తెలంగాణ కుంభమేళా మేడారం మహాజాతర ఏర్పాట్లపై భక్తుల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతోంది. ముఖ్యంగా జాతరకు వచ్చి వెళ్లే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా నాలుగు వేలకు పైగా ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశామనీ, అవసరమైతే మరిన్ని బస్సులు నడుపుతామని ప్రకటించిన తెలంగాణ ఆర్టీసీ చివరికి వచ్చేసరికి చేతులెత్తేయడం భక్తుల ఆగ్రహానికి కారణమైంది. మేడారంలో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన బస్టాండ్ వద్ద భక్తులు ఆందోళనకు దిగారు. గంటల తరబడి నిరీక్షించినా ఒక్క బస్సూ రావడం లేదని అసహనం వ్యక్తం చేశారు.
ముఖ్యంగా మేడారం జాతరకు వచ్చిన భక్తులు తిరిగి వెళ్లడానికి బస్సులను ఏర్పాటు చేసే విషయంలో ఆర్టీసీ చేతులెత్తేయడంతో భక్తుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. అధికారులతో తీవ్ర వాగ్వాదానికి దిగిన భక్తులు ఒక ఆర్టీసీ బస్సు అద్దాలు ధ్వంసం చేశారు. మేడారం జాతరకు వచ్చి బక్తుల రిటర్న్ జర్నీ పై ప్రభుత్వ నిర్వహణ చేతులెత్తేసింది.
శుక్రవారం నుంచీ మేడారం మార్గాలన్నీ ట్రాఫిక్ జామ్ తో రాకపోకలు స్తంభించిపోయినా, ట్రాఫిక్ క్రమబద్ధీకరించడంలో ఘోరంగా విఫలమైందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. భక్తుల ఇబ్బందులపై అధికార యంత్రాంగం స్పందించడం లేదన్న ఆగ్రహం వ్యక్తం అవుతోంది.
