పంజాబ్‌లోని లా కాలేజీలో ఒక విద్యార్ధి సహవిద్యార్ధినిపై కాల్పులు జరిపిన ఘటన కలకలం సృష్టించింది. ఓ యువకుడు క్లాస్ రూములో యువతి యువతిని కాల్చి చంపి, తను కూడా అదే తుపాకితో కాల్చుకున్నాడు. సోమవారం ఈ ఘటన. తార్న్ తరణ్ జిల్లాకు చెందిన ప్రిన్స్ రాజ్, సందీప్ కౌర్‌లు ఉస్మా గ్రామంలోని లా కాలేజీలో ఫస్ట్ ఇయర్ చదువుతున్నారు. ఏమైందో ఏమో తెలీదు కానీ, రాజ్.. కౌర్‌పై పగ పెంచుకున్నాడు.
సోమవారం ఉదయం కాలేజీకి రాగానే ఈ దారుణానికి ఒడిగట్టాడు. తన వెంట తెచ్చుకున్న తుపాకితో క్లాస్ రూములో కౌర్‌పై కాల్పులకు తెగబడ్డాడు. దీంతో కౌర్ అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. కౌర్ చనిపోయిందని ధృవీకరించుకున్న తర్వాత రాజ్ అదే తుపాకీతో తనను కాల్చుకున్నాడు. కాలేజీ యాజమాన్యం ఇచ్చిన సమాచారంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. తీవ్ర గాయాలపాలైన రాజ్‌ను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. రాజ్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. పోలీసులు రాజ్ ఎందుకు ఈ దారుణానికి పాల్పడ్డాడన్న విషయాన్ని తెలుసుకునే పనిలో పడ్డారు.
