Home సినిమా Euphoria Movie Review : ‘యుఫోరియా’ మూవీ రివ్యూ – Andhra Waves

Euphoria Movie Review : ‘యుఫోరియా’ మూవీ రివ్యూ – Andhra Waves

by
0 comments
Euphoria Movie Review : 'యుఫోరియా' మూవీ రివ్యూ



నటీనటులు: సారా అర్జున్, భూమిక చావ్లా, గౌతమ్ వాసుదేవ్ మీనన్, నాజర్,
రోహిత్, విఘ్నేష్ గవిరెడ్డి, ఆదర్శ్ బాలక ష్ణ జరిగింది
సినిమాటోగ్రఫీ: ప్రవీణ్ కె.పోతన్
ఎడిటింగ్: ప్రవీణ్ పూడి
సంగీతం: కాలభైరవ
సమర్పణ: శ్రీమతి రాగిణి గుణ
నిర్మాతలు: నీలిమ గుణ, యుక్తా గుణ
బ్యానర్: గుణ హ్యాండ్‌మేడ్ ఫిలిమ్స్
రచన, దర్శకత్వం: గుణశేఖర్
విడుదల తేదీ: 06.02.2026
సినిమా నిడివి: 162.54 నిమిషాలు

మారుతున్న కాలాన్ని బట్టి నేరాలు, వాటి తాలూకు ప్రభావాలు కూడా మారుతూ వస్తున్నాయి. ఒకప్పుడు మైనర్లు నేరాలు చెయ్యడం, జైలుకు వెళ్లడం చాలా తక్కువగా కనిపించేవి. ఇటీవలికాలంలో దాని తాలూకు శాతం బాగా పెరిగిందని చెప్పాలి. పిల్లలు ఇలా దారి తప్పి ప్రవర్తించడానికి, నేరాలు చేయడానికి కారణం ఎవరు అని ప్రశ్నించుకుంటే మొదట వారి తల్లిదండ్రులే కనిపిస్తారు. పిల్లల్ని గల పౌరులుగా తీర్చి దిద్దాల్సిన బాధ్యత వారిదే అనే సమాధానం వస్తుంది. ఇదే పాయింట్‌తో డైరెక్టర్ గుణశేఖర్ ‘యుఫోరియా’ రూపొందించారు. ఇప్పటికే గాడి తప్పిన అతని కెరీర్‌ని మళ్లీ ట్రాక్‌లోకి తెచ్చుకునేందుకు ఓ కొత్త ప్రయత్నంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. మరి ఈ సినిమాతో గుణశేఖర్ తన పూర్వ వైభవాన్ని తెచ్చుకోగలిగారా? సినిమాని ప్రేక్షకులకు కనెక్ట్ చేయడంలో సక్సెస్ అయ్యారా? అనేది చూద్దాం.

కథ:

చైత్ర(సారా అర్జున్) 18 ఏళ్ళు కూడా నిండని ఓ అమ్మాయి. ఐఎస్ ఆఫీసర్ అవ్వాలన్నది ఆమె కల. ఈకాలం టీనేజర్స్‌కి ఉండే కొన్ని లక్షణాలు ఆ అమ్మాయి దగ్గర లేవు. తన లక్ష్యం నెరవేర్చుకోవడం కోసం ఎప్పుడూ చదువు మీదే ధ్యాస పెడుతుంది. ఒకరోజు మధ్యాహ్నం స్నేహితురాలి ఆహ్వానం మేరకు ‘ఆంబ్రోసియా’ అనే పబ్‌లో జరుగుతున్న ‘యుఫోరియా’ ఈవెంట్‌కి వెళుతుంది. ఆ స్నేహితురాలి ద్వారా ఐదుగురు హైఫై కుర్రాళ్లు పరిచయమవుతారు. పార్టీ తర్వాత చైత్రను కారులో ఇంటి దగ్గర డ్రాప్ చెయ్యడానికి బయల్దేరతారు. దారిలో ఆమెకు డ్రగ్స్ ఇచ్చి ఆ ఐదుగురు ఫ్రెండ్స్ ఆమెను దారుణంగా రేప్ చేస్తారు. ఆ తర్వాత పోలీస్ కేసు, కోర్టు ఇతర ప్రాసెస్ అంతా జరుగుతుంది. ధనవంతుల కుటుంబాలకు చెందిన ఆ కుర్రాళ్లు చేసిన నేరం ప్రూవ్ అయ్యిందా? వారిని కోర్టు శిక్షించిందా? తర్వాత జరిగిన పరిణామాలేంటి? అనేది మిగిలిన కథ.

