జనవరి 21, 2026 9:47AMన పోస్ట్ చేయబడింది

స్థానికుల చొరవతో భారీగా ఎర్రచందనం పట్టుబడిన సంఘటన నెల్లూరు జిల్లా ఉదయగిరి మండలం అర్లపడియ ప్రాంతంలో జరిగింది. చెన్నం బావి చేను మూల వద్ద అక్రమంగా ఎర్రచందనం దుంగలను స్మగ్లింగ్ చేస్తున్న వాహనాన్ని స్థానికులు వెంబడించి నిలిపివేశారు. అయితే ఆ వాహనంలో ఉన్న ముగ్గురు వ్యక్తలూ పరారయ్యారు. అనంతరం వాహనాన్ని తనిఖీ చేయగా, వరిపొట్టు బస్తాల కింద చాకచక్యంగా దాచిన ఎర్రచందనం దుంగలు బయటపడ్డాయి. దీంతో స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వాహనాన్ని, అందులోని 30 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న చందనం విలువ సుమారు 20 లక్షల రూపాయలు ఉంటుందని, వాహనం విలువ మరో 5 లక్షల రూపాయల వరకు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. జిల్లా ఎస్పీ అజిత వేజేండ్ల ప్రకారం, డీఎస్పీ పర్యవేక్షణలో ఈ కేసు దర్యాప్తు జరుగుతోంది. పరారీలో ఉన్న ముగ్గురు నిందితుల కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు పోలీసులు.
