ఆంధ్రప్రదేశ్ లో వన్యప్రాణుల భయం తొలగడం లేదు. రాష్ట్రంలో ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల్లోనూ దాదాపు పక్షం రోజుల పాటు హడలెత్తించిన పులి సంచారం నుంచి బయటపడ్డామని రాష్ట్ర ప్రజలు ఊపిరి పీల్చుకునేలోగానే సత్యసాయి జిల్లాలో చిరుత స్వైర విహారం మొదలైంది.
మడకశిర మండలం ఎల్లోటి గ్రామ పరిసరాల్లో చిరుత సంచారంతో జనం భయంతో వణికిపోతున్నారు. ఎల్లోటి గ్రామ సమీపంలోని ఓ పొలంలో జింక కళేబరం కనిపించడంతో చిరుత సంచారం వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత వచ్చి పరిశీలించిన అధికారులు చిరుత సంచారాన్ని ధృవీకరించారు.
అంతకు ముందు కూడా గ్రామంలో మేక, కుక్కలపై చిరుత దాడి చేసి చంపేసిన సంఘటనలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో గ్రామస్థులు అప్రమత్తంగా ఉండాలంటూ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ముఖ్యంగా పిల్లలను బయటకు పంపాలని సూచించారు. చిరుతను త్వరగా బంధించాలని గ్రామస్థులు కోరుతున్నారు.
