ఆంధ్రప్రదేశ్లో అకాల వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. రెండంటే రెండు రోజుల వ్యవధిలో అకాలవర్షాలకు తొమ్మండుగురు మృత్యువాత పడ్డారు. అకాల వర్షాలతో పాటు పిడుగుల వర్షం కూడా పడుతోంది. దీంతో రెండు రోజులలో పిడుగుపాటుకు రాష్ట్రంలో 9 మంది మరణించారు. సోమవారం (ఏప్రిల్ 6) ప్రకాశం జిల్లాలో ఐదుగురు, విజయనగరం జిల్లాలో ఒకరు పిడుగుపాటు కారణంగా మృత్యువాత పడ్డారు.
దర్శి మండలం చామంతపూడిలో ఆవుల మల్లికార్జున్ (22), ముండ్లమూరు మండలం పసుపుగల్లులో రావులపల్లి శివరామకృష్ణ పిడుగుపాటుకు మరణించారు. మార్కాపురం జిల్లా పుల్లలచెరువులోని ఓ మొక్కజొన్న ఫ్యాక్టరీ వద్ద పిడుగు పడి కన్నయ్య అనే యువకుడు చనిపోగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఇదే వారి యండ్రపల్లిలో నాగయ్య, కనిగిరి మండలం కలగట్ల రైల్వేస్టేషన్ వద్ద దుర్గేశ్ అనే మరో వ్యక్తి పిడుగుపాటుకు బలయ్యారు. మరోవైపు, విజయనగరం జిల్లా వంగరలో పొలంలో పనిచేస్తున్న ఇనముల నర్సమ్మ (48) అనే మహిళా రైతు పిడుగు తాకడంతో అక్కడికక్కడే మరణించారు.