విశ్లేషణ:

ఒక అమ్మాయిని రేప్ చేయడం, ఆ తర్వాత పోలీసులు, కోర్టు, శిక్షలు.. ఇది చాలా సినిమాల్లో మనం చూసిన కథే. యదార్థ ఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్టు దర్శకుడు ముందే చెప్పాడు. అయితే దాన్ని ఈ సినిమాలో కొత్తగా ఎలా చెప్పారు? ఇందులో తీసుకున్న కొత్త పాయింట్ ఏమిటి? అంటే.. పిల్లలు నేరం చేస్తే వారి తల్లిదండ్రులకు కూడా బాధ్యత ఉంటుంది అనే పాయింట్‌పైన ఈ కేసులో ప్రధాన నిందితుడైన వికాస్(విఘ్నేష్ గవిరెడ్డి) తల్లి వింధ్య(భూమిక చావ్లా) తను నేరం చేశానని, తనను శిక్షించమని కోర్టుకెక్కుతుంది. ఈ అంశంతోనే సినిమా. నేరం తర్వాత జరిగిన చైత్ర ఇంటికి వచ్చి తల్లిదండ్రులకు జరిగిన దారుణాన్ని చెప్పిన విధానం, దాన్ని చూపించిన తీరు ఆడియన్స్‌కి బాగా కనెక్ట్ అవుతుంది, నేరస్తులపై విపరీతమైన కోపం తెప్పిస్తుంది. ఎక్కువ సమయం తీసుకోకుండా కొన్ని నిమిషాల్లోనే అసలు కథలోకి వెళ్లిపోయాడు డైరెక్టర్. అక్కడి నుంచి ఫస్ట్‌హాఫ్ వరకు నెక్స్‌ట్ ఏం జరగబోతోంది అంటే క్యూరియాసిటీ కలిగించడంలో సక్సెస్ అయ్యాడు. ఒక విధంగా నేరస్తులకు శిక్ష పడడంతో సినిమా అయిపోయిందా అనిపిస్తుంది. కానీ, అది ఫస్ట్‌హాఫ్. ఇక సెకండాఫ్‌కి వచ్చేసరికి ఫస్ట్‌హాఫ్‌లో ఉన్నంత స్టఫ్ సెకండాఫ్‌లో కనిపించదు. డ్రగ్స్, జైలు సన్నివేశాలు పెంచడం, కొడుకుని పెరోల్‌పై తీసుకొచ్చి ఎగ్జామ్ రాయించాలనుకున్న భూమిక అందులో ఫెయిల్ అయి మందుకు బానిస కావడం, జైల్లోనే వికాస్‌పై పగ పెంచుకున్న సైకో కిల్లర్ వికాస్‌ని చంపాలని ప్రయత్నించడం.. ఇవన్నీ అసలు కథను చూసిన సీన్స్‌లా కనిపించడం తప్ప ప్రేక్షకులను ఆకట్టుకోలేదు. ఇక ప్రీ క్లెయిమాక్స్, క్లెయిమాక్స్ మాత్రం అద్భుతంగా రాసుకున్నారు. అంతేకాదు, విజువల్‌గా కూడా ఆడియన్స్‌కి బాగా కనెక్ట్ అయ్యేలా, ఎమోషనల్ అయ్యేలా చూపించారు. ఎలాంటి వారికైనా క్లెయిమాక్స్ కంటతడి పెట్టిస్తుంది.

