లను భద్రపరచడానికి 137 స్ట్రాంగ్ రూమ్‌లను ఏర్పాటు చేశారు. ఓట్ల లెక్కింపు కోసం 136 కౌంటింగ్ కేంద్రాలను కూడా సిద్ధం చేశారు. ఎన్నికల సంఘం, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మక భద్రతను ఏర్పాటు చేసింది.

కార్మికులు, ఉద్యోగులకు పేయిడ్ హాలిడే
ఎన్నికల మున్సిపల్ ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి వీలుగా నేడు ‘పెయిడ్ హాలిడే’ (వేతనంతో కూడిన సెలవు)గా మంగళవారం కార్మిక శాఖ ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఎన్నికలు జరిగే మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలోని అన్ని ఫ్యాక్టరీలు, దుకాణాలు, వాణిజ్య సంస్థలు, పారిశ్రామిక సంస్థల్లో పనిచేసే కార్మికులు, ఉద్యోగులందరికీ ఈ సెలవు వర్తిస్తుందని ప్రకటించారు. తెలంగాణ ఫ్యాక్టరీస్ అండ్ ఎస్టాబ్లిష్‌మెంట్స్ యాక్ట్ (1974), తెలంగాణ షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్‌మెంట్స్ యాక్ట్ (1988) ప్రకారం ప్రభుత్వం పెయిడ్ హాలీడేను ప్రకటించింది. పోలింగ్ సజావుగా సాగేందుకు, ఉద్యోగులకు సెలవు అమలయ్యేలా చూడాలని కార్మిక శాఖ కమిషనర్, పరిశ్రమల శాఖ డైరెక్టర్, అన్ని జిల్లాల కలెక్టర్లను ప్రభుత్వం ఆదేశించింది. రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ఇచ్చిన అన్ని మున్సిపాలిటీల పరిధిలో ఈ నిబంధనలు కచ్చితంగా అమలు చేయాలని సూచించింది.

పకడ్బందీ ఏర్పాట్లు : డీజీపీ శివధర్ రెడ్డి
రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి చేశామనిజీపీ శివధర్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్ మినహా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లో ఉందని చెప్పారు. 1,183 లైసెన్స్ ఆయుధాలు స్వాధీనం చేసుకున్నామని, 4318 మందిని బైండోవర్, 398 నాన్-బెయిలబుల్ వారెంట్లు జారీ చేశామన్నారు. మంగళవారం హైదరాబాద్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్నికల కోసం 4 రాష్ట్రాల సరిహద్దుల్లో 20 చెక్ పోస్టులు ఏర్పాటు చేసినట్లు వివరించారు. రాష్టంలోని వివిధ జిల్లాల్లో 55 చెక్ పోస్టులు , 181 ప్లయింగ్ స్క్వాడ్స్ సిద్ధం చేశామన్నారు. 167 స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్స్ విధుల్లో ఉన్నారని తెలిపారు. ఇప్పటి వరకు రూ. 3.09 కోట్లు స్వాధీనం చేసుకున్నామన్నారు. రూ.1.29 కోట్ల నగదు, రూ. 1.21 కోట్ల విలువైన మద్యం, రూ.15.7 లక్షల డ్రగ్స్, 28.69 లక్షలకు పైగా విలువ కలిగిన బంగారం, ఇతర విలువైన ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు గుర్తించారు. రాష్ట్రవ్యాప్తంగా 8,203 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయని బందోబస్తు కోసం ఇతర శాఖల నుంచి 3 వేల అదనపు బలగాలను సిద్ధం చేశామన్నారు. పోలింగ్ కేంద్రాల్లో 100 శాతం వెబ్ కాస్టింగ్ ఏర్పాట్లు చేశామన్నారు.
సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లపై నిఘా:
రాష్ట్రంలో 1302 హైపర్ సెన్సిటీవ్, 4975 నార్మల్, 1,926 సెన్సిటీవ్ పోలింగ్ స్టేషన్లు ఉన్నాయని తెలిపారు. తెలంగాణ పోలీసులు 8,203 పోలింగ్ స్టేషన్‌కు తగిన బందోబస్తు ఏర్పాట్లు చేశారు. బందోబస్తు కోసం టీజీఎస్పీ, ఫారెస్ట్, ఎక్సైజ్, సీఐడీ, లీగల్ మెట్రాలజీ తదితర శాఖల నుంచి 3,000 మంది బలగాలు ఉన్నాయి. అన్ని పోలింగ్ స్టేషన్లలో 100 శాతం వెబ్‌కాస్టింగ్, అలాగే హైపర్ సెన్సిటివ్ పోలింగ్ స్టేషన్‌ల బయట కూడా వెబ్‌కాస్టింగ్ ఏర్పాటు చేశామని 9 ఫిబ్రవరి 2026 సాయంత్రం 5 గంటల నుండి సైలెంట్ పీరియడ్ కొనసాగుతుంది. ఎన్నికలు సజావుగా జరిగేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని ఓటర్లు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు.

