జనవరి 21, 2026 1:48PMన పోస్ట్ చేయబడింది

ఒకప్పుడు క్రికెట్ ప్రపంచంలో రాజాజుగా వెలుగొందిన వెస్టిండీస్ టీమ్ ఇటీవలి కాలంలో క్రికెట్ లో పసికూనల చేతిలో కూడా చిత్తవుతోంది. తాజాగా విండీస్ జట్టు ఆప్ఘనిస్థాన్ చేతిలో చిత్తైంది. దుబాయ్ వేదికగా ఆప్ఘనిస్థాన్, వెస్టిండీస్ జట్ల మధ్య జరుగుతున్న మూడు మ్యాచ్ ల టి20 సిరీస్ లో తొలి మ్యాచ్ లో ఆప్ఘనిస్థాన్ 38 పరుగుల ఆధిక్యతతో విజయం సాధించింది.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ చేపట్టిన ఆప్ఘనిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 181 పరుగులు చేసింది. ప్రారంభంలో 19 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన చిక్కుల్లో పడ్డ ఆప్ఘనిస్థాన్ ఆ తర్వాత అనూహ్యంగా పుంజుకుంది. ఇబ్రహీం జద్రాన్ (56 బంతుల్లో 87 నాటౌట్), దర్విష్ రసూలీ(59 బంతుల్లో 84) విండీస్ బౌలర్లను ఓ ఆటాడుకున్నారు.
ఆఫ్గాన్ ఇన్నింగ్స్‌లో రహ్మానుల్లా గుర్బాజ్ డకౌట్ కాగా.. సెదిఖుల్లా అటల్ 2 పరుగులు మాత్రమే చేశాడు. కరేబియన్ బౌలర్లలో జేడన్ సీల్స్, మాథ్యూ ఫోర్డ్ తలో వికెట్ తీశారు. అనంతరం 182 పరుగుల టార్గెట్‌తో బ్యాటింగ్‌కు దిగిన విండీస్.. 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 143 పరుగులు మాత్రమే చేయగలిగింది.
