తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు మంత్రి సీతక్క లీగల్ నోటీసు పంపారు. మంత్రి సీతక్క కేసీఆర్ కు లీగల్ నోటీసు పంపించడం రాష్ట్రంలో సంచలనం సృష్టించింది.
అంగన్ వాడీలకు మొబైల్ ఫోన్ ల కొనుగోలు వ్యవహారంలో తనపై అసత్య ప్రచారాలు చేస్తున్నారంటూ మంత్రి సీతక్క కేసీఆర్ కు నోటీసులు పంపారు. బీఆర్ఎస్ అఫీషియల్ సోషల్ మీడియా ఖాతాలలో అంగన్ వాడీలకు సెల్ ఫోన్ల వ్యవహారంలో భారీగా అవినీతి జరిగిందంటూ వరుస పోస్టులు తన వ్యక్తిగత ప్రతిష్ఠకు భంగం కలిగించాయని సీతక్క నోటీసులో పేర్కొన్నారు.
బీఆర్ఎస్ అఫీషియల్ సోషల్ మీడియా కార్యకలాపాలకు పార్టీ అధినేత కేసీఆర్ బాధ్యత వహించాలని సీతక్క, ఆ పోస్టులన్నిటినీ వెంటనే తొలగించి.. 48 గంటల్లో కేసీఆర్ బహిరంగంగా క్షమాపణ చెప్పాలని నోటీసుల్లో పేర్కొన్నారు. తాను విధించిన నిర్ణీత గడువులోగా కేసీఆర్ స్పందించకుండా ఆయనపై సివిల్, క్రిమినల్ చర్యలు తీసుకున్నట్లు తెలిసింది. సీతక్క కేసీఆర్ కు లీగల్ నోటీసు పంపిన వ్యవహారం ప్రస్తుతం తెలంగాణ రాజకీయాలలో హాట్ టాపిక్ గా మారింది.
