
మూడు వరుస ఘన విజయాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నవీన్ పొలిశెట్టి.. ఈ సంక్రాంతికి ‘అనగనగా ఒక రాజు’తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమా పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. నూతన దర్శకుడు మారి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మీనాక్షి చౌదరి కథానాయిక. సంక్రాంతి కానుకగా 2026, జనవరి 14న థియేటర్లలో అడుగుపెడుతున్న ఈ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా ఇటీవల విడుదలైన ట్రైలర్ సినిమాపై ఆసక్తిని రెట్టింపు చేసింది. రేపు ‘అనగనగా ఒక రాజు’ థియేటర్లలో పెడుతున్న నేపథ్యంలో.. తాజాగా చిత్ర బృందం ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ ను నిర్వహించింది. (అనగనగా ఒక రాజు)
ఈ సందర్భంగా నవీన్ పొలిశెట్టి.. “మన తెలుగువారికి సంక్రాంతి అనేది ప్రత్యేకమైనది. ఎన్ని బాధలున్నా అవన్నీ మర్చిపోయి మన వాళ్ళను కలుసుకొని సంతోషంగా ఉంటాం. ఒత్తిడిని పక్కన పెట్టి, పిండి వంటలు తింటూ, నలుగురితో నవ్వుకుంటూ చాలా సరదాగా ఉంటాం. అలాంటి ఎనర్జీనే ‘అనగనగా ఒక రాజు’లో చూడబోతున్నారు. ఉన్న జోక్స్ ని సోషల్ మీడియాలో వైరల్ చేసారు. ఒక పర్ఫెక్ట్ పండగ సినిమాలా ఉంది, చాలా బాగుంది అంటూ అన్ని వర్గాల నుంచి మంచి స్పందన లభిస్తోంది. అన్నారు.
కథానాయిక మీనాక్షి చౌదరి మాట్లాడుతూ.. “మేమందరం ఎంతో కష్టపడి పని చేసి.. ఒక మంచి సినిమాతో మీ ముందుకు వస్తున్నాం. ఈ సినిమాపై మీ స్పందన కోసం మేము ఎంతో ఆసక్తిగా కోరుకుంటున్నాము. మీరు ఈ సినిమా ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. సినిమా అంతా నవ్వుతూనే ఉంటారు. హాయిగా నవ్వుతూ.. ఈ సంక్రాంతి పండుగను జరుపుకోండి.” అన్నారు.
రాజుతో పాటు దర్శకుడు మారి మాట్లాడుతూ.. “సినిమా చాలా బాగా వచ్చింది. పర్ఫెక్ట్ ఫెస్టివల్ ఎంటర్టైనర్ ఇది. సంక్రాంతి అనేది తెలుగు ప్రజలకు ప్రత్యేకమైనది. సంక్రాంతి అనేది తెలుగువారికి ఒక ఎమోషన్. సంక్రాంతి కానుకగా మా సినిమా విడుదలవుతుండటం సంతోషంగా ఉంది. పండగను ఎంజాయ్ చేయండి.” అన్నారు.
నిర్మాత సూర్యదేవర నాగవంశీ మాట్లాడుతూ.. “గోదావరి నేపథ్యంలో జరిగే ఒక అందమైన కథతో ఈ సినిమా రూపొందించబడింది. నవీన్ శైలిలో చాలా సరదాగా సినిమా ఉంటుంది. గ్రామీణ నేపథ్యంలో సాగే పొలిటికల్ సెటైర్ ఎపిసోడ్ కూడా ఇందులో ఉంటుంది. సినిమా ఎంత నవ్విస్తుందో.. అదే సమయంలో చివరిలో ఒక మంచి ఎమోషన్ కూడా ఉంటుంది. కామెడీ, ఎమోషన్, ఫైట్, పాటలు ఇలా అన్ని అంశాలతో తెరకెక్కిన పండగ సినిమా. అన్నారు.
