న్యాయవాది ఖాజా మొయిజుద్దీన్ హత్య కేసు దర్యాప్తులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నాంపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని మాసబ్ ట్యాంక్ వద్ద గుర్తుతెలియని దుండగులు కారుతో ఢీకొట్టిన ఘటనలో తీవ్రంగా గాయపడిన న్యాయవాది ఖాజా మొయిజుద్దీన్ చికిత్స పొందుతూ మృతి చెందిన విషయం తెలిసిందే.ఈ కేసులో ఐదుగురు పాలుపంచుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. హత్యకు ఉపయోగించిన స్కార్పియో వాహనాన్ని గుర్తించిన పోలీసులు, వాహన యజమానిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఆరు నెలల క్రితమే కారును మరొకరికి అమ్మినట్లు యజమాని వెల్లడించాడు, కొనుగోలు చేసిన వారు ఇప్పటివరకు తిరిగి మార్చుకోలేదని తెలిపాడు.
గుర్తుతెలియని వారి కారును కొనుగోలు చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. హంతకుల కోసం ఐదు ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. మరోవైపు, కేసు దర్యాప్తును ప్రత్యేక బృందాలు పలు కోణాల్లో వేగవంతం చేశాయి. వక్ఫ్ ఆస్తుల వివాదాల కోణంలోనూ అధికారులు లోతుగా విచారణ చేస్తున్నారు. ముంతాజ్ కాలేజ్, అన్వర్ ఉల్ ఉలూమ్ కాలేజ్, మదరసా హైజా భూముల వ్యవహారాలపై పోలీసులు ఫోకస్ పెట్టారు. 1962లో ఈ మూడు వక్ఫ్ ఆస్తులను మెహబూబ్ ఆలం కుటుంబానికి పరిరక్షణ బాధ్యతలతో అప్పగించినట్లు పాత రికార్డులు చెబుతున్నాయి.
2013లో ఖాజా మొయిజుద్దీన్, దస్తగిరి ఆలం ఖాన్ కలిసి వక్ఫ్ పరిరక్షణ కమిటీ ఏర్పాటు చేసినట్లు సమాచారం. మలక్‌పేట్ ముంతాజ్ కాలేజ్‌కు సంబంధించిన భూములను ఆటో ఫైన్ సర్వీస్ కంపెనీకి విక్రయించిన ఆరోపణలపైనా దర్యాప్తు కొనసాగుతోంది. భూముల లావాదేవీలకు సంబంధించిన పాత డాక్యుమెంట్లు, ఒప్పంద వివరాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. ఖాజా మొయిజుద్దీన్‌పై గతంలో నమోదైన కేసుల వివరాలను కూడా అధికారులు సేకరిస్తున్నారు. ఈ కోరికనే ఖాజా మోహినుద్దీన్ పై మలక్‌పేట్, అబిడ్స్ పోలీస్ స్టేషన్లతో పాటు హైదరాబాద్ సిసిఎస్‌లో నమోదైన కేసులపై సమాచారం పోలీసులు సేకరించారు.
ఖాజా మొయిజుద్దీన్ కుమారుడు ఫిర్యాదు మేరకు మెహబూబ్ ఆలం ఖాన్, ముజాహిద్ ఆలం ఖాన్‌లపై నాంపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. హత్యకు ముందు జరిగిన వివాదాలు, బెదిరింపులు, సీసీటీవీ ఫుటేజ్, కాల్ డేటా, ఆర్థిక లావాదేవీలపై ప్రత్యేక దర్యాప్తు బృందాలు దృష్టి సారించాయి. హత్య వెనుక వక్ఫ్ ఆస్తుల వివాదాలే కారణమా..? అనే కోణంలో పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.
