హైదరాబాద్ లో కాల్పులు జరిపి మరీ దుండగులు భారీ దోపిడీకి పాల్పడిన ఘటన కలకలం సృష్టించింది. హైదరాబాద్ కోఠీ బ్యాంక్ స్ట్రీట్ లో దుండగులు కాల్పులు జరిపి ఆరు లక్షల రూపాయల నగదు దోచుకున్నారు. ఏటీఎంలో డబ్బులు డిపాజిట్ చేయడానికి వచ్చిన రషీద్ అనే వ్యక్తిపై కాల్పులు జరిపి అతడి నుంచి ఆరు లక్షల దోచుకున్నారు.
ఈ ఘటన శనివారం (జనవరి 31) ఉదయం ఏడు గంటల సమయంలో జరిగింది. దుండగులు జరిపిన కాల్పుల్లో రషీద్ కాలికి బుల్లెట్ గాయం అయ్యింది. గాయపడిన అతడి వద్దనున్న ఆరు లక్షల రూపాయలను లాక్కొని దుండగులు పరారయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని రషీద్‌ను ఆసుపత్రికి తరలించి నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. సీపీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నగరం నడిబొడ్డున, అత్యంత రద్దీగా ఉండే కోఠీలో కాల్పులు జరిపి మరీ నగదు దోచుకున్న ఘటన కలకలం సృష్టించింది.