మక్తల్‌లో ఆరో వార్డు ఎన్నిక రద్దు..
నారాయణపేట జిల్లా మక్తల్ మున్సిపాలిటీలో 6వ వార్డు నుంచి బరిలో ఉన్న బీజేపీ అభ్యర్థి ఎరుకల మహదేవప్ప ఆత్మహత్య చేసుకోవడంతో ఆ వార్డు ఎన్నికను రద్దు చేసినట్లు రిటర్నింగ్ అధికారి శివయ్య తెలిపారు. మరోవైపు మహదేవప్ప ఆత్మహత్యపై విచారం వ్యక్తం చేసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు అతని మరణానికి కాంగ్రెస్ పార్టీ అహంకార రాజకీయాలు, మాఫియా బెదిరింపులే కారణమని పేర్కొన్నారు. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా మక్తల్‌లో బిజెపి ర్యాలీ విజయవంతం కావడంతో అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులు ఓర్వలేక, బిజెపి అభ్యర్థులకు ఫోన్లు చేసి బెదిరింపులకు పాల్పడ్డారని ఆరోపణలు వచ్చాయి. ఈ మాఫియా రాజకీయాలు, అహంకార ధోరణి తట్టుకోలేక మహాదేవప్ప ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోందని ఆయన అన్నారు. ఈ ఘటనపై కేంద్రమంత్రి బండిసంజయ్ కూడా స్పందించారు. మహదేవప్పది ఆత్మహత్య కాదు కాంగ్రెస్ చేసిన హత్య. ఓటమి భయంతోనే బెదిరింపులు, అరాచకాలకు గురవుతున్నారు. కాంగ్రెస్ ను రాళ్లతో కొట్టే పరిస్థితి రాబోతోందని.. మా సహనాన్ని పిరికితనంగా భావిస్తున్నారా? ఎన్నికల తరువాత కాంగ్రెస్ పై యుద్ధం చేయబోతున్నామన్నారు. బీఆర్ఎస్ అరాచకాలకు ఎదురొడ్డి పోరాడిన చరిత్ర బీజేపీ కార్యకర్తలదని ఆయన చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని భూస్తాపితం చేసే రోజులొచ్చాయని.. బీజేపీ కార్యకర్తలు ధైర్యంగా ఉండాలన్నారు.

డీపీజీ కార్యాలయం వద్ద ఆందోళన
మహదేవప్ప ఆత్మహత్యకు కాంగ్రెస్ నేతలే కారణమని ఆరోపిస్తూ టీబీజేపీ నేతలు మంగళవారం హైదరాబాద్‌లోని డీజీపీ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. దీంతో అక్కడ తీవ్ర గందరగోళం నెలకొంది. బీజేపీ నేతలు డీజీపీ ఆఫీస్‌లోకి వెళ్లేందుకు ప్రయత్నించగా ఆందోళనకారులను పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ మేరకు పోలీసులు, బీజేపీ నేతల మధ్య వాగ్వాదం చెలరేగింది.ఈ ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మహదేవప్ప మృతిపై డీజీపీ శివధర్‌రెడ్డి స్పందించారు. మహదేవప్ప ఆత్మహత్య చేసుకున్నట్టు తమకు ఫిర్యాదు వచ్చిందని.. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.

జరగనున్న మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్‌ల పరిధిలో ఉన్న స్కూళ్లకు ప్రభుత్వం సెలవులు ప్రకటించాలని ఎన్నికల కమిషన్ జిల్లా కలెక్టర్లను ఆదేశించింది. దీంతో పోలింగ్ జరగనున్న జిల్లాలను ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. పోలింగ్‌ను దృష్టిలో పెట్టుకుని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, స్థానిక సంస్థలకు సైతం ప్రభుత్వం సెలవు ప్రకటించింది. అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.

పోలింగ్ స్టేషన్లకు చేరిన బ్యాలెట్ బాక్సులు
ఎన్నికల మున్సిపల్‌కు సంబంధించిన సామగ్రి అంతా పోలింగ్ స్టేషన్‌లకు చేరుకుంది. మంగళవారం ఉదయం నుంచి జిల్లా ఏర్పాటు చేసిన మున్సిపల్ డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ కేంద్రాల నుంచి సిబ్బంది సామగ్రి తీసుకుని పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు.

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird