దేశంలో ఎన్నికల నగారా మోగింది. త్వరలో ఖాళీ కానున్న 37 రాజ్యసభ స్థానాలకు ఎన్నికల షెడ్యూల్ ను కేంద్ర ఎన్నికల సంఘం బుధవారం (ఫిబ్రవరి 18) విడుదల చేసింది. ఆ షెడ్యూల్ ప్రకారం తెలంగాణ సహా 10 రాష్ట్రాలలో మొత్తం 37 రాజ్యసభ స్థానాలకు వచ్చే నెల 16న ఎన్నికలు జరగనున్నాయి. దేశ వ్యాప్తంగా 10 రాష్ట్రాలలో 37 రాజ్యసభ స్థానాలకు ఈ ఏడాది ఏప్రిల్ నెలలో వివిధ తేదీలలో ఖాళీ అవుతాయి. అలా ఖాళీ అయ్యే స్థానాల్లో తెలంగాణ కు చెందిన బీఆర్ఎస్ నాయకుడు కేఆర్ సురేష్ రెడ్డి, అలాగే కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ సింఘ్వీల స్థానాలు కూడా ఉన్నాయి.
కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం రాజ్యసభ ఎన్నికలకు ఈ నెల 26న నోటిఫికేషన్ విడుదల అవుతుంది. నామినేషన్ల దాఖలుకు తుదిగడువు మార్చి 5. కాగా అదే నెల 6న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. నామినేషన్ల ఉపసంహరణకు మార్చి 9 తుదిగడువు. ఇక పోలింగ్ మార్చి 16న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకూ జరుగుతుంది. పోలింగ్ నిర్వహించిన వెంటనే ఓట్ల లెక్కింపు తరువాత ఫలితాల ప్రకటన ఉంది. ఖాళీ అయ్యే మొత్తం 37 రాజ్యసభ స్థానాల్లో మహారాష్ట్రలో 7 స్థానాలు, తమిళనాడు 6, పశ్చిమ బెంగాల్ 6 , బిహార్ 4, అస్సాం 3, ఒడిశా 3 , ఛత్తీస్గఢ్ 2, తెలంగాణా- 2 స్థానాలు ఉన్నాయి, అలాగే హర్యానా -1 హిమాచల్ ప్రదేశ్ నుండి 1 స్థానం ఉంది.
.webp)