హైదరాబాదు మణికొండ పరిధిలో అక్రమ నిర్మాణాలపై హైడ్రా అధికారులు కొరడా ఝుళిపించారు. మణికొండ వేంకటేశ్వర కాలనీలో కాలనీకి కేటాయించిన సెప్టిక్ ట్యాంక్ కబ్జా చేసి అక్రమంగా నిర్మించిన ఆరు అంతస్తుల భవనాన్ని హైడ్రా అధికారులు సీజ్ చేశారు. ఈ భవనం విలువ కోట్లగా ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. కాలనీ అవస రాల కోసం కేటాయించిన ప్రభుత్వ భూమిని ఆక్రమించిన ఓ బిల్డర్, మణికొండ మునిసిపల్ అక్రమంగా అనుమతులు పొందినట్లు అధికారులు పేర్కొన్నారు.
నిబంధనలకు విరుద్ధంగా, సెప్టిక్ ట్యాంక్ స్థలంలోనే భవన నిర్మాణ అనుమతులు ఇవ్వడం వెనుక భారీగా ముడుపులు ఇచ్చినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అక్రమ నిర్మా ణం వల్ల కాలనీలో డ్రైనేజ్, పారిశుధ్య సమస్యలు తలెత్తుతున్నాయని ఆవేదన వ్యక్తం చేసిన స్థానికులు హైడ్రా అధికారులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
ఫిర్యాదు అందిన వెంటనే రంగంలోకి దిగిన హైడ్రా అధికారులు స్థల పరిశీలన చేపట్టారు, అన్ని రికార్డులను పరిశీలించిన అనంతరం ఈరోజు ఉదయం అక్రమంగా నిర్మించిన ఆరు అంతస్తుల భవనాన్ని సీజ్ చేశారు. భవనానికి సంబంధించిన అనుమతులు, ఫైళ్లలో తీవ్ర అవకతవకలు ఉన్నట్లు ప్రాథమిక విచారణలో తేలినట్టు సమాచారం. ఈ ఘటనపై సంబంధిత బిల్డర్‌తో పాటు అనుమతులు ఇచ్చిన అధికారులపై కేసులు నమోదు చేసేందుకు హైడ్రామా అధికారులు సిద్ధమవుతున్నారు. అక్రమ నిర్మాణాలపై ఇకపై ఎలాంటి రాజీ ఉండదని, ప్రభుత్వ భూములను కబ్జా చేస్తే వారిపై కఠిన చర్యలు తప్పవని హైడ్రా స్పష్టం చేసింది.