నటీనటులు:

ఈ సినిమాలో ప్రధానంగా కనిపించే క్యారెక్టర్లు వికాస్, వింధ్య, చైత్ర. ఈ పాత్రలు పోషించిన విఘ్నేష్, భూమిక, సారా అర్జున్.. వారి క్యారెక్టర్లకు పూర్తి న్యాయం చేశారు. ముఖ్యంగా అందరి కంటే విఘ్నేష్ తన క్యారెక్టర్‌లో జీవించాడని చెప్పాలి. ఈ సినిమా ద్వారా దాదాపు 10 మంది కొత్తవారిని పరిచయం చేశారు గుణశేఖర్. అయితే పెర్ఫార్మెన్స్ పరంగా అందరికీ మంచి మార్కులు పడతాయి. ప్రతి ఒక్కరూ మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. పోలీస్ ఆఫీసర్ జయదేవ్‌గా గౌతమ్ మీనన్ కూడా చాలా డిగ్నిఫైడ్‌గా కనిపించారు.

నిపుణులు సాంకేతిక:

టెక్నికల్‌గా ఈ సినిమాకి ఫోటోగ్రఫీ పెద్ద ప్లస్ అని చెప్పాలి. సినిమా ప్రారంభం నుంచి చివరి వరకు ప్రవీణ్ పోటన్ కెమెరా వర్క్ చాలా బాగుంది. అందులో కొన్ని రిస్కీ షాట్స్ కూడా ఉన్నాయి. ఇక ఎడిటింగ్ విషయానికి వస్తే.. పార్టీకి సంబంధించిన సీన్స్, ఛేజింగ్ సీన్స్ కళ్లకు ఇబ్బంది కలిగించేలా ఎడిట్ చేశారు. కాల భైరవ సంగీతం ఆకట్టుకోలేకపోయింది. పాటల విషయం పక్కన పెట్టేస్తే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కొన్నిచోట్ల బాగుంది అనిపించినా, చాలా చోట్ల రణగొణ ధ్వనులతో నిండిపోయింది. ఇక డైరెక్టర్ గురించి చెప్పాలంటే.. ఫ్లాపుల నుంచి బయట పడేందుకు నానా తిప్పలు పడుతున్న గుణశేఖర్.. సొంతంగా నిర్మించిన ఈ సినిమాతో మరోసారి వార్తల్లోకి వచ్చినప్పటికీ కమర్షియల్‌గా ఆశించిన స్థాయి ఫలితం దక్కే అవకాశం లేదు. సినిమాలోని కొన్ని సీన్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి. వైద్యం సీన్స్ పేలవంగా ఉన్నాయి. తల్లిదండ్రులను బాధ్యుల్ని చేస్తూ చేసిన ఈ సినిమాలో పేరెంట్స్ కూడా చూడలేని సీన్స్ కొన్ని పెట్టారు గుణశేఖర్. వాటి వల్ల వారు కూడా సినిమా చూసే అవకాశం తక్కువ.

ఫైనల్‌గా చెప్పాలంటే..

పాయింట్ మంచిదే. కానీ, తెరపై దాన్ని చూపించిన విధానంలో ఎన్నో లొసుగులు ఉన్నాయి. ఫస్ట్‌హాఫ్ ఎంతో ఎంగేజింగ్‌గా అనిపిస్తుంది. సెకండాఫ్ విషయానికి వస్తే ప్రీ క్లెయిమాక్స్, క్లెయిమాక్స్ వచ్చే వరకు ఆడియన్స్ బోర్ ఫీలవ్వక తప్పదు. పాత కథనే కొత్తగా చెప్పాలనుకున్న గుణశేఖర్ పూర్తి స్థాయిలో సక్సెస్ అవ్వలేదని చెప్పాలి.



రేటింగ్: 2.5/5

– జి.హరా

నిరాకరణ: ఈ సమీక్షలో వ్యక్తీకరించబడిన అభిప్రాయాలు/అభిప్రాయాలు రచయిత పంచుకున్న వ్యక్తిగత అభిప్రాయాలు/అభిప్రాయాలు మరియు సంస్థ వాటికి బాధ్యత వహించదు. వీక్షకుల విచక్షణతో వారికి ప్రతిస్పందించే ముందు సలహా ఇవ్వబడుతుంది.

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird