పోస్ట్ చేయబడింది జనవరి 25, 2026 5:05PM

హైదరాబాద్ నగరంలో కమర్షియల్ కాంప్లెక్స్‌లలోని సెల్లార్లు అక్రమ వ్యాపారాలకు అడ్డాగా మారుతున్నాయి. అత్యంత రద్దీగా ఉండే బేగంబజార్‌తో పాటు గోషామహల్, అబిడ్స్, సికింద్రాబాద్, అమీర్‌పేట్, పంజాగుట్ట వంటి ప్రధాన కమర్షియల్ ప్రాంతాలు సెల్లార్ గోదాములు, షాపులుగా మార్చి వ్యాపా రాలు వెలుగులోకి వచ్చాయి. నియమావళి ప్రకారం సెల్లార్లు వాహనాల పార్కింగ్‌కి మాత్రమే ఉపయోగించాల్సి ఉండగా, చాలా చోట్ల భారీ స్థాయిలో వ్యాపార సముదాయాలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా బేగంబజార్ ప్రాంతంలో ఉన్న అనేక కమర్షియల్ కాంప్లెక్స్‌ల సెల్లార్‌లలో పెద్ద పెద్ద గోదాములు ఏర్పాటు చేసి చిల్లరతో పాటు హోల్‌సేల్ వ్యాపారాలు నిర్వహిస్తున్నారు.
ముఖ్యంగా బేగంబజార్‌లో అతిపెద్ద కమర్షియల్ కాంప్లెక్స్‌గా గుర్తింపు పొందిన అజీజ్ ప్లాజాతో పాటు మరో ప్రముఖ ప్లాజాలోనూ పరిస్థితి దారుణంగా ఉంది. సెల్లార్ అంతా సరుకులతో నింపి, నడిచేందుకు కూడా వీలులేని స్థితి. కొన్ని చోట్ల సెల్లార్ కాకుండా, మొత్తం భవనంలోని క్యారిడార్లలోనూ సామాగ్రిని నిల్వ చేస్తున్నారు.సెల్లర్లలో వ్యాపారాలు జరుగుతున్న కారణంగా మెట్లు, ఎమర్జెన్సీ ఎగ్జిట్లు పూర్తిగా బ్లాక్ అవుతున్నాయి. ఏదైనా అగ్నిప్రమాదం లేదా ఇతర అపాయం సంభవిస్తే బయటికి రావడానికి మార్గాలు లేక ప్రాణనష్టం జరిగే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తుంటారు.
కొన్ని భవనాల్లో మెట్ల పైనే వ్యాపారాలు నడుస్తుండటం మరింత ఆందోళన కలిగిస్తోంది. అంతేకాకుండా సెల్లార్లలో పార్కింగ్‌కు బదులు వ్యాపారాలు నిర్వహించడం వల్ల వాహనదారులు రోడ్లపైనే వాహనాలను నిలిపివేస్తున్నారు. దీంతో ట్రాఫిక్ సమస్య తీవ్రంగా మారింది, పాదచారులకు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. నాంపల్లి ఘటన తర్వాత ప్రజల డిమాండ్ ఇటీవల నాంపల్లిలో జరిగిన అగ్నిప్రమాద ఘటన నేపథ్యంలో సెల్లార్లలో జరుగుతున్న అక్రమ వ్యాపారాలపై ప్రభుత్వం, అధికార యంత్రాంగం కఠినంగా వ్యవహరించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
సెల్లార్లను పూర్తిగా ఖాళీ చేయించడం, నిబంధనల ప్రకారం పార్కింగ్‌కే పరిమితం చేయడం, భవన భద్రతపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించడం అవసరం. నగరంలో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో, అధికారుల నిర్లక్ష్యం కొనసాగితే భారీ ప్రాణనష్టం తప్పదన్న భయం వ్యక్తమవుతోంది. ఇప్పటికైనా సంబంధిత శాఖలు స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలని నగరవాసులు ఆశిస్తున్నారు.
