పెద్దపులి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో యథేచ్ఛగా తిరుగుతూ స్థానికులకు, అధికారులకు కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. గత ఆరు రోజులుగా జిల్లాలో రోజు కో చోట కనిపిస్తూ అందరినీ బెంబేలెత్తిస్తోంది. గురువారం (జనవరి 5) రాజమహేంద్రవరం రూరల్ శాటిలైట్ సిటీలోని ఓ జీడి మామిడితోటలో మాటువేసిన ఈ పెద్దపులి, అదే రోజు రాత్రి మండపేట నియోజకవర్గం రాయవరం మండలం కూర్మాపురంలోని ఓ పాడుబడిన ఇంట్లోకి చొరబడి తిష్ఠ వేసింది. శుక్రవారం (జనవరి 6) ఆ ఇంట్లోంచి పులి గాండ్రింపులు విన్న జనం అధికారులకు సమాచారం అందించారు.
వారు హుటాహుటిన అక్కడకు చేరుకుని మత్తు ఇంజక్షన్ ఇచ్చి పులిని బంధించాలని ప్రయత్నించారు. అయితే వారి ప్రయత్నాలు విఫలమయ్యాయి. పాడుపడిన ఇంట్లోంచి బయటకు వచ్చిన పులి పొలాలకు అడ్డంపడి పరుగులు పెట్టింది. స్థానికులు, పోలీసులు, చివరకు అధికారులను సైతం భయంతో పరుగులు తీసేలా చేసింది. పొలాలలో పరుగులు తీస్తూ పెద్దపులి కోరుమిల్లి గ్రామంలోకి ప్రవేశించినట్లు అధికారులు గుర్తించారు. పులిని బంధించడానికి అన్ని ఏర్పాట్లూ చేశామనీ, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు గ్రామస్తులకు సూచించారు. రాత్రి వేళల్లో బయటకు రావద్దని సూచించారు.
.webp)