హైదరాబాద్ నగరంలో హృదయ విదారక ఘటన జరిగింది. మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో బీటెక్ చదువుతున్న యువతి ఆత్మహత్య చేసుకోవడం స్థానికంగా తీవ్ర విషాదాన్ని కలిగించింది. బతుకుతెరువు కోసం నగరానికి వలస వచ్చిన ఓ కుటుంబం బడంపేటలోని న్యూ మారుతి నగర్లో గత రెండు సంవత్సరాల నుండి నివాసం ఉంటున్నారు. ఆ దంపతుల కూతురు కీర్తి (21)గండిపేటలో ఉన్న మహాత్మా గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (MGIT)లో బీటెక్ మూడో సంవత్సరం చదువుతోంది.
ఈ రోజు ఉదయం కాలేజీకి వెళ్లిన కీర్తి, మధ్యాహ్నం సమయంలో ఇంటికి వచ్చి ఇంట్లో ఉన్న డీజిల్‌ను ఒంటిపై పోసుకొని ఆత్మహత్య చేసుకుంది. కుటుంబ సభ్యులు, స్థానికులు ఆమెను రక్షించేందుకు విశ్వప్రయత్నం చేశారు. కానీ ఆమె అప్పటికే పూర్తిగా కాలిపోయింది. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని ఉస్మానియా జనరల్ హాస్పిటల్‌కు తరలించారు. కీర్తి సోదరుడు నాగరాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
యువతి ఆత్మహత్యకు గల కారణాలు ప్రస్తుతం తెలియలేదు. వ్యక్తిగత సమస్యలేనా, చదువు ఒత్తిడేనా లేదా ఇతర కారణాలేమైనా ఉన్నాయా అన్న కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు, బంధువులు మరియు స్థానికులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. పోలీసులు పూర్తి వివరాలు వెలుగులోకి రావాల్సి ఉంది.
